”శోధిని”

Wednesday, 10 April 2013

అందరికీ ఉగాది శుభాకాంక్షలు!



             ఉగాది తెలుగువారి సంవత్సరాది.  జీవితాల్లో ఉషస్సులు నింపే పండుగ .  కాని,నేటి యువత జనవరి 1న ఆంగ్ల  సంవత్సరానికి  అలవాటు పడటంతో ఎంతో  విశిష్టత వున్న  ఉగాదిని మొక్కుబడిగా జరుపుకొవడం ఆనవాయితీగా మారిపోయింది.  ఫలితంగా మన భాష, సంస్కృతి , సంప్రదాయాలు క్రమేణా కనుమరుగున పడుతున్నాయి.  ఇప్పటికైన మన ఉగాది పండుగ గొప్పదనాన్ని పిల్లలకు వవరించి మన సంస్కృతిని కాపాడుకుందాం. 

        చైత్ర మాసంలో ప్రకృతి  ఎంతో  శోభాయమానంగా ఉంటుంది.  చెట్ల ఆకులు రాల్చి, కొత్త చిగుళ్ళతో ఆకుపచ్చదనం కళ్ళకు సుఖాన్ని, ఆనందాన్ని కలుగచేస్తుంది.  వసంత ఋతువు  చైత్ర మాసంలోనే ఆరంభమవుతుంది.  ఈ రుతువులోనే కోయిల లేత మామిడి చిగుళ్ళను తింటూ, మధురంగా గానం చేస్తుంది.  ప్రకృతిని చూసి సకల ప్రాణులు పరవశం చెందేది ఈ రుతువులోనే.  అందుకే ఈ ఋతువుకు రుతురాజు అనే పేరు సార్థకమైంది. 

        వసంత ఋతువులో ప్రకృతి  సర్వాంకార శోభితమై కనువిందు చేస్తుంది.  వసంత ఋతువులో చైత్రంమాస, శుక్లపక్ష పాడ్యమినాడు ఉగాది పండుగ.  ఋతువులలో వసంతం మొదటిది.  తెలుగు నెలల్లో చైత్రం మొదటిది. అలాగే పక్షాలల్లో శుక్లపక్షం, తిధులల్లొ  పాడ్యమి ఇలా  ఋతువు, మాసం, పక్షం, తిధి అన్నీ ప్రధమమైనవి నందున ఈ రోజున వచ్చే ఉగాదికి అంత ప్రాధాన్యత వుంది. ఈ రోజునే బ్రహ్మదేవుడు పూర్వం సృష్టిని ప్రారంభించినట్టు  మన పురాణాలు చెబుతున్నాయి. 

   తెలుగువారి సొంతమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. దీన్ని సేవించడం వలన ఎంతో ఆరోగ్యం సమకూరుతుంది.   ఇందులో  వాడే వేపపువ్వులో క్రిమిసంహారక గుణం ఉంది.   మామిడి ముక్కలు రక్తప్రసరణ దోషాలను నివారిస్తాయి. చింతపండు వాతాన్ని హరిస్తుంది.  బెల్లం రక్తహీనతను పోగొడుతుంది.  పచ్చిమిరపకాయకు వాతాన్ని పోగొట్టే గుణం ఉంది .  ఉప్పు అజీర్ణాన్ని  పోగొడుతుంది. ఇన్ని సుగుణాలున్న ఉగాది పచ్చడి పరమౌషదం.

          ఉగాది రోజున ఆనందంగా ఉంటే  సంవత్సరమంతా శాంతి సౌఖ్యాలతో జీవితం గడిచిపోతుందని చాలా మంది నమ్ముతారు. గొప్పవారైనా , పేద వారైనా తమ తమ శక్తి తగ్గట్టుగా ఉగాది రోజున ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించాలి.  పచ్చని తోరణాలతో గుమ్మాలను అలంకరించి వసంత లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తాం. ఆప్యాయతలు, అనుబంధాలు , అనురాగాలు, ఆత్మీయతల మధ్య ఆనందో త్సాలతో ఉగాది పండుగను జరుపుకుంటాం .

