రంగు రంగు పూలు కనిపించినా... వాటి సువాసనలు తగిలినా మనసుకు ఎంతో ఉల్లాసం, ప్రశాంతతను కలిగిస్తాయి. కొన్ని పూలు మనుషులలో మూడుని, రోమాన్స్ ని కలిగిస్తాయి. అంత మహత్తర శక్తి ఈ పూలకి వుంది. ఎక్కడ పూల తోటలు ఉంటాయో... ఆ పరిసరాలలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ పూలను దేవుని పటాలకు వేయడం, స్త్రీలు తలలో ధరించడం ద్వారా భారతీయ సాంప్రదాయ విశిష్టతను తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా పూల చెట్లకు వుండే పచ్చదనం మన కళ్ళముందు వుంటే, మనలో కలిగే ఆదుర్దా ఇట్టే తగ్గి పోతుంది. కాబట్టి మనం నివచించే చోట పచ్చదనానికి ప్రధాన్యత ఇచ్చి, పూలమొక్కలను పెంచుదాం... మన జీవితాలను ఆనంద భరితం చేసుకుందాం!
Saturday, 12 April 2014
Wednesday, 9 April 2014
వచ్చింది వసంతం ... తెచ్చింది ఉత్తేజం !
ప్రకృతి రమణీయ శోభతో
పచ్చదనం శోభాయమానంగా
పరవళ్ళు తొక్కుతూ
మల్లెల సౌరభాలను మోసుకుంటూ
వచ్చింది ఆమని వయ్యారంగా...
తెచ్చింది అద్భుత వరాలను రమణీయంగా...
మావి చివురు తిన్న
కోయిలమ్మ మనోహరంగా కూస్తుంటే,
పిల్లగాలుల సుమధుర స్వరాలకు
గండు తుమ్మెద నాదం ఝుమంది
ప్రతి చేట్టులోను ఉల్లాసం
ప్రతి హరితలో పరవశం
ఎటు చూసినా పూల సోయగాలు
వాటి ఘుమఘుమలు
వీటిని అపురూపంగా ఆస్వాదిస్తూ
ఆమని హాయిగా రాగాలు ఆలపిస్తుంటే---
కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై
అరమరికలు లేని పలకరింపులతో
ఉత్సాహంగా... వచ్చింది వసంతం
అందరిలోనింపింది నూతన ఉత్తేజం!
Monday, 7 April 2014
రమ్యమైనది ... శ్రీ రామ నామం !
"శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"
రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి
పఠించిన దానితో సమానము అంటారు. కనుక రామనామము అంత విశిష్టమైనది,
అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి, సోదరమైత్రికి లక్ష్మణుడు,
వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి, ప్రభుసేవ,
వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి. కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా
ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే
ఆయన ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
Sunday, 6 April 2014
Wednesday, 2 April 2014
దింపుడు కల్లం !
భర్త చనిపోవడంతో 'లబోదిబో' అని ఏడుస్తోంది వెంకాయమ్మ.
"నువ్వు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాడు తిరిగోస్తాడా?" ఓ పెద్దావిడ ఓదార్చుతోంది.
కొద్దిసేపటికి శవయాత్ర ప్రారభమైంది
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత "ఇది దింపుడు కల్లం, ఇక్కడ శవాన్ని దింపండి " ఓ పెద్ద మనిషి అన్నాడు.
"రోడ్డు మధ్యలో దింపడం ఎందుకు?" ఏడుపు ఆపి అడిగింది వెంకాయమ్మ
"నీ అదృష్టం బాగుంటే దింపుడు కల్లం లో నీ భర్త బ్రతికి లేచి కూర్చుంటాడు... ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయమ్మా"
"ఆ అదృష్టం నాకొద్దు ... ఆయన్ను మళ్ళీ చంపే ఓపిక నాకు లేదు" అసలు విషయం చెప్పింది వెంకాయమ్మ.
Tuesday, 1 April 2014
అమ్మ సేవను మరువకు !
పేగుబంధాన్ని తెంచి...
తన ప్రాణాలను పణంగా పెట్టి...
