”శోధిని”

Friday, 2 December 2011

ఇదిగో, ఇదీ దారి!

image.png

ఇదిగో, ఇదీ దారి!

హైదరాబాద్, December 2nd, 2011
తెలుగు భాష ఎప్పుడు ఎలా పుట్టింది అని జుట్టు పీక్కునే బదులు ఇప్పుడు తెలుగు భాషను ఎలా బ్రతికించుకోవాలి? తెలుగు భాష వాడకానికి తీసుకోవలసిన చర్యలు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఏ భాషను ఆదరిస్తే ప్రజలు ఆ భాషపైన మక్కువ చూపుతారు. మనం ఆంగ్ల భాష వైపు పరుగులు తీస్తున్నామంటే, దానికి కారణం మన ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగు భాషకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వాడకాన్ని ప్రవేశపెడితే తప్పకుండా ప్రజలలో మార్పు వస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగులకు తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలనే నిబంధన వుంటే! ఈ స్థితి వచ్చేదా? ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని స్థాయిల్లో విధిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగు భాషను అమలుపరచాలి. అధికార పత్రాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో ముద్రించి, అందిరికీ అర్థమయ్యేలాచేయాలి.
నేటి తరానికి తెలుగు భాష పైన మక్కువ పెంచాలంటే, తెలుగు భాష సరళంగా ఉండాలి. తెలుగు భాష కనుమరుగు కాకుండా వుండాలంటే, ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు బోధించడాన్ని తప్పనిసరి చేయాలి. తెలుగు భాషపట్ల అభిరుచి కలిగేలా తెలుగు పాఠ్య పుస్తకాల రచనా నిర్మాణం జరగాలి. తెలుగు భాష గొప్పదనాన్ని, అందులోని మాధుర్యాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలి.
టీవీ ఛానల్ వాళ్లకి తెలుగు భాషలో పదాలు లేనట్టు ఆంగ్ల పదాలతో కార్యక్రమాలను తయారుచేసి ప్రజల మీద రుద్దడం మానుకోవాలి. తారల ఇంటర్వ్యూలు, వక్తల ప్రసంగాలలోనూ ఆంగ్ల పదాలు మేళవిస్తూ అతి చక్కని తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికే టీవీ ఛానళ్ల పుణ్యమా అని హిందూ స్ర్తిలలో కొందరు నుదుటున బొట్టు పెట్టుకోవడం మానేశారు. టీవీ ఛానల్ వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాల్లో తెలుగు సంప్రదాయాలు మచ్చుకైనా కనిపించవు. ఇప్పటికైనాతెలుగు టీవీ ఛానళ్ల వారు కళ్ళు తెరచి, పరభాషా వ్యామోహాన్ని తగ్గించి, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, ఉచ్చారణను, తెలుగువారి సంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. మాతృభాషలో పరిపాలన, కళాశాలలో మాతృభాషలో బోధన, టీవీ ఛానళ్ళలో తెలుగు సంప్రదాయ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు మన తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుంది.

Thursday, 1 December 2011

ఎయిడ్స్ ఫై అవగాహన పెరగాలి

నేడు అత్యధికులు లైంగిక సంపర్కం వల్ల ఎయిడ్స్ అనే మహమ్మారి
బారిన పడుతున్నారు.  విచ్చలివిడి శృంగారం ద్వారా ఒకరికంటే
ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన ఎయిడ్స్
అనే ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తోంది. అంతేకాకుండా పచ్చబొట్లు
పొడిపించుకోవడం,ఒకరికి ఉపయోగించిన సూదిని మరొకరికి ఉపయోగిండడం,
వ్యాధిగ్రస్తుని రక్తదానం, ఇంజక్షన్లు, షేవింగ్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి
చెందడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరూ
అప్రమత్తతతో మెలగాలి.  ఇప్పటివరకు ఎయిడ్స్ కి సరయిన ట్రీట్మెంట్
లేదు కాబట్టి దానిని నివారించడమే ఉత్తమ మార్గం.  ఈ ఎయిడ్స్ సోకిని
వారితో కరచాలం చేయడం, కలిసి భోజనం చేయడం, కలిసి  పనిచేయడం
ద్వారా ఎయిడ్స్ వ్యాపించదు.  టాయిలెట్లు, బాత్రూములు కలిసి  వాడటం
వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అంతేకాకుండా దోమకాటు, గాలి పీల్చడం
వంటి వాటి  వలన కుడా ఎయిడ్స్ రాదు కాబట్టి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను
సమాజంలో నిరాదారణకు గురికాకుండా చూడాల్సిన భాద్యత  ప్రతి పౌరుడి
మీద ఉంది.  ఎయిడ్స్ భాదితులకు ప్రేమాభిమానాలు పంచి,  మనలో ఒకరిగా 
చూడటం వలన  వారు మరికొన్ని సంవత్సరాలు జీవించడానికి అవకాశం
ఉంది.  ఎయిడ్స్ వ్యాధి పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే ఈ వ్యాధిని
చాలావరకు నివారించవచ్చు.

