”శోధిని”

Wednesday, 7 May 2014

మన సాంప్రదాయాలు !




మన సంస్కృతీ సాంప్రదాయాలు 
సుగంధభరిత పరిమళాలు 
అవి  ఎప్పుడూ దివ్యకాంతిని,
వెలుగుబాటను చూపిస్తుంటాయి
అందుకే ...!
విదేశీ  మోజులోపడి 
అనుబంధాలను  పెంచే...
స్వదేశీ  సంస్కృతిని మరవద్దు!
అనురాగాలను  పంచే...
మన  ఆచారాలను విడవద్దు !!

Thursday, 24 April 2014

ఓటు ప్రతిజ్ఞ చేద్దా!


       నేను ఓటరుగా నమోదు అయినందుకు గర్విస్తున్నాను.  నేను నాయొక్క ఓటు హక్కును వినియోగించుకుంటానని, అర్హులైన ప్రతి ఓటరు చేత తప్పనిసరిగా ఓటు వేయిస్తానని, అదేవిధంగా ఓటు హక్కు వినియోగించు సందర్భంలో ధన, కుల, మద్యం, కానుకలు మరియు బంధుప్రీతిలాంటి వాటికి లొంగనని , అదేవిధంగా ఇతర అర్హులైన ఓటర్లను కుడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చూస్తానని, చిత్తశుద్ధితో, నిబద్ధతతో ప్రతి ఒక్క పౌరునితోఓటు వేయించి నా సామాజిక బాధ్యతను నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. 

Tuesday, 22 April 2014

ఆలోచించండి ... ఓటు వేయండి !




ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.  ఓటును హక్కుగానే కాకుండా మన ధర్మంగా భావించాలి.   మనం ఓటు వేసేటప్పుడు మన ప్రాంతం వాడనో, మన కులం వాడనో, మన మతం వాడనో చూడకుండా అభ్యర్థి సామర్థ్యం చూసుకుని ఓటువేయడం మరచిపోవద్దు.  ఓటు అనేది మనకు  లభించిన గొప్ప ఆయుధం.  అముల్యమైన ఓటును సక్రమంగా వినియోగించుకోవడం మన భాద్యత.  బలమైన, నీతిపరమైన , నాణ్యమైన ప్రభుత్వం కోసం ఓటు వేసి  దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థవంతులైన నాయకులను  ఎన్నుకోవడం మన కర్తవ్యం.  కలిసిమెలిసి వున్న  ప్రజలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టే  నాయకుల  పట్ల అప్రమత్తతగా  ఉండాలి.  పార్టీలకతీతంగా ప్రజల బాధలను, అవసరాలు తెలిసిన వారినే  ఎంపిక చేసుకొవాలి.  పోటి చేసే వారిలో అందరూ  మంచివాళ్ళు లేకపోయినా, ఉన్నవారిలో కాస్త మంచివారిని ఎంపిక చేసుకోవడం మరవద్దు. 

Friday, 18 April 2014

Thursday, 17 April 2014

నేడు శుభ శుక్రవారం !

    

     క్రైస్తవ సోదరీ సోదరులకు ముఖ్యమైన దినాలలో ప్రధానమైనది 'గుడ్ ఫ్రైడే'  ఒకటి.   ఏసు క్రీస్తును శిలువ చేసిన రోజు...  ఈ రోజే  కాబట్టి ఆయన్ని నిష్టతో పూజిస్తే...  పుణ్య ఫలాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.  ఏంతో   పవిత్రమైన, శుభకరమైన ఈ శుక్రవారం నాడు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏసుక్రీస్తు శిలువలో మానవాళి కోసం మరణించడాన్ని గుర్తుచేసుకునే రోజు 'గుడ్ ఫ్రైడే'.   ఆయన  మరణించిన మూడో రోజు  ఆదివారం  నాడు క్రీస్తు తిరిగి జన్మించాడని  క్రైస్తవ సోదర సోదరీమణులు ఈస్టరు పర్వదినాన్ని సంతోషంతో ఘనంగా జరుపుకుంటారు.

     మత  గ్రంధాలన్నీ మంచినే  బోధిస్తాయి.  అందుకే అన్ని మత  గ్రంధాలను చదువుదాం... మంచిని గ్రహిస్తాం... మనిషిగా సాటి మనిషిని ప్రేమిద్దాం!


Wednesday, 16 April 2014

అవి చూపులు కావు...!

అవి చూపులు కావు
కామాంధుల  గుండెల్లో
గుచ్చుకునే చురకత్తులు!
అవి కలువరేకులు కావు
అపర కీచకులను వేటాడే 
నిప్పు కణాలు !
అవి  వలపుబాణాలు కావు 
మానవ మృగాలను దహించి వేసే 
అగ్ని గోళాలు!


Saturday, 12 April 2014

పూదోట !


రంగు రంగు పూలు కనిపించినా... వాటి సువాసనలు తగిలినా మనసుకు ఎంతో ఉల్లాసం, ప్రశాంతతను  కలిగిస్తాయి.  కొన్ని పూలు  మనుషులలో మూడుని, రోమాన్స్ ని  కలిగిస్తాయి.  అంత మహత్తర శక్తి ఈ పూలకి వుంది.  ఎక్కడ పూల తోటలు ఉంటాయో... ఆ పరిసరాలలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  అందుకే ఈ పూలను దేవుని పటాలకు వేయడం, స్త్రీలు తలలో ధరించడం ద్వారా భారతీయ సాంప్రదాయ విశిష్టతను తెలియజేయడం జరుగుతోంది.  అదేవిధంగా  పూల చెట్లకు వుండే పచ్చదనం మన కళ్ళముందు వుంటే, మనలో కలిగే ఆదుర్దా ఇట్టే తగ్గి పోతుంది.  కాబట్టి మనం నివచించే చోట పచ్చదనానికి ప్రధాన్యత ఇచ్చి, పూలమొక్కలను పెంచుదాం... మన జీవితాలను ఆనంద భరితం చేసుకుందాం!