మన భవిష్యత్తుకు పునాదులు వేసి...
మన కోసం కొవ్వొత్తిలా కరిగిపోయేది... అమ్మ!
ముళ్లబాటలో నడుస్తూ...
తన కడుపు మాడ్చుకుంటూ...
మన కడుపు నింపుతూ...
మన అభివృద్ధి కోసం కర్పూరమై కరిగేది ... అమ్మ!!
మన క్షేమం కోసం అనుక్షణం శ్రమిస్తూ...
మన ఉన్నతి కోసం నిరంతరం పరితపిస్తూ...
మనల్ని కంటికి రెప్పలా కాపాడేది
తానే దీపమై మనకు వెలుగునిచ్చేది... అమ్మ!!!
అందుకే ...! జీవితాంతం
అమ్మ సేవను మరువకు
అమ్మ మనసును నొప్పించకు
Sunday, 30 March 2014
నవ వసంతం!
చైత్ర మాసంలో ప్రకృతి ఏంతో శోభాయమానంగా ఉంటుంది. తక్కువ చలి, తక్కువ వేడి వున్న వాతావరణం ఎంతో సుఖదాయంగా ఉంటుంది. చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు చిగుర్చుటచే ఆకుపచ్చదనం కళ్ళకు ఆనందాన్ని కలుగచేస్తుంది. వసంత ఋతువు చైత్రమాసంతోనే ఆరంభమవుతుంది. ఈ రుతువురాగానే కోయిలలు లేత మామిడి చిగుళ్ళను తింటూ మధురంగా గానం చేస్తుంటాయి. ప్రకృతిని చూసి మనుషులే కాకుండా సకల ప్రాణులు పరవశం చెందేది ఈ రుతువులోనే! వసంత ఋతువులో ప్రకృతి సర్వాలంకార శోభితమై కనువిందు చేస్తుంది. చైత్ర మాసం తొలిరోజే ఉగాది. తెలుగు వారికి నూతనసంవత్సర ప్రారంభ రోజు. ఉగాది రోజున ఆనందంగా ఉంటే , సంవత్సరమంతా శాంతి, సౌఖ్యాలతో జీవితం గడిచిపోతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఉగాది రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి వివిధ రుచులతో కూడిన అనుభూతిని కలిస్తుంది. జీవితంలో ఒడిదుడుకులు, లాభనష్టాలు, తీపి గుర్తులు, చేదు అనుభవాలతో సమతుల్యంగా ఉండాలనేదే దీని అంతరార్థం. మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, పచ్చి మిరపముక్కలతో చేసే పచ్చడిలో ఉండే ఆరు రుచులు జీవితంలోని సుఖనస్టాలకు ప్రతీకలని చెబుతారు. అయితే వేసవి ఆరంభంలో ఈ పచ్చడి తినడం వల్ల శరీరంలో వాత, పిత్తం, కఫ, దోషాలేవైనా ఉంటే పోతాయంటుంది వైద్యశాస్త్రం. వేప పువ్వు క్రిమిసంహారిని. చర్మరోగనివారిణి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లేత మామిడికాయ ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తుంది. పచ్చి మిరప చెవిపోటు, గొంతు వాపు వంటి వ్యాధులను అరికడుతుంది. శారీరంలో కొవ్వును పెరగనీయకుండా చేసేది ఉప్పు, కొత్తబెల్లంలో ఐరెన్ సంవృద్దిగా లభిస్తుంది. ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజునే కాకుండా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా తింటే, రుతుమార్పు వల్ల వచ్చే అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఉగాదిరోజున దేవాలయాలలో, నలుగురు కూర్చుని మాట్లాడుకునే ప్రదేశాలలో పూజారి గారు కొత్త సంవత్సర పంచాంగానికి పూజచేసి, అందులోని విశేషాలను అందరికీ చదివి వినిపించడం ఆనవాయితి. నూతన సంవత్సర వెలుగుకి నాంది పలికే ఉగాదిని ఆహ్వానిస్తూ... శ్రీ జయనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!
తెలుగు వారందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!
Subscribe to:
Posts (Atom)