Sunday, 20 November 2011

అధికార దాహం

ఆనాడు ఆంగ్లేయుల పాలన
అంతమైనదని ఆనందించాం!
ఈనాడు విదేశీయుల
పంచన పడి రోధిస్తున్నాం!!
ప్రపంచీకరణ ధాటికి
మాయమై పోతున్నాయి పల్లెలు!
ప్రపంచ బ్యాంకు షరతులకు
రోడ్డున పడుతున్నారు ప్రజలు !!
పాలకుల గుప్పిట్లో ---
ప్రజలు తోలుబొమ్మలు!
వరల్డ్ బ్యాంకు చేతుల్లో---
పాలకులు కీలుబొమ్మలు!!
తెల్లదొరల అమానుషం
అంతమైనదనుకుంటే ---
నల్లదొరల అధికార దాహం
అన్నిరంగాల్లో మొదలయింది
మనదేశాన్ని రక్షించడానికి---
మన జాతీయ గౌరవాన్నికాపాడటానికి---
మరో జాతిపిత కావాలి.


Thursday, 17 November 2011

కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం 'శ్రీ రామరాజ్యం'



ఈ రోజు (17-11-11) విడుదలైన శ్రీ రామరాజ్యం చిత్రం, నేడు వస్తున్న
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంది.  ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు     
మరో 'లవకుశ' ను చూస్తున్నట్టు ఉంది.  ఇలాంటి దృశ్య కావ్యాలను
శ్రీ బాపు గారే తీస్తారని మరోసారి నిరూపించారు.  శ్రీరాముని గెటప్ లో
బాలకృష్ణ గారి నటన నభూతో నభవిష్యతిగా ఉంది.  శ్రీరాముడి పాత్రకి
జీవం పోశారు. ప్రతి సన్నివేశంలోనూ  తన తండ్రిగారిని గుర్తుకు తెచ్చారు.
శ్రీ నాగేశ్వరరావు గారు, నయనతార, శ్రీకాంత్ లు తమ పాత్రలకు పూర్తి
న్యాయం చేసారు.  ఇప్పుడొస్తున్న సినిమాలలో మన సంప్రదాయాలు
కాగడా పెట్టి వెతికినా కానరావు.  అలాంటి విలువలున్న 'శ్రీ రామరాజ్యం'
చిత్రం రావడం ఆనందదాయకం. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు
ప్రత్యేక ఆకర్షణ. పాటల చిత్రీకరణ బాగుంది.  తెర పైన పాటలన్నీ బాగున్నాయి.
ఈ తరం వారిని ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్న 'శ్రీ రామరాజ్యం'
కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం.

Thursday, 10 November 2011

ప్రేమంటే ఇదేనా?

నా హృదయంలో 
ప్రేమదీపాన్ని వెలిగించి 
నా ఊపిరిలో 
వెచ్చని జ్ఞాపకం అయ్యావు
మోడుబారిన 
నా మనసును కరిగించి
నా గళంలో 
అమృత ధారవయ్యవు
ఆప్యాయత, అనురాగాల్ని పంచి 
నా జీవితాన్ని 
నందనవనం చేశావు
నా ప్రాణానికి ప్రాణమై 
నాలో ఎన్నో ఆశలు పెంచి 
అనుకోకుండా దూరమయ్యావు 
ప్రియతమా!
ప్రేమంటే ఇదేనా ?
ఒక్కసారి ఆలోచించు 
మన  ప్రేమను బ్రతికించు.

Sunday, 6 November 2011

ముస్లిం సోదరులకు 'బక్రీద్' పండుగ శుభాకాంక్షలు!


త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు  జరుపుకునే 
'బక్రీద్' పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు 
శుభాకాంక్షలు.