         ఈ విజయనామ సంవత్సరం  అందరికీ విజయం చేకూరాలని, సర్వశుభాలు కలగాలని ఆశిస్తూ... అందరికీ ఉగాది (నూతన సంవత్సరం) శుభాకాంక్షలు!

                                                   సర్వేజనా సుఖినోభవంతు !
                                                                     ---

Wednesday, 3 April 2013

ప్రేమను పంచు!


ప్రేమ అనేది 
ఓ మధుర కలశం 
ఎంత ఆస్వాదిస్తే 
అంత రమణీయం... 
అందుకే ప్రేమించాలి 
ప్రేమను పంచడంలో 
అందరిని మించాలి!





Saturday, 23 March 2013

మనోహర పుష్పం!



వికసించే కుసుమానివి
విరజిమ్మే సుగందానివి
విరిసే పరిమళానివి
కురిసే మమకారానివి
మురిపించే అనురాగానివి
మైమరపించే భావానివి
ప్రేమను పంచే ప్రాణానివి
ఆప్యాయతల అపురూపావివి
నువ్వొక మనోహర పుష్పానివి 




Thursday, 21 March 2013

కళ్ళల్లో మెరిసావు


నువ్వు గానం చేస్తుంటే
తుషార బిందువులు
నాట్యం చేస్తున్నట్టు....
నువ్వు మాట్లాడుతుంటే
పరిమళాలు విరజిమ్మినట్టు....
నువ్వు నవ్వుతుంటే
మల్లెపూలు విచ్చుకున్నట్టు....
నీ  సౌందర్య సోయగాలు
నా ఎదలో ప్రవహిస్తుంటే....
                     కళ్ళల్లో  మెరిసావు
                     చూపుల్లో నిలిచావు 


Tuesday, 19 March 2013

రమణీయం




రమణీయం
రాధామాధవుల ప్రేమ ఓ మధుర కలశం
రెండు పవిత్ర హృదయాల దివ్యసంగమం
స్వచ్చమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం
ఎంత ఆస్వాదిస్తే అంతా రమణీయం












Monday, 18 March 2013

భార్యా భర్తలు




          నదిలో అలలు  ఎంత సహజమో సంసారంలో కలతలు కూడా అంతే సహజం. అల ఎంత ఎగిరిపడినా  నదిని విడిచి ఉండలేదు. అదేవిధంగా  భార్యాభర్తలిద్దరూ ఒకరినిఒకరు అర్థం చేసుకోవడంతో పాటుగా ఒకర్నిఒకరు పరస్పరం  గౌరవించుకోవాలి.  ఆధిపత్యం కోసం గొడవలు పడకూడదు.  అన్నిటిని మించి ఇద్దరికీ సహనం ఉండాలి.  ఒకరు కోపంతో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండాలి.  అప్పుడే ఆ సంసారం ముందుకు సాగుతుంది.  సంసారంలో  ఎంతటి తీవ్ర స్థాయిలో కలతలు చోటు చేసుకున్నా భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకూడదు. వ్యక్తిగత విషయాలలో పరాయి వ్యక్తులకు తావివ్వకూడదు

           భార్యాభర్తలు  సరసాలు, చమత్కారాలకు దగ్గరగా ఉంటూ  చిరాకులు, పరాకులకు దూరంగా ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యమనిపిస్తుంది.  జీవితం అందకారమవుతుంది.  భర్తతో ఆనందంగా జీవించాలంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం.  భార్యతో సుఖంగా జీవించాలంటే ఆమెను ప్రేమగా చూసుకోవడం అవసరం.
          

Friday, 15 March 2013

మన ప్రేమబంధం!











ఆప్యాయతలో---   
అమ్మను మించిన బంధం
నమ్మకంలో---
నాన్నను మించిన అనుబంధం
అనురాగంలో ---
ఆది దంపతుల సంబంధం
మన ప్రేమబంధం.