”శోధిని”

Monday, 30 March 2015

కోకిల గానం ఎక్కడ?

వసంత కాలంలో ప్రకృతి కాంతను పులకింపచేస్తూ ఎంతో కమనీయంగా...మరెంతో రమణీయంగా తన గాన మాధుర్యాన్ని వినిపించే కోయిలల గొంతు ఎవరికైనా వినిపించిందా?  వసంత కాలం వచ్చింది... మన్మధ ఉగాది వెళ్ళిపోయింది ...శ్రీరామ నవమి వెళ్ళిపోయింది.  కానీ, కోకిలమ్మ కుహుకుహు రావాలు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.

Friday, 27 March 2015

రమణీయం ...శ్రీరామనామం !



       తండ్రి మాటను నిలబెట్టడానికి తన జీవితాన్ని, యౌవనాన్ని అడవిపాలు
చేసుకున్న శ్రీరామచంద్రుడు  ఎంతో మహాన్నతుడు.  తల్లిదండ్రుల మాట జవదాటని తనయుడిగా, సత్యవాక్పరిపాలకుడిగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడే ధర్మ ప్రభువుగా జీవించి, అందరి మన్నలను పొందాడు.  తమ్ముళ్ళ పట్ల ప్రేమానురాగాలు, భర్యాభార్తల మధ్య ఉండవలసిన అనురాగం, అవగాహన, పిల్లల పట్ల తండ్రి బాధ్యత మొదలైనవన్నీ తాను ఆచరించి లోకానికి తెలియజెప్పిన ఆదర్శముర్తి శ్రీరాముడు.  రమణీయమైన రామకథను ఎందరెందరో కవులు ఎన్నెన్నో భాషల్లో వ్రాసి చరితార్థులయ్యారు.  కోదండరాముని కథని ఎన్నిమార్లు విన్నా, కన్నా, చదివినా తనివి తీరదు. రామబాణం రక్షిస్తుంది... రామహస్తం దీవిస్తుంది... రామ పాదం నడిపిస్తుంది...రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది.
   " శ్రీరామ రామ రామేతి - రమే రామే మనోరమే !
      సహస్ర నామ తత్తుల్యం - రామ నామ వరాననే !! "

లెజెండ్ - 365 రోజులు !



గత సంవత్సరం మార్చి 28న రిలీజ్ అయిన 'లెజెండ్' సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కడప జిల్లా ప్రొద్దుటూరు సెంటర్లలో ఈ సంవత్సరం మార్చి 28 నాటికి  విజయవంతంగా 365 రోజుల పాటు ప్రదర్శించి రికార్డు సృష్టించింది.  నేడు  వస్తున్న సినిమాలు వారం రోజులు ఆడటమే కష్టతరం అయిన ఈ రోజుల్లో  'లెజెండ్'  సినిమా సంవత్సరం పాటు విజయవంతంగా ఆడడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Thursday, 26 March 2015

నవ్వితే నవ్వండి !

నవ్వడం వల్ల ముఖం వికసించి, మనసు ఉల్లాసం అవుతుంది.  దాంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ క్రింది జోక్ చదివి నవ్వు వస్తే నవ్వుకోండి.

తలకి గాయమవడంతో ఆసుపత్రికి  వెళ్ళాడు సుబ్బారావు.
"తలకి కట్టు కడుతూ ఎలా జరిగింది ?"  అడిగాడు డాక్టర్.
"నిద్రలో కలవరించాను డాక్టర్" బాధగా చెప్పాడు.
"కలవరిస్తే ఇంత పెద్ద  దెబ్బ తగిలిందా ?" ఆశ్చర్యంగా అడిగాడు.
"నేను పక్కనుండగా మరో ఆడదాని పేరు కలవరిస్తే తగలదా మరి ?" అసలు విషయం చెప్పింది సుబ్బారావు  భార్య.


Wednesday, 25 March 2015

పవిత్ర గ్రంధాలు !



