”శోధిని”

Saturday, 15 March 2014

సరదాల రంగుల హోలీ...!


పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ  ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి.  వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి  రంగు వచ్చే రకరకాల పూలతో, ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగులతోనే హోలి జరుపుకోవడం ఉత్తమం.  కృత్రిమ రసాయనిక రంగులు వాడి చర్మ వ్యాధులు తెచ్చుకోవడం మూర్ఖత్వం.  అంతేకాదు రసాయనిక రంగులు వాడటం వలన కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని మరచిపోవద్దు.  రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ,  సున్నితమైన రంగులతో సరదాగా కాసేపు ఆడుకుని, ఆవెంటనే వంటికి అంటిన రంగుల్ని తొలగించుకోండి.  ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలి పండుగను ఆనందంగా జరుపుకోండి.

                        అందరికీ హోలీ శుభాకాంక్షలు!

Thursday, 13 March 2014

పనిమనిషి ---- యజమానురాలు !

యజమానురాలు : "నేను ఇచ్చిన చీరలు కట్టుకుని పనిలోకి రావద్దు...  తెల్సిందా?"
పని మనిషి : "అదేంటి అమ్మ గారు... అలా అనేశారు!"
యజమానురాలు : "అదికాదే పిచ్చి మొద్దు... మా వారిది వట్టి  వంకరబుద్ధి.  కావాలనే నిన్ను కౌగలించుకొని,'మీ అమ్మగారు అనుకున్నాను'  అంటాడు" అసలు విషయం చెప్పింది.


Sunday, 9 March 2014

మన తెలుగువాడు !


పక్కవాడి ఎదుగుదలను 
జీర్ణించు కోలేనివాడు 
తన మాటే వినాలనే 
అహంభావం కలవాడు 
ఏదోవిధంగా ఎదుటివారిని 
అవమానించడానికో... 
భాదించడానికో... 
నిరంతరం ప్రయత్నించేవాడు 
వాడే ... మన తెలుగువాడు!
 

Friday, 7 March 2014

అంతర్జాతీయ మహిళా దినోత్సవం !



'స్త్రీ' అంటే ఓర్పు, సహనం, ప్రేమ, అణకువ, ఆప్యాయత, త్యాగం, అనురాగం.  తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి జీవితయాత్ర ముగిసే వరకు ఎన్ని కష్టాలు  ఎదుర్కొన్నా...  తన పైనే ఆధారపడి జీవిస్తున్న  పురుషుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం నిజంగా పురుషుల అదృష్టం.  అందుకే ఆమెను త్యాగమూర్తి అన్నారు.  ప్రకృతి స్వరూపిణి అయిన  స్త్రీకి కష్టం కలిగించినవాడు బ్రతికి బట్ట కట్టలేదు.  దాని పర్యావసారం చాలా తీవ్రంగా ఉంటుంది.  ఏ  గృహంలో స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ సిరిసంపదలు తొలగిపొతాయి. ఎక్కడయితే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువయి ఉంటారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సమైక్య శక్తులుగా, సాహస మూర్తులుగా ఉద్యమించాలని కోరుకుంటూ...

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

రూప లావణ్యం!



గులాబీ రెమ్మ 
వెన్నెల కొమ్మ 
మల్లెల మకరందం 
సంపెంగ మనోహరం 
విరజాజి సౌకుమార్యం 
అనురాగ  పరిమళం 
అపురూప లావణ్యం 
ఆప్యాయత సుగంధం  
కలబోసిన సోయగం 
నీ మేని సౌందర్యం !
అందుకే... 
గుండె గుడిలో నీ రూపం 
మనసు నిండా నీ ధ్యానం 

Friday, 28 February 2014

కొత్త రాజకీయ సూత్రం !


'ఇతర పార్టీ నాయకులను' మా పార్టీలో చేర్చుకోవడం న్యాయం ...
'మా పార్టీ నాయకులను' ఇతర పార్టీవాళ్ళు  చేర్చుకోవడం అన్యాయం !

Wednesday, 26 February 2014

'శివోహం'

                     

హిందువులకు గొప్ప పర్వదినం 'శివరాత్రి '.  భక్తి,  ప్రపత్తులతో పూజిస్తూ 'ఓం నమశ్శివాయ... హరహర మహాదేవ... శంభోశంకర' స్మరణతో మారుమ్రోగే రోజు 'శివరాత్రి.  శాంతముర్తి, లింగమూర్తి అయిన శివుడు జ్యోతిర్లింగ రూపంలో అర్చింపబడతాడు... పూజింపబడతాడు. సృష్టి లయకారుడు పరమ శివుడు.  భక్తవశంకరుడు... భోలాశంకరుడు సమస్త జగతికి ఆది గురువు లింగస్వరూపుడు శివుడు.   మాఘమాసం బహుళ చతుర్ధశి రోజున పరమ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడు.  ఈ రోజు త్రినేత్రుని దివ్యరూపం కోటి కాంతులై ప్రజ్వరిల్లుతుంది..  పరమేశ్వరుని మంత్రం 'ఓం నమశ్శివాయ'.  ఈ పంచాక్షరీ మంత్రం పరబ్రహ్మమయం.  ఈ మంత్ర మహిమ గురించి ఈశ్వరుడే స్వయంగా చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మంత్రం పలికినవారికి ఎంతఫలం  కలుగుతుందో ... విన్నవారికీ అంతే  ఫలితం కలుగుతుందని, తెలిసీతెలియక చేసిన పాపాలు, దోషాలు తొలగిపోయి సుఖాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.  ఈరోజున శివక్షేత్రాలు, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం మరింత విశేషదాయకం.    ఈ పర్వదినాన పార్వతీ పరమేశ్వరులకు  కళ్యాణం జరిపించడం ఆచారం.  శివార్చన, ఉపవాసం, జాగారం శివరాత్రి నాడు చేయాల్సిన ముఖ్యమైన మూడు విధులు.  

                    మిత్రులందరికీ శివరాత్రి పర్వదినా శుభాకాంక్షలు!