”శోధిని”

Sunday, 8 July 2018

అనురాగ శివుడు


బంధాల విలువ తెలిసిన భర్త...బాధ్యతగల తండ్రి. ఈ సుగుణాలు మూర్తీభవించిన దేవుడు మహాశివుడు. శివతత్వం అంటే ప్రేమతత్వమే! ఆ ప్రేమకు శరతుల్లేవు పరిమితుల్లేవు. ధనిక, పేదా తేడాలు అసలే ఉండవు. మిత్రుడయినా, శత్రువైనా...గొప్పవాడయీనా, సమాన్యుడయినా శివుడు దృష్టిలో అందరూ సమానమే. సర్వసృష్టి సమానత్వం శివతత్వంలో భాగమే! భరత ఖండంలో పన్నెండు క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. లక్షలాది శివాలయాలల్లో, శైవక్షేత్రాలలో స్వామి లింగరూపంలో అనుగ్రహిస్తున్నా.. ఈ పన్నెండు క్షేత్రాల్లోని లింగరూపాలలో నిక్షిప్తమైన జ్యోతిదర్శనం వలన భక్తులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు నెరవేరతాయంటారు. భారతదేశం నాలుగుదిక్కులా ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే, మొత్తం దేశాన్ని చూసినంత భాగ్యం కలుగుతుందంట. సోమనాథ, మల్లికార్జున, మహాకాల, ఓంకార, కేదారేశ్వర, భీమశంకర, విశ్వేశ్వర, త్ర్యంబకేశ్వర, వైద్యనాతేశ్వర, నాగేశ్వర, రామేశ్వర, ఘ్రుష్టేశ్వర జ్యోతిర్లింగాలను ఇదే వరుసలో దర్శించాలంటారు.

Saturday, 7 July 2018

చినుకు చిందేసింది.



ఎట్టకేలకు ఊరిస్తూ వస్తున్న చినుకు రాలింది. చిలిపితనంతో సవ్వడిచేస్తూ నేలతల్లికి మట్టి సుగంధ పరిమళాన్ని అద్దింది. పరిసరాలన్నీ నిలువెల్లా తడుస్తూ పరవసించిపోతున్నాయి. చిటపటచినుకులు పడుతుంటే పుడమితల్లి పులకించింది. మేనుపై జాలువారే వాన చినుకులకు చిన్నారి మనసులు పరవశించి చిందేశాయి.  చిరుజల్లులు కురిసిన  అనంతరం  ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదంగా మారిపోయింది.

Friday, 6 July 2018

నవ్వుతూ బతకాలిరా...


మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్ప వరం ‘నవ్వు’. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వితే ఆయువు పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. చలాకీగా ఉండటంతో ఒత్తుళ్ళు దరిచేరవు. ప్రతి రోజు కనీసం 20నిమిషాలు నవ్వితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వటం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో పేరుకు పోయిన మలినాలన్నిటినీ తొలగించ గలుగుతుంది. హాయిగా నవ్వగలిగిన వారి ముఖంలో ప్రశాంతత వస్తుంది.... ముఖం కళగా తయారవుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా వుంచుతుంది. అంతేకాదు శత్రువులను కుడా మిత్రులుగా మార్చే గుణం ఈ నవ్వుకి వుంది. అవకాశం వచ్చినప్పుడల్లా హాయిగా నవ్వి చూడండి... మీకు తెలియకుండానే అధిక రక్తపోటు అదుపు లేకి వస్తుంది. గుండె జబ్బులు దూరం అవుతాయి. మనుషల మధ్య నవ్వులు విరబూసి ఆనందాన్ని పంచుకుంటే బంధాలు బలపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న నవ్వుకు దూరమవ్వడమంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది.


Wednesday, 20 June 2018

"యోగామృతం"


యోగ' అనేది ఏ మతానికో, సంస్కృతికో సంబంధించింది కాదు. ఇది సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది. మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని. ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని. అంతేకాకుండా అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి కుళ్ళు, కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోద్యప్రదాయిని. శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే గొప్ప సాధనం 'యోగ'.

Friday, 15 June 2018

రంజాన్ శుభాకాంక్షలు!




చెడు నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలి, సన్మార్గంలో నడిచేందుకు ఎలా వ్యవహరించాలి, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలు ఖురాన్ గ్రంధంలో వివరంగా వివరించబడింది. పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించింది కూడా రంజాన్ మాసంలోనే. అందువల్ల ముస్లిం సోదరులు ఈ నెలలో నిత్యo ఖురాన్ చదవటంలో నిమగ్నమై ఉంటారు.   రంజాన్ నెలలో ఈ గ్రంధాన్ని చదివినా, ఇతరులు చదవగా విన్నా అధిక పుణ్యం లభిస్తుందంటారు.  అందుకే ఈ నెలలో ఎక్కువ సమయం ఖురాన్ గ్రంధ పారాయణంలో, వినడంలో గడుపుతారు. అమావాస్య తర్వాత కనిపించే నెలవంకను చూసిన పిమ్మట రంజాన్ ఉపవాసాలు ముగించి  ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి  'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!