”శోధిని”

Saturday, 21 January 2012

"పరిధి దాటిన వేళ" కథ పై నా విశ్లేషణ

కథాజగత్,  కథావిశ్లేషణ పోటీకి ! 

రచయిత శ్రీ పి.వి.బి. శ్రీరామమూర్తి గారు వ్రాసిన"పరిధి దాటిన వేళ" కథపై నా విశ్లేషణ
 *******

        కథలో వర్ధనమ్మ బిపీ పేషెంట్.  బిపీ మందులు అయిపోవడంతో మందుల కోసం రోడ్డు పైకి వెళ్ళాల్సి వస్తుంది.   'రోడ్డు పైన ఎదైనా ప్రమాదం జరిగితే నలుగురు ఏమనుకుంటారు?' అని కుటుంబ సభ్యులు సూటి పోటు మాటలతో భాదిస్తారు. ఆమె ఆరోగ్యం కంటే వాళ్ళ పరువు,మర్యాదలే ముఖ్యంగా భావిస్తారు.  ఆమె తన కుటుంబ సభ్యులను ఎంతగా ప్రేమించిందో, వాళ్ళు ఆమె పట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కథలోని ఇతివృత్తం. కన్నబిడ్డలు పట్టించుకోకపోవడం, భర్త బాధపెట్టె మాటలు ఇలాంటి సంఘటనలు వర్ధనమ్మ పాత్రను తీర్చి దిద్దాయి.   కథలో మానవ మనస్తత్వంలోని వైవిధ్యాన్ని విశ్లేషించడం జరిగింది.   కథ రాయడంలో రచయిత చాలా అధ్యాయనం  చేశారనిపిస్తోంది.  వర్ధనమ్మ మానసిక సంఘర్షణ స్పష్టంగా చిత్రించబడింది.  ఆమె కాపురంలో ముప్పయ్ ఏళ్ళలో ఆమె పడిన బాధలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.  ఇలాంటి సంఘటనలు మనకు ఎక్కడో తారస పడినట్లు ఉంటుంది.

        భర్త చెడు తిరుగుళ్ళు తిరిగినా నీలో ఏదో లోపం ఉంది కాబట్టే వాడు బయట తిరుగుతున్నాడని అత్తమామలు       అనడం అన్యాయం.  కనీసం తల్లిదండ్రులతో చెప్పుకుంటే కాస్తన్నాన్యాయం జరుగుతుందనుకుంటే 'లేనిపోని వెధవ ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దని, అసలు ఇలాంటి విషయాలు మాదాగా తీసుకు రావద్దని మందలించే తల్లిదండ్రులు ఉన్నంత కాలం కోడలనేస్త్రీ’కి బాధలు తప్పవు.  విశిష్ట వ్యక్తిత్వం ఉన్న వర్ధనమ్మ జీవితంలోఆటుపోట్లను తట్టుకోలేక ఒకదశలో ఆత్మ హత్య చేసుకుందామనుకుంటుంది.  తరువాత మనసు మార్చుకుని చనిపోతే సాధించేదేముంది, బ్రతికి సాధించాలనుకుంటుంది.  ఇన్నాళ్ళు ఆమె ఒక యంత్రంగా పనిచేసి అరిగి పోయింది.  ఒక ఆప్యాయత లేదు,అనురాగంలేదు.  అందుకే ఆమెలో ఓపిక నశించింది.  కట్టుకున్న వాడికే ప్రేమ లేనప్పుడు కన్నబిద్దలకి ఎందుకుంటుంది? భర్త మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా వుండడం ఎన్నాళ్లని సహిస్తుంది.  వయసులో ఉన్నప్పుడు  భర్త అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రో ఇంటికి చేరితే కనురెప్పలు ముతపడిపోతున్న భర్త కోసం అన్నం తినకుండా ఎదురుచూడడం, అతను తిన్న తర్వాత తను తినడం,రాత్రి పడక గదిలో అతను పెట్టె హింసను భరించడం ఒక్క వర్ధనమ్మకే సాధ్యపడింది.

         ఎన్నో బాధలు అనుభవించిన వర్ధనమ్మ ఇంట్లోనుంచి పారిపోవాలని నిర్ణయం తీసుకున్నదంటే ఆమె మనసు ఎంతగా ఘోషించిందో అర్ధమవుతుంది .  పెద్దవాళ్ళకి కూడా మనసు ఉంటుందని, వాళ్లకి కోరికలు ఉంటాయని నేటి యువత ఆలోచించడం లేదు. అందుకే ఆమె మనోవ్యధను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్ణయానికి వచ్చింది. అదృష్టవశాత్తు టీవీ ప్రకటన ఆమెకి దారి చూపింది.   ప్రకటన వర్ధనమ్మలో నిజంగానే వెలుగు నింపింది. పనిమనిషిగా, తోటి స్త్రీకి తోడుగా ఉండటానికి నిర్ణయం తీసుకోవడంతో కథ ముగుస్తుంది.  అత్యంత సహజంగా వర్ధనమ్మ పాత్రను కనుల ముందుంచిన రచయిత శ్రీ పి.వి.బి . శ్రీరామమూర్తి గారికి అభినందనలు.



