”శోధిని”

Saturday, 18 March 2017

"కలిసుంటే కలదు సుఖం"

"హలో సార్"  అంటూ ఎదురుగా వస్తున్న వారిని పలకరిస్తే ఆహ్లాదం మదిలో చిందులు వేస్తుంది.  స్నేహ పుష్పం మొలకలేస్తుంది.  ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు పంచుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటే ఎంత బాగుండు అని పిస్తుంది.  కానీ, ఒక చోట నివసించేవారు అంటీ ముట్టనట్టు ఎడముఖం, పెడమొహంగా ఉంటే,  అందరితో కలిసిపోవాలనుకునేవారికి కూడా చిరాకనిపిస్తుంది.  ఇతరులతో మాకు సంబంధం ఏమిటనో తలుపులు మూసుకుని ఏకాంత జీవితానికి అలవాటయి పోతున్నారు.  అలా ఉండటంలో ఆనందం ఏమిటో మరి వారికే తెలియాలి.  ఒకరుకొకరు ఎదుటపడి కలుసుకున్నప్పుడు ఎదుటివారే పలకరించాలని,  మనం పలకరిస్తే మన హోదా తగ్గుతుందనే సంకుచిత మనస్తత్వాలు కొందరివి.  వీటన్నిటికీ  కారణం అహం.   అహం మనిషిని మృగంగా మారుస్తుంది.  ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది.   అహం పెరిగితే బంధాలు విచ్చిన్నమైపోతాయి. ఒకరినొకరు
పట్టించుకోకుండా ప్రవర్తిస్తే, ఈర్ష్యాద్వేషాలు సంక్రమించి నిర్లిప్త స్వభావం ఏర్పడుతుంది.  కూలి చేసుకునే పేదవారు కలసి మెలసి కులాసాగా జీవిస్తున్నారు.  ఉన్నదాంట్లోనే తింటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు.  రక్తసంబంధం కాకపోయినా అన్నయ్య, అక్కయ్య అంటూ వరసలు కలుపుకొని కలుపుగోలుగా ఉంటారు.  వారికి ఆస్తులు లేకపోయినా, అభిమానాలుంటాయి. సౌకర్యాలు లేకపోయినా సుఖముంటుంది.  ఇంటికి తులుపులు లేకపోయినా కంటి నిండా నిద్ర పడుతుంది.  ఆ పేదవారిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది.

No comments: