”శోధిని”

Tuesday 31 July 2012

యమదూతలు




      ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అంటే మృత్యుశకటాలలో యమపురికి ప్రయాణం చేయడమే.  గత కొంత కాలంగా బస్సు ప్రమాదాలు చూస్తుంటే నిజమేనని పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయానించాలంటే అరచేతిలోప్రాణాలు పెట్టుకోవాల్సినదేనని ప్రస్ఫుటం చేస్తున్నాయి."ఆర్టీసీబస్సుల్లోప్రయాణించడంక్షేమకరం..సురక్షతప్రయాణంకోసంఆర్టీసీలోప్రయానించండి'  అంటూ ఢంకా బజాయించే ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లను  కట్టడం చేయడంలోపూర్తిగావిఫలమవుతోంది. నిర్లక్షంగా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ మాట్లాడటం, బస్సును స్టేజీలలో ఆపక పోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలుజరుగుతున్నాయి.  డ్రైవర్స్ దూకుడికి కొందరు  ప్రాణాలు పోగొట్టుకుంటే , మరికొందరు వికలాంగులుగా మారుతున్నారు. కొందరు డ్రైవర్స్ ట్రాఫిక్ సిగ్నల్ కూడా లెక్కచేయరు.  ప్రమాదాలు జరిగినప్పుడు సంఘటనా స్థలంలో బస్సును వదిలేసి పారిపోయి  యూనియన్లను ఆశ్రయించడం జరుగుతోంది. వెనుక ఆర్టీసీ బస్సు వస్తుందంటే ద్విచక్రవాహనదారులగుండెల్లోగుబులు మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఇలా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న సంఘటనలు డ్రైవర్స్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. బస్సు  కదిలే సమయంలోనే  కొందరు డ్రైవర్స్  కావాలనే వేగం  పెంచడంతో చాలా మంది ప్రయాణికులు వెనుక చక్రాల కింద పడి మరణిస్తున్నారు. వీరిని ఆ యముడే భూలోకానికి 'యమదూతలు 'గా  పంపించినట్టుంది. ఇన్నిప్రమాదాలు జరుగుతున్నా  డ్రైవర్స్ లో కొంచమైన కరుణ, జాలి కనిపించదు . పైగా వాళ్ళ  ఇష్ట ప్రకారం బస్సును డ్రైవింగ్ చేస్తుంటారు . ఇలా ప్రమాదాలు జరుగుతుంటే, ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Saturday 21 July 2012

తల్లిదండ్రులను గౌరవిద్దాం!



                నేడు  మానవుని మనసులో మార్పులోచ్చి , మనవ సంబంధాల స్థానంలో ఆర్ధిక సంబంధాలు వచ్చి చేరాయి.  ఈ పరిణామం వల్ల తల్లిదండ్రులను గౌరవించడం క్రమంగా తగ్గిపోయింది.  ఇంట్లో నుంచి పెద్దలకు గౌర మర్యాదలు దక్కడం లేదు.  కొందరు అయితే ఇంట్లో వేధింపులు తట్టుకోలేక ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట గడిపి, ఏ రాత్రి వేళలో ఇంటికి చేరుకుంటున్నారు.  పెద్దలంటే గౌరవం, ప్రేమ ఈనాటి పిల్లలకు లేకుండా పోతోంది.  తనను పెంచి, పోషించి తను ఇంత కావడానికి కారణమైన తల్లిదండ్రులను అగౌరంగా  మాట్లాడటం నిజంగా సిగ్గు చేటు.  డబ్బున్న వాళ్ళు వృద్దాశ్రమంలో చేర్పిస్తే, డబ్బులేని  వాళ్ళు అనాదాశ్రామంలో వదిలేసి, తమ బాధ్యత తీరిందని భావిస్తున్నారు.  జన్మనిచ్చిన తల్లిదండ్రులను సంపాదనలో పడి నిర్లక్షం చేస్తున్నారు. మరికొందరు సంపాదన వేటలో పడి విదేశాలకు వెళుతూ తల్లిదండ్రులను ఒంటరిగా వదిలేస్తున్నారు. మనల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమగాచూసుకున్నారో, మనం వాళ్ళను అంతే ప్రేమగా చూడకపోయినా, కనీసం వాళ్ళ మనసు బాధ పడకుండా చూసుకోవడం మన బాధ్యత.  వారి అవసరాల్ని తీర్చడం, ఆప్యాయతను పంచడం మన ధర్మం.

Wednesday 18 July 2012



18-07-2012 'ఈనాడు లేఖలు'  శీర్షికలో..

Tuesday 17 July 2012

వర్షాకాలంలో కరెంట్ కోతలా?




        మన రాష్ట్రంలో వర్షాకాలంలోనూ కరెంట్ కోట కొనసాగుతోంది.  ఫలితంగా విద్యుత్ ను నమ్ముకుని జీవిస్తున్న వినియోగదారులు, పరిశ్రమ యజమానులు తీవ్రఆందోళనచెందుతున్నారు.  ఎండాకాలం లో రోజుకు రెండు గంటలు కోట విధించిన అధికారులు , వర్షాకాలం వచ్చేసరికి ఒక సమయం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కరెంట్ ను నిలిపివేసి వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు.  ఇప్పటికే విద్యుత్ చార్జీలతో సతమత మవుతున్న ప్రజలకు ఈ కోత వల్ల పుండుమీద కారం చల్లినట్టుంది.ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది.