Sunday, 15 January 2012

ఈరోజు కనుమ!



  ఈరోజు కనుమ పండుగ.  ఏడాదిపాటు తమకు పాడి పంటలకు సహకరించిన పశువులకు రైతులు కృతఙ్ఞతలు తెలియజేసే పండుగ.   పండుగను గ్రామాలలో చాలా సందడిగా చేస్తారు. వ్యవసాయానికి తమకు ఎంతో చేదోడు, వాదోడుగా ఉన్న పశువులను శుభ్రంగా కడిగి, పసుపు, కుంకుమలను ముఖానికి, కొమ్ములకి పూసి పూలతో అలంకరిస్తారు. మేడలో గంటలు, కళ్ళకి గజ్జలు కట్టి పందెంలో పాల్గొంటారు. అలంకరించిన పశువులను వీధుల్లో ఊరేగిస్తారు. రోజు ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు వేయడం సంప్రదాయం.  అందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు.

జంటనగరాలు సగం ఖాళీ

నిత్యం ట్రాఫిక్ స్థంబనతో కిటకిటలాడే జంటనగరాలు సంక్రాంతి 
పుణ్యమా అని నగర రోడ్లన్నీ బోసిపోవడంతో వాహనాలన్నీ రివ్వున 
దుసుకుపోతున్నాయి.  ఇన్నాళ్ళు వాహనాల జోరు... ప్రమాదాలతో 
బేజారయిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  ఎప్పుడూ నరకాన్ని 
చూపే ట్రాఫిక్ సమస్య ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు.  సిటీ 
బస్సులు సైతం ప్రయాణికులు లేక ఖాళీగా తిరగడంతో వీటి సంఖ్య
కూడా తగ్గింది.   ప్రతిరోజూ రక్తంతో తన దాహం తీర్చుకునే 
రహదారులు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి.  ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడూ
ఇలాగే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్లన్నీ ప్రశాంతంగా ఉంటే
బాగుంటుందనిపిస్తోంది. కానీ అలా జరగదని తెలుసు. ఎందుకంటే మళ్ళీ 
రేపటి నుంచి ప్రజల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు 
షరా మామూలే!


Saturday, 14 January 2012

సంక్రాంతి ప్రత్యేకత!


        ప్రకృతిలో జరిగే మార్పులకు వేదిక మకర సంక్రాంతి.   రోజున సూర్యుడు ఆరు నెలలు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయనంలోకి అడుగు పెడతాడు.   రోజునుంచి హైందవ సంప్రదాయం ప్రకారం అత్యంత శుభాదాయకరమైన సమయం.  పితృదేవతలకు పిండివంటలు, కొత్త బట్టలు నైవేద్యంగా సమర్పిస్తారు.  ఇలా చేయడం వలన పితృదేవతలు తృప్తి పడతారని గట్టి విశ్వాసం.   విధంగా పెద్దలకు భక్తి ప్రపత్తులతో నైవేద్యం సమర్పించుకోవటం సంక్రాంతి ప్రత్యేకతహరిదాసులు, గంగిరెద్దులవాళ్ళు, పగటివేశాగాల్లతో గ్రామాలన్నీ కళను సంతరించుకుంటాయి. స్త్రీలు ఉదయాన్నే లేవడం, ఇంటిముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేయడం, పసుపు, కుంకుమలతో ఇంటి గడపను అలంకరించడం ఆనవాయితి.  సంక్రాంతి అంటే మన సంప్రదాయాని మరచిపోకుండా గుర్తుచేసుకోవడం.  మన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం.   సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతి వాకిళ్ళు కళకళ లాడుతూ ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని మనసార  కోరుకుందాం.

Friday, 13 January 2012

భోగి పండుగ శుభాకాంక్షలు!



సంక్రాంతి అనగానే రంగురంగుల  ముగ్గులు, గుమ్మడి పూలతో అలంకరించిన 
గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల మేలగాళ్ళ సన్నాయి రాగాలు,
రకరకాల గాలిపటాలు గుర్తుకొస్తాయి.  సంక్రాంతి మూడు రోజులు ప్రతి ఇల్లు ముత్యాల 
ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళ లాడుతూ ఉంటాయి.  కోడి పందాలు
ఎడ్ల పందాలు, ముగ్గులపోటీలు, గొబ్బెమ్మల పాటలతో గ్రామాలన్నీ సందడిగా 
ఉంటాయి.  దక్షణాయనం చివరి రోజున భోగి పండుగ జరుపుకుంటారు .   రోజున 
భోగి మంటలు వేసుకుని చలి పులిని పారద్రోలుతారు.  ఇంట్లో ఉన్న వ్యర్ధ సామానులన్నీ
భోగి మంటలో వేసి ఇంటిని శుభ్రపరుచుకోవడం ఆనవాయితి.  మన సంప్రదాయాన్ని,
తెలుగుదనాన్ని చాటిచెప్పే పండుగ భోగి పండుగ.  అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు!