”శోధిని”

Saturday 31 December 2011

ఆంగ్ల నూతన సంవత్సరానికి ఆహ్వానం!



పాత సంవత్సరానికి (2011) వీడ్కోలు చెబుతూ మనసునిండా కొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరానికి (2012) ఆహ్వానం!  గత సంవత్సరంలో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెడదాం.   నూతన సంవత్సరం బ్లాగ్ మిత్రులందరికీ సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను.  మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర (2012) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

Wednesday 28 December 2011

నిషేధం కేసు వీగిపోయింది

జ్ఞానామృత సారం అయిన భగవద్గీతను  తీవ్రవాద సాహిత్యమని , రష్యాలో నిషేదించాలని
కొందరు రష్యన్లు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు
హింసను ప్రేరేపించలేదని, రాయబారానికి కౌరవులు అంగీకరించక పోవడంతో మరో గత్యంత
లేకనే పాండవులతో యుద్ధం చేయించాడన్న విషయాన్ని రష్యన్లు అపార్థం చేసుకున్నారు.
రష్యా కోర్టు భగవద్గీతను బాగా పరిశీలించి కేసును కొట్టివేసిందని తెలిసింది.  ఇది
భారత ప్రజల విజయం.  భగవద్గీత తీవ్రవాద సాహిత్యం కాదని, అదొక ఆధ్యాత్మిక మకరందమని,
మానవాళికి శాశ్వత మణిదీపం అని రష్యన్లు తెలుసుకుంటే మంచిది.


Saturday 24 December 2011

'క్రిస్మన్' శుభాకాంక్షలు.

క్రిస్మస్ అటే దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు. అందుకే ఈరోజు క్రైస్తవ సోదరసోదరీమణులు
భక్తితో పండుగ చేసుకుంటారు. అయితే విచిత్రమేమిటంటే ఈ పండుగలో ఏసుక్రీస్తు కంటే శాంటక్లాజ్,
క్రిస్మస్ ట్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండంతో అసలు సంగతి మరుగున పడిపోతోంది. ఏసుక్రీస్తుకి వేడుకలు,ఆర్భాటాలు అసలు నచ్చవు.
ఆయన ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. అందుకే క్రిస్మస్ ను ఆరాధనాభావంతో చేసుకోవాలి. క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. ప్రభువైన ఏసుక్రీస్తు ఆర్భాటాలకోసంఈ లోకం రాలేదని, సత్యసువార్తను ప్రజలకు భోదించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు. పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. హిందువులు 'శివరాత్రి'ని ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారో, ముస్లీములు 'రంజాన్' ఎంత పవిత్రంగా చేసుకుంటారో అంతే భక్తి శ్రద్దలతో క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవ సోదరసోదరీమణులకు 'క్రిస్మన్' శుభాకాంక్షలు.

Sunday 18 December 2011

భగవద్గీత పైన నిషేధమా?


రష్యాలో భగవద్గీతను నిషేధించాలంటూ కొన్ని సంస్థలు
కోర్టుకి వెళ్ళడం భారతీయులందరినీ అవమానించడమే
అవుతుంది. ఈ దురదృష్టకరమైన వార్త హిందూ మనోభావాలను
దెబ్బతీస్తుంది.  భగవద్గీతను తీవ్రవాద సాహిత్యమంటున్నరష్యన్లు
నిజంగానే పిచ్చివాళ్ళు. ఈ దుశ్చర్యను ప్రతి భారత పౌరుడు  తీవ్రంగా
ఖండించాలి. మనదేశంలో పుట్టిన భగవద్గీతను నిషేధించడానికి
వాళ్ళెవరు?  వెంటనే మన భారత ప్రభుత్వం స్పందించి "భగవద్గీత
పవిత్రమైన గ్రంధం " అని దౌత్యపరంగా ఆ మూర్ఖులకు తెలియచెప్పాలి.

Sunday 11 December 2011

బ్లాగర్లందరికీ అభినందనలు.