ప్రతి ఇంటా రామాయణం, మహాభాగవతం, భగవద్గీత  ఈ మూడు పవిత్ర గ్రంధాలు తప్పనిసరిగా ఉండాలి.  ఈ మూడు గ్రంధాలను అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే జీవితానికి ఒక మార్గం కనిపిస్తుంది.    రామాయణం చదవడం వల్ల ఒక మనిషి ఎలా జీవించాలో, మంచి వ్యక్తిగా ఎలా మసలుకోవాలో తెలుస్తుంది.    మహాభాగవతం చదవడం వల్ల భగవంతుడు ఎంతటి కరుణామయుడో,  తన భక్తుల్ని ఆదుకునేందుకు ఎల్లవేళలా ఎలా వెన్నంటి ఉంటాడో అర్థమవుతుంది.  గర్వం, అహాన్ని అణచివేసుకోవాలంటే భగవద్గీతను పారాయణ చేయాలి.  అందుకే ముచ్చటగా ఈ మూడు గ్రంధాలను ఇంట్లో పెట్టుకుని, నిత్యం చదువుతూ ఉండటం ఎంతో అవసరం.

Tuesday, 24 March 2015

త్యాగమూర్తి !

ప్రకృతికి ప్రతీక ' స్త్రీ '!  ఆమె ఇంట్లో స్త్రీ తిరుగుతుంటే ...ఆ ఇల్లు నందనవనంలా, పూజా మందిరంలా ఉంటుంది.    అటువంటి ఇంట్లో ప్రేమ, వాత్సల్యం, త్యాగం, సేవకు కొదవ ఉండదు.   తన వారి కోసం తపనతో, ఆత్రుతతో నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది.  ఉద్యోగం చేస్తూ, ఇల్లు సర్దుతూ, వంట చేస్తూ, పిల్లలను సముదాయిస్తూ అతిధుల్ని ఆదరిస్తూ, గౌరవించే త్యాగమూర్తి. అవసరమైతే  ఎంతటివారినైనా ఎదురించగలదు....  తలచుకుంటే కత్తిపట్టి యుద్ధం చేయగలదు.


Saturday, 21 March 2015

ఉగాది శుభాకాంక్షలు!




నూతన (ఉగాది) సంవత్సర శుభాకాంక్షలు !




మనసుకు ఆహ్లాదానిచ్చే పండుగ ఉగాది.  
తొలకరి చినుకంత అందంగా...చిరుగాలంత స్వచ్ఛంగా...మంచు బిందువంత మధురంగా ఉండే వసంత ఋతువులో కొత్త మార్పును, నూతన ఆనందాన్ని తెస్తుంది యుగాది. లేత చిగుళ్ళు, గాన కోకిలలు, మామిడి పెందెలు, మల్లెల పరిమళాలు, షడ్రుచుల దివ్య ఔషదం ఉగాది పచ్చడి, కొత్త పంచాంగం ఈ పాడుగా ప్రత్యేకతలు.  'అందరూ బాగుండాలి ... అందరూ సంతోషంగా ఉండాలి' అనే భావన అందరిలో కలగాలని మనసారా కోరుకుంటూ ...
జయనమ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, మన్మధ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
అందరికీ నూతన (ఉగాది) సంవత్సర శుభాకాంక్షలు !

Wednesday, 18 March 2015

సినిమాలలో వస్త్రధారణ !


సినిమాల ప్రభావం వ్యక్తుల పైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుందని జగమెరిగిన సత్యం.  హీరో అనుసరించే పద్దతులు, హీరోయిన్స్ ధరించే దుస్తులు సమాజంపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి.  సినీ దర్శక, నిర్మాతలు హీరో  ఒంటి నిండా బట్టలు వేయించి స్టయిల్ గా చూపిస్తారు.  అదే హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి బట్టలు కరువయినట్టు చీలికలు, పేలికలతో అర్థ నగ్నంగా చూపిస్తున్నారు.  హీరో, హీరోయిన్స్ మధ్య ఎందుకంత వ్యత్యాసం.  పాత సినిమాలలో హీరోయిన్స్ కట్టు, బొట్టు చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.  వాళ్లకు ఎంతో గౌరవం లభించేది.  నేడు వస్తున్న హీరోయిన్స్ ఒకరికొకరు పోటీ పడుతూ అసభ్యకరంగా వస్త్రధారణ  చేస్తూ మహిళల పరువు తీస్తున్నారు.  హీరోయిన్స్ కేవలం తమ సంపాదన మాత్రమే  చూసుకోకుండా సమాజంలోని తోటి మహిళలను దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణ చేస్తే బాగుంటుంది. 


Monday, 16 March 2015

హల్ చల్ చేస్తున్న పొగరాయుళ్ళు !