         మన పాలకులు ఎంతసేపు రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే చూస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని తేటతెల్లమవుతోంది.  హైదరాబాద్ నుంచి డిల్లీ కి ఎన్ని సార్లు చక్కర్లు కొట్టినా, ఏనాడు అయినా ప్రజా సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడినట్టు కనిపించిన దాఖరాలు లేవు.  ఎప్పుడూ "జగన్ ని ఎలా కట్టడి చేయాలి? తెలంగాణా లో పార్టీని ఎలా బ్రతికించుకోవాలి? 2014లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి?"అని ఆలోచిస్తున్నారే కానీ, ప్రజల సమస్యల గురించి  అసలు పట్టించుకోవడం లేదు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపాలి.  

Saturday 14 July 2012

రాష్ట్రమంతా 'హల్ చల్' చేస్తున్న 'ఈగ'





        దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఈగ' చిత్రం జూలై 6 న విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్ తో రాష్ట్రమంతా 'హల్ చల్' చేస్తోంది.  'ఈగ' సంచలన విజయాన్ని సాధించడంతో, త్వరలో విడుదల కావలసిన చిత్రాల తేదీలు చక చక ముందుకు మారి పోయాయి.  కొందరయితే అసలు విడుదల తేదీని ప్రకటించడానికే భయపడుతున్నారు. 'ఈగ' దెబ్బకు ఇలా వాయిదా పడ్డ చిత్రాలలో "జులాయి", "దేవుడు చేసిన మనషులు",   'ఊకొడతారా --ఉలిక్కి పడతారా", "డమరుకం"  లాంటి పెద్ద చిత్రాలు కూడా ఉండటం విశేషం.

        ఒక చిత్రం విడుదలయి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా 'హీరో'దేనని అభిమానులు నానా హంగామా . 'ఈగ' చిత్రం చూసాక తెలిసిందేమిటంటే, విజయానికి ప్రధాన కారణం దర్శకుడేనని.  పెద్ద స్టార్స్ లేకుండా కేవలం ఒక ఈగనే నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మించిన రాజమౌళి నిజంగా దమ్మున్న దర్శకుడు. సినిమా విజయం సాధించడానికి దర్శకుడే  ముఖ్యమని ఈ చిత్రం రుజువు చేసింది.  ఈ చిత్రంలో యామినేషన్ ప్రక్రియ పిల్లలను రంజింప చేస్తే, పెద్దలను కూడా ఆకట్టుకునే విధంగా రూప కల్పన చేయడంలో రాజమౌళి విజయం సాధించాడు.

        విలన్ గా  నటించిన కన్నడ నటుడు సందీప్ నటన 'ఈగ' చిత్రానికి హైలెట్.సమంత కు మంచి గ్లామర్ పాత్ర దొరికింది.  నాని ఉన్నంత సేపు తెరపై మంచి నటనను కనబరచాడు.  కథ విషయానికొస్తే హీరోని చంపిన విలన్ పై పగతీర్చు కోవడానికి 'హీరో' ఈగగా  పుట్టడం. కథ చిన్నదే అయినా దాన్ని తెర పైన చూపించిన  విధానం ప్రశంసనీయం.  గ్రాఫిక్ ఈగను సృష్టించి , దాని చేత రకరకాల విన్యాసాలు చేయించడంలో రాజమౌళి మరో విఠాలాచార్యలా వైవిద్యం ప్రదర్శించాడు. హాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కూడా గ్రాఫిక్ చిత్రాలను నిర్మించ గలదని స్పష్టం చేసిన రాజమౌళి అభినందనీయుడు.  ఈగ చిత్రాన్ని ఒక థ్రిల్లర్ గా , ఎంటర్ టైనర్ గా  రూపొందించడంలో రాజమౌళి నూటికి నూరు శాతం విజయం సాధించాడు. పిల్లలతో కలసి పెద్దలు చూడాల్సిన  చిత్రం 'ఈగ'.

Saturday 7 July 2012

ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న సెల్ టవర్లు




       నేడు మానవుని జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం కావడంతో సెల్ ఫోన్ లేనిదే   క్షణం కూడా గడవని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సెల్ ఫోన్ కి సిగ్నల్ అందించే సెల్ టవర్లు జనావాసాల మధ్య కొలువై ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.  భవనాల  యజమానులు వివిధ సెల్ ఫోన్ కంపెనీ వారిచ్చే డబ్బుకు ఆశపడి  తమ భావనాల పై సెల్ టవర్లు నిర్మించుకోవడానికి  ఏళ్ళ తరబడి లీజుకు ఇస్తున్నారు.  సెల్ టవర్ల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుండటంతో ప్రజలు అనేక సమస్యలనుఎదుర్కొంటున్నారు.  ఈ సెల్ టవర్లు విడుదలచేసే రేడియేషన్ ద్వారా చర్మ వ్యాధులు, మానసిక రుగ్మతులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలపై అధిక ప్రభావం కలిగే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.మరో ప్రక్క పర్యావరణ వేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు.  ఎప్పుడూ మన మధ్యనే వుంటూ మనల్ని' ఆత్మీయుల్లా 'కిచ...కిచ...'అంటూ పలకరించే పిచ్చుకలు ఈ సెల్ టవర్ల వల్ల కనుమరుగవుతున్నాయి. ఈ సెల్ టవర్ల నిర్మాణాల విషయంలో నియంత్రణ లేకపోవడంతో  ఎక్కడ  బడితే అక్కడ విచ్చల విడిగా టవర్లను నిర్మిస్తూ ... ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గృహ సముదాయాల మధ్యనే ఈ టవర్లను నిర్మించడం, నిబంధనలు పాటించక పోవడం ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రాణాంతక మైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటి కైన ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని , సంబంధిత అధికారులు సెల్ టవర్ల ఏర్పాటు విషయంలో కఠిన చర్యలు అవలంభించాలి.  జనావాసాలకు దూరంగా సెల్ టవర్లను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.