”శోధిని”

Thursday, 17 April 2014

నేడు శుభ శుక్రవారం !

    

     క్రైస్తవ సోదరీ సోదరులకు ముఖ్యమైన దినాలలో ప్రధానమైనది 'గుడ్ ఫ్రైడే'  ఒకటి.   ఏసు క్రీస్తును శిలువ చేసిన రోజు...  ఈ రోజే  కాబట్టి ఆయన్ని నిష్టతో పూజిస్తే...  పుణ్య ఫలాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.  ఏంతో   పవిత్రమైన, శుభకరమైన ఈ శుక్రవారం నాడు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏసుక్రీస్తు శిలువలో మానవాళి కోసం మరణించడాన్ని గుర్తుచేసుకునే రోజు 'గుడ్ ఫ్రైడే'.   ఆయన  మరణించిన మూడో రోజు  ఆదివారం  నాడు క్రీస్తు తిరిగి జన్మించాడని  క్రైస్తవ సోదర సోదరీమణులు ఈస్టరు పర్వదినాన్ని సంతోషంతో ఘనంగా జరుపుకుంటారు.

     మత  గ్రంధాలన్నీ మంచినే  బోధిస్తాయి.  అందుకే అన్ని మత  గ్రంధాలను చదువుదాం... మంచిని గ్రహిస్తాం... మనిషిగా సాటి మనిషిని ప్రేమిద్దాం!


Wednesday, 16 April 2014

అవి చూపులు కావు...!

అవి చూపులు కావు
కామాంధుల  గుండెల్లో
గుచ్చుకునే చురకత్తులు!
అవి కలువరేకులు కావు
అపర కీచకులను వేటాడే 
నిప్పు కణాలు !
అవి  వలపుబాణాలు కావు 
మానవ మృగాలను దహించి వేసే 
అగ్ని గోళాలు!


Saturday, 12 April 2014

పూదోట !


రంగు రంగు పూలు కనిపించినా... వాటి సువాసనలు తగిలినా మనసుకు ఎంతో ఉల్లాసం, ప్రశాంతతను  కలిగిస్తాయి.  కొన్ని పూలు  మనుషులలో మూడుని, రోమాన్స్ ని  కలిగిస్తాయి.  అంత మహత్తర శక్తి ఈ పూలకి వుంది.  ఎక్కడ పూల తోటలు ఉంటాయో... ఆ పరిసరాలలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.  అందుకే ఈ పూలను దేవుని పటాలకు వేయడం, స్త్రీలు తలలో ధరించడం ద్వారా భారతీయ సాంప్రదాయ విశిష్టతను తెలియజేయడం జరుగుతోంది.  అదేవిధంగా  పూల చెట్లకు వుండే పచ్చదనం మన కళ్ళముందు వుంటే, మనలో కలిగే ఆదుర్దా ఇట్టే తగ్గి పోతుంది.  కాబట్టి మనం నివచించే చోట పచ్చదనానికి ప్రధాన్యత ఇచ్చి, పూలమొక్కలను పెంచుదాం... మన జీవితాలను ఆనంద భరితం చేసుకుందాం!

Wednesday, 9 April 2014

వచ్చింది వసంతం ... తెచ్చింది ఉత్తేజం !



ప్రకృతి రమణీయ శోభతో
పచ్చదనం శోభాయమానంగా
పరవళ్ళు తొక్కుతూ
మల్లెల సౌరభాలను మోసుకుంటూ
వచ్చింది ఆమని వయ్యారంగా...
తెచ్చింది అద్భుత వరాలను రమణీయంగా...
మావి చివురు తిన్న 
కోయిలమ్మ మనోహరంగా కూస్తుంటే,
పిల్లగాలుల సుమధుర స్వరాలకు
గండు తుమ్మెద నాదం ఝుమంది
ప్రతి చేట్టులోను ఉల్లాసం
ప్రతి హరితలో పరవశం
ఎటు చూసినా పూల సోయగాలు
వాటి ఘుమఘుమలు
వీటిని అపురూపంగా  ఆస్వాదిస్తూ
ఆమని హాయిగా రాగాలు ఆలపిస్తుంటే---
కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై
అరమరికలు  లేని పలకరింపులతో
ఉత్సాహంగా... వచ్చింది వసంతం
అందరిలోనింపింది నూతన ఉత్తేజం!


Monday, 7 April 2014

రమ్యమైనది ... శ్రీ రామ నామం !

"శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"

రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము అంటారు.  కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి,  సోదరమైత్రికి లక్ష్మణుడు, వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి,  ప్రభుసేవ, వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని  ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి.  కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల  మనసులలో శాశ్వతంగా  నిలిచిపోయాడు.

 

Sunday, 6 April 2014

వసంత పరిమళాలు!


కొత్తగా పిందెలేసి కళకళలాడుతున్న
మామిడిచెట్ల ఆకులు...
మామిడి చిగుళ్ళను అపురూపంగా ఆరగించిన
కోకిల మధురస్వరాలు...
వేపచెట్టు నిండా విరబూసిన
వేపపూల ఘుమఘుమలు...
అందరికీ ఆహ్లాదాన్ని అందించే
మల్లెల సౌరభాలు...
ఆత్మీయ అనుబంధాలను గుర్తుచేసే
సాంప్రదాయ  ఉషోదయాలు..
చైత్రం  ప్రసాదించిన వసంత పరిమళాలు!

Wednesday, 2 April 2014

దింపుడు కల్లం !


భర్త చనిపోవడంతో 'లబోదిబో' అని ఏడుస్తోంది వెంకాయమ్మ.
"నువ్వు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాడు తిరిగోస్తాడా?" ఓ పెద్దావిడ ఓదార్చుతోంది.
కొద్దిసేపటికి శవయాత్ర ప్రారభమైంది
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత "ఇది దింపుడు కల్లం, ఇక్కడ శవాన్ని దింపండి " ఓ పెద్ద మనిషి అన్నాడు.
"రోడ్డు మధ్యలో దింపడం ఎందుకు?" ఏడుపు ఆపి అడిగింది వెంకాయమ్మ
"నీ అదృష్టం బాగుంటే దింపుడు కల్లం లో నీ భర్త బ్రతికి లేచి కూర్చుంటాడు... ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయమ్మా"
"ఆ అదృష్టం నాకొద్దు ... ఆయన్ను మళ్ళీ చంపే ఓపిక నాకు లేదు" అసలు విషయం చెప్పింది వెంకాయమ్మ.