”శోధిని”

Tuesday, 4 February 2014

ముందు జాగ్రత్త!


టీవిలో సీరియల్స్ లేని  సమయంలో ఇద్దరు మహిళామణులు మాట్లాడుకుంటున్నారు-
మొదటి మహిళ : మా వారికి ముందు చూపు ఎక్కువ !
రెండో మహిళ     : అయితే బాగా పొదుపు చేస్తారన్నమాట!
మొదటి మహిళ : అంతలేదు ... నాతొ గొడవ మొదలవగానే ముందు                                                  జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటాడు
రెండో మహిళ     : మా వారే నయం... నాకు కోపం తెప్పించకుండా ఇంటి                                             పనులన్నీ తనే  చేసిపెడతాడు.

Thursday, 30 January 2014

ప్రేమ పరిమళాలు!



ప్రకృతి సోయగాల్ని...   
హృదయపు లాలిత్యాన్ని...  
మేళవించిన నీ గానం 
మధురాతి మధురం! 
సౌకుమార్యంతో  కూడిన 
నీ తీయటి పలుకులు ...  
అత్యంత మనోహరం!! 
నీ రూపురేఖలు 
శిల్పకళా సంపదలు 
నా అణువణువులోనూ 
నీ సొగసులు, సోయగాలు...  
నా గుండె గుడిలో వెలసిన
ప్రేమ పరిమళాలు!  

Wednesday, 29 January 2014

వలపు బాణాలు...!


నీ నుదుటున వెలిసిన కనుబొమ్మలు...  
నిశీధిలో వెలిగే చంద్రోదయాలు...  
నీ వదనంలో మెరిసే  నయనాలు...  
మతిని పోగొట్టే వలపు బాణాలు...! 


Saturday, 25 January 2014

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


మన దేశం సంపూర్ణ సౌర్వబౌమాధికారాన్ని పొందిన సుదినం  జనవరి 26.ఈరోజున భారతీయులందరం కలిసి 'గణతంత్ర దినోత్సవం'ను ఘనంగా జరుపుకుంటాం. మనకు స్వాతంత్ర్యం 1947 ఆగష్టు 15న వచ్చినా, బ్రిటీష్ పాలకులతో ఎ సంబంధం లేకుండా పూర్తి  స్వరాజ్యాన్ని జనవరి 26, 1950 న పొందాం.  మనకంటూ ప్రత్యేక రాజ్యాంగం  ఏర్పడి, గవర్నర్ జనరల్ స్థానంలో భారత రాష్ట్రపతి పాలన ప్రారంభమైన రోజు జనవరి 26, 1950 కాబట్టి ఈ రోజు మనందరికీ నిజమైన పండుగ రోజు. 

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!


Friday, 24 January 2014

బహుమతి


Bahumathi andukuntunna Cartoon istulu Sri Kayala Nagendra garu... — with Annam Sreedhar Bachi.(ప్రముఖ కార్టూనిస్టు)



Monday, 20 January 2014

"సిరిమల్లె పువ్వల్లె నవ్వు"


"సిరిమల్లె పువ్వల్లె నవ్వు" (పేస్ బుక్) మొదటి వార్షికోత్సవం ఆదివారం (19-01-14) నాడు "హోటల్ స్వాగత్ గ్రాండ్", వనస్థలిపురం, హైదరాబాద్ లో కన్నుల పండుగగా జరిగింది. ఈ  కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరినీ శ్రీ బాచి గారు పేరుపేరున పలకరిస్తూ...  ఆప్యాయతతో ఆహ్వానించడం అందరిని ఆకట్టుకుంది. చిరునవ్వుతో లక్ష్మీ పాల గారు రావడంతో సభకు నిండుదనం వచ్చింది. మిత్రులు కొంత  మంది రాకపోయినా హాస్యపు జల్లులతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.  ఈ విజయం వెనుక బాచిగారు, రామకృష్ణ గారు, లక్ష్మీ పాల గారు, ఈ ముగ్గురి కృషి ఏంతో  వుంది.  'రాధకు నీవేరా ప్రాణం... ఈ రాధకు నీవవేరా ప్రాణం' పాటను లక్ష్మీ పాల గారు చాలా చక్కగా పాడారు. ఆమె గాత్రం అద్భుతంగా ఉంది.  శ్రీ రామకృష్ణ గారు, శ్రీ బాచి గారు చక్కని చతురొక్తులు, పసందయిన జోక్స్ లతో  అలరించారు.  ఇంత  మంచి కార్యక్రమానికి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.  శ్రీ బాచి గారికి, లక్ష్మీ పాల గారికి ప్రత్యేక అభినందనలు . 


Friday, 17 January 2014

'మనసంతా నువ్వే'



ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీ ఆర్. వి. ఎస్ .ఎస్ శ్రీనివాస్ గారు (శ్రీ) రచించిన 'మనసంతా నువ్వే' వచన కవితల సంపుటిని  డా. సి నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు.  ఈ గ్రంధంలో 64 కమనీయమైన ప్రేమ కవితలు రూపుదిద్దుకున్నాయి.  కవితలలో ఆత్మీయ స్పర్శల మధురానుభూతుల్ని, ప్రేమికుల సంబంధాలను హృద్యంగా వర్ణించారు రచయిత. ఈ గ్రంధంలోని కవితలు చదువుతుంటే... హృదయ లోతుల్లో దాగిన అక్షరాలను పైకి తీసి పేర్చినట్టున్నాయి.  ఈ గ్రంధంలోని కొన్ని మధురమైన వాక్యాలు... 

" నీ ప్రేమలేఖ లొని అక్షరాలు 
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు 
నిశ్చలమైన నా మనోకాసారంలో 
వికసించిన ప్రేమారవిందాలు"

"సాయంసంధ్యా సమయంలో 
చల్లగా వీచే పిల్లతెమ్మర హాయినిస్తోంది
నా మనసుని తాకే నా సఖి పంపిన 
ప్రణయ సమీరంలా"

" నీ చిరునవ్వుల జల్లులు చాలు 
చిరుకవితల మాటలు అల్లేందుకు 
నీ పసందయిన పలకరింపులు చాలు 
ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు"

ఈ గ్రంధం నిండా ఇలాంటి కవితలు మనోరంజకంగా అలరించాయి.  ఎన్నెన్నో మధురానుభూతులు మనసును తట్టి ఆహ్లాద పరచాయి.  తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని ఆవిష్కరించగల శక్తి శ్రీనివాస్ గారికవిత్వానికి ఉందని రుజువు చేశాయి.  ఈ కవితలలో రచయిత హృదయ స్పందనని అర్థం చేసుకోవచ్చు. అద్భుత పదాలతో "మనసంతా నువ్వే"కవితల సంపుటిని 64 ఆణిముత్యాలుగా అభివ్యక్తీకరించారు 'శ్రీ' గారు. మున్ముందు మరిన్ని  ప్రేమ కవితలు 'శ్రీ' (శ్రీనివాస్) గారి కలం నుండి జాలువారుతాయని ఆశిద్దాం!