మన తెలుగు సినిమాలలో కథ అసలు ఉండదు. కథ స్థానాన్ని బూతు సంభాషణలు, భయంకర వాయిద్యాలు, ఎబ్బెట్టు దుస్తులు, సాహిత్యం లేని పాటలు , భయంకర పోరాటాలు, రక్తపాతాలు ఆక్రమించుకున్నాయి. ఇలాంటి చెత్త సినిమాలు పట్టుమని పది రోజులు కుడా ఆడవు. ఇక హీరో విషయానికొస్తే, పాత సినిమాలలో హీరోను 'డైనమిక్' గా చూపించే వారు దర్శకులు. కాని నేడు హీరో ని జులాయిలా... రౌడీ వెదవలా చూపిస్తున్నారు. హీరోయిళ్లు అయితే విచిత్రమైన దుస్తులలో అర్థనగ్నంగా కనిపించడానికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇలా పనికిమాలిన సినిమాలు నిర్మించి పూర్తిగా తెలుగుదనానికి దూరమై పరాయి పంచన మోకరిల్లుతున్నారు. తెలుగు అందాలను వదలి పరాయి అందాలకు స్వాగతం పలుకుతున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలని ప్రతిబింబించే సినిమాలను నిర్మించడం మానేశారు. హింస, శృంగారం, వెకిలి హాస్యం.. ఇవి ఉంటేనే తెలుగు సినిమా అనుకుంటూ, మన భాషను విస్మరిస్తున్నారు... మన సంస్కృతిని కాలరాస్తున్నారు... ఉన్నతమైన మన సంప్రదాయాలను తిలోదకాలిస్తున్నారు. పేరుకు మాత్రమే తెలుగు సినిమా, కాని ఎక్కడా తెలుగు సంప్రదాయాలు గాని, ఆచారాలు గాని తెలుగు లోగిళ్ళు గాని వెండి తెర పైన కనిపించవు. పరభాష మోజులో పడి, తెలుగుదనాన్ని సినిమాల్లో కనిపించకుండా సమాధి కట్టేశారు మన తెలుగు దర్శక నిర్మాతలు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు" లాంటి చిత్రాలు ఎప్పుడో పుష్కరాని కొక్కటి వస్తుంది తప్ప, తర్వాత కాగడా పట్టి వెతికినా అలాంటి సినిమాలు మచ్చుకైనా కనిపించవు.
No comments:
Post a Comment