”శోధిని”

Saturday, 12 May 2012

అమ్మదనం ...ఎంతో కమ్మదనం!



అమ్మ పంచే అనురాగం, మమకారం,ఆత్మీయత అపురూపం 
అమ్మ... ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపం.
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!
అమ్మ బిడ్డకు జన్మనివ్వడానికే జీవిస్తుంది
ఒక్కోసారి ఆ బిడ్డ కోసమే మరణిస్తుంది...
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!
అమ్మను మించిన దైవం లేదు...అమ్మే ప్రత్యక్ష దైవం
అమ్మ అనురాగం అపారం...అమ్మ త్యాగం అనితరం
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!
సృష్టికి మూలం అమ్మ...ఆప్యాయతకు అర్థం అమ్మ.
మమతల మకరందం అమ్మ...ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ.
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!!
'అమ్మ' అనే స్త్రీ మూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే
సమాజం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది.
అందుకే స్త్రీలను గౌరవిద్దాం... మనసార పుజిద్దాం!

Saturday, 5 May 2012

సుకుమార గంధర్వులు



ఈ మధ్య 'టీవీ టాలెంట్ షోలు' పాటకు పెద్ద పీట వేస్తున్నాయి.  ఈ పోగ్రాం వస్తుందంటే చాలు పిల్లలు, పెద్దలు ఆ సమయానికి టీవీ ల ముందు వాలిపోతున్నారు. చిన్నారులు తన్మయంగా తనివితీరా పాడుతుంటే, మది పులకించి పోతుంది.  వాళ్ళ అద్భుతమైన గాత్రం, పాడే అభినయం చూస్తుంటే మనసు  పరవళ్ళు తొక్కుతుంది. కొత్త గాయకులకు టాలెంట్ షోలు  ఒక వేదికై నిలిచిందని చెప్పవచ్చు.  టీవీ షోలు పాటకు పెద్ద పీట వేయడంతో కొత్త గాయనీగాయకులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి...  ఇది శుభ పరిణామం. టాలెంట్ షోలు హంగామా పెరిగాక  సంగీతం నేర్చుకోవాలన్న ఉత్సాహం బాల బాలికలలో మరింతగా పెరిగింది.  తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గాయకులుగా తీర్చి దిద్దడానికి ఎక్కువ  మక్కువ చూపిస్తున్నారు. ఈ సుకుమార గంధర్వులు ఒకరు పాడుతుంటే వెన్నెల విరబూసినట్టు... మరొకరు పాడుతుంటే జలపాతం ఉరికినట్టు... ఇంకొకరు పాడుతుంటే మాయూరం నర్తించినట్టు...మరో చిన్నారి పాడుతుంటే వసంతరుతువులో కోయిలమ్మ పాడినట్టు అనిపిస్తుంది.  ఈ చిన్నారులకు మంచి మంచి అవకాశాలు వచ్చి  వీరి గాత్రంతో  ప్రేక్షకులను పరవళ్ళు తోక్కించాలని మనసార కోరుకుందాం. 

Monday, 30 April 2012

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!



కార్మికుల చేత పశువుల్లా పనిచేయించకుండా పని గంటలు నిర్ణయించమని 'చికాగో' నగరంలో  కార్మికులంతా సమ్మె చేసి విజయం సాధించారు.  ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి,శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపారు. అప్పటి నుంచి కార్మిక శక్తికి ప్రతిరూపమైన మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ, ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలోతప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం ఇప్పటికి కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు.అదేవిధంగా బాలకార్మికులచేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు.  ప్రభుత్వం ఎన్నిచట్టాలు తెచ్చినా ప్రతి రంగంలోనూ బాలకార్మికులు కనబడుతున్నారు.  ఇప్పటికైన ప్రభుత్వం గట్టి చట్టాలు తెచ్చి, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేదించాలి.  వారిచేత చేయించుకున్న ఉత్పత్తులను నిషేదించాలి. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా  చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక,  సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కవ జీతానికి ఆశపడి కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు.  ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.

Thursday, 26 April 2012

'ప్రజాపథం'



     రాష్ట్రంలో అట్టహాసంగా మొదలయిన 'ప్రజాపథం' జనం లేక వెలవెల పోతోంది.  ప్రజల స్పందన లేకపోవడంతో ప్రజాప్రతినిధులు తలలుపట్టుకుంటున్నారు.  గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు ఇప్పటివరకు పరిష్కారం లభించకపోవడంతో ప్రజలు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు.  ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ కార్యక్రమం అబాసుపాలవుతోంది. స్థానిక నాయకులు ఈ కార్యక్రమం పట్ల ఎలాంటి శ్రద్ధ కనబరచకపోవడంతో ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత  ప్రజలల్లో ఇంత తీవ్రంగా వుందో తెలుస్తోంది. ఈ మధ్య నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యప్రజలకు దడ పుట్టిస్తున్నాయి.  అదేసమయంలో విద్యుత్ చార్జీలు పెంచి మరింత బారం మోపారు.  రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది కానీ, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం లేదు.  రోడ్లపరిస్థితి మరీ అద్వానంగా వుంది. కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంలేదు. అన్నీ రంగాలలోనూ ప్రభుత్వం విఫలమవడంతో  తన ఉనికిని చాటుకోవడానికే ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప నిజంగా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కాదని ప్రజలు గ్రహించారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రజలకు కావలసిన కనీస సౌకర్యాలను కల్పించడం పైన దృష్టి మల్లిస్తే బాగుంటుంది.