”శోధిని”

Saturday, 19 May 2018

నీలాద్రి


శ్రీ వేంకటేశ్వరస్వామికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి.  ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి ‘నీలాద్రి’ గా నామకరణం చేశారట.  తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే.  తలనీలాలు సమర్పణ అనేది  భక్తుల  అహంకార విసర్జనకు గుర్తు.


Monday, 14 May 2018

దేవదేవుడు

వేంకటేశ్వరస్వామిని అలంకార రహితంగా నిజరూపంలో దర్శించడం ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారిలో దేదీప్యమానంగా ప్రకాశించే వర్చస్సు తొంగి చూస్తూ, భక్తుల్ని మరింత పారవశ్యంలో ముంచెత్తుతుంది. శ్రీవారి పాదాల దగ్గర్నుంచి నేత్రలదాకా ఉట్టిపడే ఆ శోభను తికించే అవకాశం ఒక్క శుక్రవారం అభిషేకం సమయంలో మాత్రమే లభిస్తుంది. మంగళకరమైన దివ్యకాంతియుక్తమైన శ్రీనివాసుణ్ణి చూసి పరమానందభరితులవుతారు. స్వామివారిది అతిలోక సౌందర్యంతో విలసిల్లే అత్యద్భుత దివ్య మంగళ విగ్రహం. అద్భుత రూపలావణ్యంతో తీర్చిదిద్దినట్టుండే మోముతో మందస్మిత వదనంతో ఉండే శ్రేనివాసుడు, నమ్మి కొలిచే వారికి కొండంత వరాలిచ్చే దేవదేవుడు.


Saturday, 5 May 2018

శేషాద్రి




సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠoలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తేలకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పాడు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయుదేవుడు ఏమిచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో ఆదిశేషుడు తన పడగ ఎత్తి చూశాడు. దాంతో పట్టు సడలి వాయుదేవుడు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.


Monday, 30 April 2018

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

ఆనాడు కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు. ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి,శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపారు. ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలో తప్ప , ప్రైవేటు కార్యాలయాలు, కర్మాగారాలలో ఇప్పటికీ కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపే రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.

Saturday, 14 April 2018

ఇది మల్లెలమాసం....

                                                                                                                                    మన కళ్ళ ఎదుట మల్లెపూలు  కనిపించినా, వాటి వాసనలు తగిలినా మానసిక ప్రశాంతత అభిస్తుంది. సుకుమారమైన అందం, మనోహరమైన వాటి పరిమళ భరితాలు మనసును ఉల్లాసపరుస్తాయి.   అంతేకాదు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చే శక్తి ఈ పుష్పాలకుంది.   మండుటెండలో ఆహ్లాదాన్ని కలిగించే పుస్పాలలో మల్లెలది ప్రధమస్థానం.  ఎంత ఎండ కాచినా, పచ్చగా కళకళలాడే ఆకుల మాటున తెల్లని మల్లెమొగ్గలు మురిపిస్తాయి. తమ సుగంధాలతో పరిసరాలను నింపేసి ఉత్సాహాన్ని ఇస్తాయి. మనసును సమ్మోహన పరచి ఏదో లోకానికి తీసుకెలతాయి.  మధురోహాలతో పులకింపజేసి మొహనరాగాలను పలికిస్తాయి.    కమ్మదనానికి, చల్లదనానికి పెట్టింది పేరయిన మల్లెలంటే అందరికీ ఇష్టమే. మల్లెల మాధుర్యం మాటల్లో చెప్పలేనిది.  వాటి పరిమళాలకు ఎంతటివారైనా ఫిదా కావాల్సిందే!