బ్లాగుల దినోత్సవం సందర్భంగా శ్రీ వీవెస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం 
(11-12-11) నాడు జరిగిన సమావేశానికి దాదాపు పాతికమంది బ్లాగర్లు 
పాల్గొన్నారు.  కాని ఈ సమావేశంలో స్త్రీ బ్లాగర్లు లేని కొరత కొట్టొచ్చినట్లు
కనబడింది. కేవలం  ఇద్దరు స్త్రీ బ్లాగర్లు మాత్రమే హాజరయ్యారు. దాదాపు 
మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశం చాలా సరదాగా నడిచింది.
హాజరయిన బ్లాగర్లందరూ సభ చివరి వరకు  ఎంతో ఉల్లాసంగా గడిపారు. 
సభ నిర్వాహకులు శ్రీ కశ్యప్ గారు "చాయ్...చాయ్ ..." అంటూ అందరిని 
నవ్వించారు. శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు ఈ సమావేశంలో ప్రత్యేక
ఆకర్షణగా నిలిచారు. సభ్యుల చిరునామాలు నమోదు చేయడం,  ప్రతి 
బ్లాగర్ని పలుకరించి ఫోటోలు తీయడం చూస్తుంటే తెలుగు బ్లాగర్ల పైన 
ఆయనకు ఎంత అభిమానంముందో అర్థమవుతుంది.  మార్కాపురం 
నుంచి విచ్చేసిన శ్రీ రవిశేఖర్ రెడ్డి గారు బ్లాగర్లందరికి ఉపయోగపడే 
మఖ్య విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమతి అపర్ణ గారు తన బ్లాగ్
గురించి, శ్రీ పంతుల గోపాలకృష్ణ  గారు తన బ్లాగ్ "అపురూపం" గురించి 
ఇలా సమావేశానికి హాజరయిన బ్లాగర్లందరూ తమ తమ బ్లాగర్ల గురించి 
వివరించారు.  తెలుగు బ్లాగుల దినోత్సవాన్ని విజయవంతం చేసిన 
బ్లాగర్లందరికీ పేరు పేరున అభినందనలు.

Saturday 10 December 2011

తెలుగు బ్లాగుల దినోత్సవం

నేడు ( డిసెంబర్ 11 ) తెలుగు బ్లాగుల దినోత్సవం 
సందర్భంగా తెలుగు బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షలు!

Tuesday 6 December 2011

కాలమ్ సైజ్ ప్రేమకథ


మనసంతా నువ్వే !
ప్రియా...!

     నీ పరిచయంతో నా బతుకు బాటలో పూతోటలు విరబూసాయి.
నీ మనసొక  ఆత్మీయ సరోవరం. సుకుమారమైన నీ నయనాల
పలకరింపులు సుమధుర మనోహరం. నీ దరహాసంలో ఏదో తెలియని
పరవశం.  నీ స్వరం వింటే కోకిలగొంతు కుడా మూగబోతుంది.
నీలోని ప్రతి అంశం నన్ను మైమరపించాయి.  నీ హావభావాలు నన్ను
మంత్రముగ్దున్ని చేసాయి.  నా మనసంతా నువ్వే నిండిపోయావు.
నా ఉచ్వాస నిశ్వాసాల్లో నిన్ను తప్ప మరేవరిని తలుచుకోలేనంతగా
నీ ప్రేమకు దాసుడయి పోయాను.  మన ప్రేమబంధాన్ని చూసి
ఒర్వలేనివాళ్ళు ఒక పథకం ప్రకారం మన మధ్య చిచ్చు పెట్టారు.
వారి మాయలో పడి మన ప్రేమను నిర్లక్ష్యం చేసావు. అప్పటినుంచి
నాతో ముభావంగా ఉంటున్నావు. నీతో ఏ విధంగా వ్యవహరించాలో
తెలియక నా హృదయం గాలిలో దీపంలా కొట్టుకుంటోంది.  మనం
ఎంచుకున్న అభిలాషలు , లక్ష్యాలు మన జీవితాన్ని నడిపించే
ఇందనాలుగా పనిచేయాలి. అవి కొరబడితే జీవితం నిస్సారంగా,
అర్ధరహితంగా ఉంటాయనడానికి మనమే ఒక నిదర్శనం.  ఎందుకంటే
ప్రేమంటే నీ దృష్టిలో నిర్లక్ష్యం. కాని నా దృష్టిలో మాత్రం అదొక త్యాగం.
ప్రేమంటే శారీరక సంబంధం అనుకుంటావు. నేను మాత్రం పవిత్రమైన
స్నేహబంధం అనుకుంటాను. ప్రేమ మనసులోంచి పుట్టాలి.  గుండె
లోతుల్లోంచి ఉబకాలి. అదే శాశ్వత ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమ
కోసమే నీతో పరిచయం పెంచుకున్నాను. కలిసున్నవాళ్ళంతా
ప్రేమికులు కాలేరని, కలిసి పనిచేసే వాళ్ళంతా సన్నిహితులు కాలేరని
తెలుసుకున్నాను.  స్వచ్చమైన ప్రేమను ఎవ్వరూ నమ్మరు. నటించే
వారివైపు పరుగులు తీస్తారు. మనం  ఇష్టపడే వాళ్ళను కాకుండా
మనల్ని ప్రేమించే వాళ్ళను ప్రేమించాలనే నగ్నసత్యాన్ని తెలుసుకున్నాను.
నీ కిష్టమైన వారిని ప్రేమించు.  కేవలం ప్రేమిస్తే సరిపోదు. ఆప్రేమను
జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాలని నా కోరిక.  నువ్వు నా
జీవితంలో ఓ మంచి స్నేహితురాలిగా మిగిలిపోతే చాలు.
ఇట్లు
ఎప్పుడూ నీ క్షేమాన్ని కోరే ....

Friday 2 December 2011

ఇదిగో, ఇదీ దారి!

image.png

ఇదిగో, ఇదీ దారి!