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ఉంది.  కాని, అది ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంది.  ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.  అయితే కేంద్ర జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  దీంతో సంబందిత అధికారులు సైతం తగు చర్యలు తీసుకోవడంపై అంతగా దృష్టి సారించలేక పోతున్నారు.  ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం యదేచ్చగా కొనసాగుతోంది.  మొదట్లో కాస్త హడావుడి కనిపించినప్పటికీ ఆ తురువాత నిషేధం మాట మరచిపోయారు. ఇదే ఆసరాగా తీసుకొని పొగరాయుళ్ళు పొగను ఇష్టమొచ్చినట్టు ఊదేస్తూ హల్ చల్  చేస్తున్నారు. సిగరెట్టు పొగతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ ... ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలుగ జేస్తున్నారు.  పొగ త్రాగడం నేటి యువతకి ఒక ప్యాషన్ అయిపొయింది.  ధూమపానం వల్ల భయంకరమైన వ్యాధులు వస్తాయని తెలిసీ కూడా సిగరెట్టుకు బానిసలవుతున్నారు.  సిగరెట్టు త్ర్రాగే వారికంటే ప్రక్కనున్న వారికే ఎక్కువ ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం.  బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్లను కాల్చుతున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.  ఇప్పటికైనా అధికారులు  పోగరాయుళ్ళపై చర్యలు తీసుకుంటే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

Monday, 9 March 2015

శుభోదయం !


తొలి సంధ్య వేళ ...
కోవెలలో ...
పరవశింపజేసే ప్రకృతి అందాలు 
అత్యంత మనోహరం !

Saturday, 7 March 2015

మహిళలను గౌరవిద్దాం ..ఆడపిల్లలను బ్రతకనిద్దాం !




సమాజంలో స్త్రీల వదనం పైనఎప్పుడూ చిరునవ్వులు విరబూయాలంటే...జన్మనిచ్చిన మహిళలను దేవతగా చూడాలి.  సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు పురుషులతో సమానంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి.  తల్లిదండ్రులుచిన్నతనం నుంచి మగపిల్లలలో  సంస్కారబీజాలను నాటాలి.    మనకు చట్టాలు  ఎన్నో ఉన్నాయి.  కానీ, వాటిని అమలు పరచడంలో అధికారుల లోపం కనబడడంతో నిత్యం మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. మన పాలకులు చెబుతున్నవి ఆచరణలో జరగడం లేదు.  ఇప్పటికైనా మహిళలకు మరింత భద్రత కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాల పైన ఉంది.  కేవలం మహిళా దినోత్సవం రోజునే మహిళలపట్ల గౌరవం పాటిస్తే సరిపోదు.  నిత్యం మహిళల హక్కులు, వారి భద్రత,  వారిని గౌరవించడం, స్వేచ్చ పైన చర్చలు జరుగుతూ ఉండాలి.  అలా జరిగినప్పుడు ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అవుతుంది.  


ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపిన 'మణిదీపం' !


Thursday, 5 March 2015

వసంతోత్సవం !


వసంత ఋతువు ఆగమనాన్ని పురష్కరించుకొని పిల్లలు, పెద్దలు ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా రంగుల పండుగ హోలి. వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  నాడు సంప్రదాయ బద్దమైన హోలీ పండగను ప్రమానురాగాలకు తార్కాణంగా జరుపుకునే వారు. ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో, వేపాకులు, తులసాకులు, పసుపు, కుంకుమ కలిపిన నీటిని వసంతోత్సవంగా జరుపుకునేవారు. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు ప్రబలకుండా ఉంటాయి.   ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగును వాడేవాళ్ళు.  నేడు వాటి స్తానంలో కృత్రిమ రసాయనిక రంగులు మార్కెట్లోకి రావడంతో ప్రజలు వాటి పైన మోజు పెంచుకుని లేని అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు.  అంతేకాదు రసాయనిక రంగులు వాడటం వలన ఒక్కోసారి కంటి చూపు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు.  అనేక చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.  రంగులు చల్లుకోవడంలో తగుజాగ్రత్తలు తీసుకుంటూ,  సహజసిద్ధమైన రంగులతో జరుపుకోవడం సరైన మార్గం.  ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలి పండుగను ఆనందంగా జరుపుకుందాం!

                        అందరికీ హోలీ శుభాకాంక్షలు!