”శోధిని”

Saturday, 11 March 2017

"సహజ రంగులతో ఆనందకేళి"

వసంత ఋతువు ఆగమనాన్ని పురష్కరించుకొని ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే ఆత్మీయానురాగాల రంగుల కేళి హోలి.   పిల్లలు, పెద్దలు అనే తేడ లేకుండా, కులమతాలనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే పండుగ హోలి.  వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి.  నాడు సంప్రదాయ బద్దమైన హోలీ పండగను ప్రమానురాగాలకు తార్కాణంగా జరుపుకునే వారు. ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో, వేపాకులు, తులసాకులు, పసుపు, కుంకుమ కలిపిన నీటిని వసంతోత్సవంగా జరుపుకునేవారు. ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు ప్రబలకుండా ఉంటాయి.   ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగును వాడేవాళ్ళు.  నేడు వాటి స్తానంలో కృత్రిమ రసాయనిక రంగులు మార్కెట్లోకి రావడంతో ప్రజలు వాటి పైన మోజు పెంచుకుని లేని అనర్థాలను కొని తెచ్చుకుంటున్నారు.  అనేక చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.    కృత్రిమ రంగులతో హోలీ ఆడడం వలన వాటిల్లోని కెమికల్స్ నేత్ర, చర్మ, జీర్ణకోశ సంబంధిత అవయాల పైన  తీవ్ర ప్రభావం చూపుతాయి కాబట్టి, సహజసిద్ధమైన రంగులతో హోలీ జరుపుకోవడం సరైన మార్గం.  కృత్రిమ రంగులు ప్రమాదకరం ...సహజ రంగులు ఆనందకరం! కృత్రిమ రంగులకు దూరంగా ఉండండి...ప్రకృతిలో లభించే సహజ రంగులను వినియోగించండి!!

         అందరికీ హోలీ శుభాకాంక్షలు!

Friday, 10 March 2017

సృష్టి రహస్యం


ప్రకృతిని సృష్టించిన తరువాత భూమ్మీద వున్న ఘన పదార్థాలన్నీటిని కలిపి పురుషుడికి ప్రాణం పోశాడంట బ్రహ్మ.  ఒంటరిగా కొన్ని రోజులు తిరిగిన పురుషుడికి ఏమీ తోచక బ్రహ్మ దగ్గరికి వెళ్లి 'నాకేమి తోచడం లేదు అన్నాడట'.
'సరే... నీకు తోడు కావాలి కదా! అలాగే ఇస్తాను' అని చెప్పి, సృష్టిలోని అద్భుతాలన్నీ మేళవించి అద్బుతమైన 'స్త్రీ'కి ప్రాణం పోశాడట.
వారం రోజులు  గడిచాక బ్రహ్మ దగ్గరకి పరుగెత్తుకొచ్చిన మగవాడు "స్వామి...! మీరు  తోడుగా ఇచ్చిన జీవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది....విరామం లేకుండా మాట్లాడుతోంది.   నాకు ఏకాంతం లేకుండా చేస్తోంది...  నేనామెతో కలిసి బతకలేను....ఈ జీవిని వెనక్కి తీసుకో" ఆన్నాడట.  
చురునవ్వుతో ఆ యువతిని వెనక్కి తీసుకున్నాడట  బ్రహ్మ.
రెండు రోజులు గడవక ముందే మళ్ళీ పరుగెత్తుకొచ్చిన  పురుషుడు "దేవా...! ఆ జీవి నాకు దూరం అయినప్పటి నుంచి జీవితంలో ఉత్సాహం పోయింది. సంతోషం కరువయింది.  తక్షణమే ఆమె నాకు కావాలి... ఆమె లేకుండా జీవించలేను" వేడుకున్నాడట. 
"చూడు నాయన ఇప్పటి కైన తెలిసిందా...  'స్త్రీ' అంటే ఏమిటో.... స్త్రీలు లేని చోట శోభ కొరవడుతుంది. వారు లేకపోతే  ప్రేమతత్వం వికసించదు. నిండుదనం లోపిస్తుంది ... అందం, ఆనందం ఉండదు" అని చెప్పి బ్రహ్మ అదృశ్యమయ్యాడట.

Tuesday, 7 March 2017

అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!


లాలించే తల్లిగా,  ప్రేమను పంచే అర్థాంగిగా నేటి సమాజానికి స్పూర్తి ...రేపటి సమాజానికి వెలుగు మహిళ.  ప్రపంచంలో ముందుకు వెళుతూ... అభివృద్దిలో, ఆధునిక జీవనపథంలో దూసుకుపోతూ మనవాళ్ళకు తీసిపోమంది. అయితే గ్రామీణప్రాంత మహిళలు, పట్టణాలలోని పేద మహిళలకు మహిళల రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించాలి.  వారిలో ఆత్మవిశ్వాసం, చైతన్యం తెచీన్దుకు గ్రామీణ ప్రాంతాలలో కూడా సభలు, సమావేశాలు నిర్వహించి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాల గురించి తెలియజేయాలి.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సమైక్య శక్తులుగా, సాహస మూర్తులుగా ఉద్యమించాలని కోరుకుంటూ...
అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
 
 

Thursday, 23 February 2017

"పరమేశ్వరుని శుభదినం ...మహాశివరాత్రి పర్వదినం"


పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి మహాశివరాత్రి.  ఈ శుభకరమైన శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే అనుగ్రహప్రదాత అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.  మనసుని పవిత్రంగా,  ప్రశాంతంగా వుంచుకొని 'ఓం నమశ్శివాయ' అని జపించాగానే మహాశివుడు పరవశుడై అన్ని కష్టాలను తొలగిస్తాడు.  మనసులో నేనే గొప్ప అనే అహంకారాన్ని పెట్టుకుని ఆడంభరాలతో ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం దక్కదు.   అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే... శివయ్య  కరుణాకటాక్షం  లభిస్తుంది. ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో శివతత్వాన్ని అర్థం చేసుకొంటే మనిషిలో మానవత్వం పరిమళిస్తుంది. 
                 "పరమేశ్వరుని శుభదినం ...మహాశివరాత్రి పర్వదినం...భక్తజనకోటికి పుణ్యదినం" 
 


Monday, 20 February 2017

అర్థనారీశ్వరుడు



అనుగ్రహప్రదాత, మంగళ స్వరూపుడయినా  పరమేశ్వరుడులో పురుషుడి శక్తి సగం,  అయన సతీమణి పార్వతి శక్తి సగం సమ్మేళతంగా ఉంటుంది.  సమస్త చరాచర ప్రపంచం శక్తిరూపంతోనే ఏర్పడింది కాబట్టి,  శక్తి రూపం లేకుండా శివుడు ఏమీ చేయలేడు.  అందుకే స్త్రీ, పురుషుడు కలిసి ఒకే రూపంగా ఏర్పడితేనే ఎదైనా సాధ్యమవుతుంది.  ఈ విషయాన్ని మనకు తెలియచేయడానికి ఈశ్వరుడు అర్థనారీశ్వర రూపాన్ని ధరించాడు.  ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదని స్త్రీ, పురుషులిద్దరూ  సమానమేనని తెలియజెప్పాడు.