”శోధిని”

Sunday, 30 March 2014

నవ వసంతం!

          

           చైత్ర  మాసంలో ప్రకృతి  ఏంతో  శోభాయమానంగా ఉంటుంది.  తక్కువ చలి, తక్కువ వేడి వున్న వాతావరణం ఎంతో  సుఖదాయంగా ఉంటుంది.  చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు చిగుర్చుటచే ఆకుపచ్చదనం కళ్ళకు ఆనందాన్ని కలుగచేస్తుంది.  వసంత ఋతువు చైత్రమాసంతోనే ఆరంభమవుతుంది.  ఈ రుతువురాగానే కోయిలలు లేత మామిడి చిగుళ్ళను తింటూ మధురంగా గానం చేస్తుంటాయి.  ప్రకృతిని  చూసి మనుషులే కాకుండా సకల ప్రాణులు పరవశం చెందేది ఈ రుతువులోనే!  వసంత ఋతువులో ప్రకృతి  సర్వాలంకార శోభితమై కనువిందు చేస్తుంది. చైత్ర మాసం తొలిరోజే ఉగాది.  తెలుగు వారికి నూతనసంవత్సర ప్రారంభ రోజు.  ఉగాది రోజున ఆనందంగా ఉంటే , సంవత్సరమంతా శాంతి, సౌఖ్యాలతో జీవితం గడిచిపోతుందని చాలా మంది నమ్ముతారు.   అందుకే ఉగాది రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.  

       ఉగాది అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి.  ఈ పచ్చడి వివిధ రుచులతో కూడిన అనుభూతిని కలిస్తుంది.  జీవితంలో ఒడిదుడుకులు, లాభనష్టాలు, తీపి గుర్తులు, చేదు  అనుభవాలతో సమతుల్యంగా ఉండాలనేదే దీని అంతరార్థం.  మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, పచ్చి మిరపముక్కలతో చేసే పచ్చడిలో ఉండే ఆరు రుచులు జీవితంలోని సుఖనస్టాలకు  ప్రతీకలని చెబుతారు.  అయితే వేసవి ఆరంభంలో ఈ పచ్చడి తినడం వల్ల  శరీరంలో వాత, పిత్తం, కఫ, దోషాలేవైనా ఉంటే పోతాయంటుంది  వైద్యశాస్త్రం.  వేప పువ్వు క్రిమిసంహారిని. చర్మరోగనివారిణి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  లేత మామిడికాయ ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తుంది.  పచ్చి మిరప చెవిపోటు, గొంతు వాపు వంటి వ్యాధులను అరికడుతుంది.  శారీరంలో కొవ్వును పెరగనీయకుండా చేసేది ఉప్పు, కొత్తబెల్లంలో ఐరెన్ సంవృద్దిగా లభిస్తుంది.  ఈ పచ్చడిని కేవలం ఉగాది రోజునే కాకుండా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా తింటే, రుతుమార్పు వల్ల  వచ్చే అనేక సమస్యలను దూరం చేస్తుంది. ఉగాదిరోజున దేవాలయాలలో, నలుగురు కూర్చుని  మాట్లాడుకునే ప్రదేశాలలో పూజారి గారు కొత్త సంవత్సర పంచాంగానికి పూజచేసి, అందులోని విశేషాలను అందరికీ  చదివి వినిపించడం ఆనవాయితి.   నూతన సంవత్సర వెలుగుకి నాంది పలికే ఉగాదిని ఆహ్వానిస్తూ... శ్రీ జయనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!

            తెలుగు వారందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!

No comments: