”శోధిని”

Monday, 8 July 2013

అమ్మాయిలూ... జాగ్రత్త!

నేడు అమ్మాయిలు అన్ని రంగాలలో మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు.  ఇది శుభ పరిణామం.  కాని, ప్రేమ దగ్గరకొచ్చేసరికి  పప్పులో కాలేస్తున్నారు.  చచ్చు పుచ్చు కబుర్లు చెప్పే అబ్బాయిల చేతుల్లో చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు.  మగాడి ఆలోచనా విధానం వేరని గ్రహించలేక పోతున్నారు.  ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అమాయకంగా ప్రేమంటూ   అబ్బాయిల చేతిలో బలవుతున్నారు.  ఇలా మోసపోయే అమ్మాయిలు  వున్నత వరకూ  మోసం చేసే అబ్బాయిలు పుడుతూనే ఉంటారు.అమ్మాయిలూ భ్రమలోంచి బయట పడండి... బాగా ఆలోచించి చక్కని భవిష్యత్తును నిర్మించుకోండి. మోసగాళ్ళ మాయమాటలు విని మోసపోకండి.  మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని మరచిపోకండి. మీ తెలివితేటలు ఉపయోగించి మంచి తోడును ఎన్నుకోండి. 

Saturday, 6 July 2013

"ప్రేమ ... పెళ్లి !"

పెళ్లికి ముందు...  
ఒకరికొకరు 
పడిచచ్చారు!
పెళ్లి అయ్యాక...  
ఒకరికొకరు 
పడక చస్తున్నారు!!



Friday, 5 July 2013

జాంపండ్లు!

 
ఖరీదు తక్కువని జామకాయను  చిన్న చూపు చూడకండి.  దీనిలో అధిక పోషకాలు, ఎన్నో లాభాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లకు జామ కాయ సంజీవనిలా పనిచేస్తుంది.  దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మంచి మందుగా పనిచేస్తుంది.  అంతేకాదండోయ్ రక్త పోటును అదుపులో వుంచడంతో పాటు రక్తం చిక్కపడకుండా ఉండటానికి  సహాయపడుతుంది. ఎసిడిటి తగ్గిస్తుంది, మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.    ఖరీదయిన పండ్ల కంటే ఎన్నో అధిక లాభాలు ఉన్నాయి.  అందుకే జామ కాయ  తినండి ... ఆరోగ్యంగా ఉండండి. 

Wednesday, 3 July 2013

ప్రకృతి ఆగ్రహిస్తే ?

















జూన్ నెలలో ఉత్తరాఖండ్ లో జరిగిన జల ప్రళయం ఎవరూ  ఉహించని ఉపద్రవం. పవిత్ర క్షేత్రాలు మరు భూమిగా మారి భయానక వాతావారంలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవి చూడాల్సివచ్చింది.  ఉహించని రీతిలో ప్రళయ గంగ భీకర రూపం దాల్చడంతో పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించులోవాలని తపన పడిన వారికి తీరని విషాదం మిగిలింది .కనీ వినీ ఎరుగని రీతిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది.  చిన్న రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ ని కోలుకోని దెబ్బ తీసింది . పుణ్యానికి పొతే పాపం ఎదురయినట్టు తనవారిని పోగొట్టుకుని బరువైన గుండెతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భగవంతుని ప్రతిరూపాలయిన వీర జవానుల సహాయంతో బయటపడ్డారు.  ఈ పెను విపత్తుకు కారణంపర్యావరణం దెబ్బ తినడమేనని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మన పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని నొక్కి చెప్పారు.  అభివృద్ధి పేరిట పచ్చని ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నారు.  పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల  మానవ మనుగడ పశ్నర్థకంగా మారే పరిస్తితి ఉంది. ప్రకృతి  ఆగ్రహిస్తే ఏమవుతుందో మనం కల్లారా  చూసాము.  ఇప్పటికైన మన పాలకులు మేల్కొని పర్యావరణాన్ని పరి రక్షించడానికి తగు చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను నరికివేత ఆపాలి.  నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  కొండలను నాశనం చేయకుండా కొండలుగానే ఉంచాలి. 


Saturday, 29 June 2013

మనవాళ్ళు

స్వదేశంలో 
'చదువు' కొంటారు 
విదేశాలల్లో 
'జ్ఞానం' అమ్ముకుంటారు 


Friday, 28 June 2013

ప్రేమ బంధం!


అపురూపం... 
అద్వితీయం...   
అపూర్వం...  
అమోఘం...   
నీ రూప లావణ్యం...  
సాటి రాదు 
ప్రకృతి  సౌందర్యం! 
ఆత్మీయత...  
అనురాగం... 
ఆప్యాయత...  
అనుబంధం...  
పెనవేసుకున్న 
పవిత్ర బంధం 
మన ప్రేమ బంధం!!