హైదరాబాద్, December 2nd, 2011
తెలుగు భాష ఎప్పుడు ఎలా పుట్టింది అని జుట్టు పీక్కునే బదులు ఇప్పుడు తెలుగు భాషను ఎలా బ్రతికించుకోవాలి? తెలుగు భాష వాడకానికి తీసుకోవలసిన చర్యలు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఏ భాషను ఆదరిస్తే ప్రజలు ఆ భాషపైన మక్కువ చూపుతారు. మనం ఆంగ్ల భాష వైపు పరుగులు తీస్తున్నామంటే, దానికి కారణం మన ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగు భాషకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వాడకాన్ని ప్రవేశపెడితే తప్పకుండా ప్రజలలో మార్పు వస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగులకు తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలనే నిబంధన వుంటే! ఈ స్థితి వచ్చేదా? ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని స్థాయిల్లో విధిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగు భాషను అమలుపరచాలి. అధికార పత్రాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో ముద్రించి, అందిరికీ అర్థమయ్యేలాచేయాలి.
నేటి తరానికి తెలుగు భాష పైన మక్కువ పెంచాలంటే, తెలుగు భాష సరళంగా ఉండాలి. తెలుగు భాష కనుమరుగు కాకుండా వుండాలంటే, ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు బోధించడాన్ని తప్పనిసరి చేయాలి. తెలుగు భాషపట్ల అభిరుచి కలిగేలా తెలుగు పాఠ్య పుస్తకాల రచనా నిర్మాణం జరగాలి. తెలుగు భాష గొప్పదనాన్ని, అందులోని మాధుర్యాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలి.
టీవీ ఛానల్ వాళ్లకి తెలుగు భాషలో పదాలు లేనట్టు ఆంగ్ల పదాలతో కార్యక్రమాలను తయారుచేసి ప్రజల మీద రుద్దడం మానుకోవాలి. తారల ఇంటర్వ్యూలు, వక్తల ప్రసంగాలలోనూ ఆంగ్ల పదాలు మేళవిస్తూ అతి చక్కని తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికే టీవీ ఛానళ్ల పుణ్యమా అని హిందూ స్ర్తిలలో కొందరు నుదుటున బొట్టు పెట్టుకోవడం మానేశారు. టీవీ ఛానల్ వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాల్లో తెలుగు సంప్రదాయాలు మచ్చుకైనా కనిపించవు. ఇప్పటికైనాతెలుగు టీవీ ఛానళ్ల వారు కళ్ళు తెరచి, పరభాషా వ్యామోహాన్ని తగ్గించి, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, ఉచ్చారణను, తెలుగువారి సంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. మాతృభాషలో పరిపాలన, కళాశాలలో మాతృభాషలో బోధన, టీవీ ఛానళ్ళలో తెలుగు సంప్రదాయ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు మన తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుంది.

Thursday 1 December 2011

ఎయిడ్స్ ఫై అవగాహన పెరగాలి

నేడు అత్యధికులు లైంగిక సంపర్కం వల్ల ఎయిడ్స్ అనే మహమ్మారి
బారిన పడుతున్నారు.  విచ్చలివిడి శృంగారం ద్వారా ఒకరికంటే
ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన ఎయిడ్స్
అనే ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తోంది. అంతేకాకుండా పచ్చబొట్లు
పొడిపించుకోవడం,ఒకరికి ఉపయోగించిన సూదిని మరొకరికి ఉపయోగిండడం,
వ్యాధిగ్రస్తుని రక్తదానం, ఇంజక్షన్లు, షేవింగ్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి
చెందడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరూ
అప్రమత్తతతో మెలగాలి.  ఇప్పటివరకు ఎయిడ్స్ కి సరయిన ట్రీట్మెంట్
లేదు కాబట్టి దానిని నివారించడమే ఉత్తమ మార్గం.  ఈ ఎయిడ్స్ సోకిని
వారితో కరచాలం చేయడం, కలిసి భోజనం చేయడం, కలిసి  పనిచేయడం
ద్వారా ఎయిడ్స్ వ్యాపించదు.  టాయిలెట్లు, బాత్రూములు కలిసి  వాడటం
వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అంతేకాకుండా దోమకాటు, గాలి పీల్చడం
వంటి వాటి  వలన కుడా ఎయిడ్స్ రాదు కాబట్టి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను
సమాజంలో నిరాదారణకు గురికాకుండా చూడాల్సిన భాద్యత  ప్రతి పౌరుడి
మీద ఉంది.  ఎయిడ్స్ భాదితులకు ప్రేమాభిమానాలు పంచి,  మనలో ఒకరిగా 
చూడటం వలన  వారు మరికొన్ని సంవత్సరాలు జీవించడానికి అవకాశం
ఉంది.  ఎయిడ్స్ వ్యాధి పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే ఈ వ్యాధిని
చాలావరకు నివారించవచ్చు.