”శోధిని”

Friday, 21 April 2017

పుడమితల్లి ఆవేదన !

ఆధునిక అవసరాల పేరుతో...
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ...
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
 ధన సంపాదన కోసం...
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ...
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తూ...
మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !

Wednesday, 12 April 2017

నమస్కారానికి ప్రతినమస్కారం !

పరిచయస్తులు ఎదురయినప్పుడు నమస్కరించడం మనదేశ సంప్రదాయం.  అంత మాత్రాన మనకంటే వారు ఎక్కువ అన్న భావన కాదు.  అందుకు ప్రతిగా అవతల వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేయడం సభ్యత అనిపించుకుంటుంది. నమస్కారం అన్నది ఆత్మీయతతో కూడిన పలకరింపు. ఇలా ఒకరికొకరు గౌరవించుకోవడం వలన మానవ సంబంధాలు బలోపేతం అవుతాయి.   


Monday, 10 April 2017

నమ్మినబంటు

వాయుదేవుని అనుగ్రహంతో కేసరి, అంజనకు  జన్మించినవాడు హనుమంతుడు. సూర్యభగవానుడి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించిన ఆంజనేయుడు భక్తులలో అగ్రగణ్యుడు. అపారగునసంపన్నుడు.  అంతేకాదు తేజోసంపన్నుడు, గుణవంతుడు, వినయవంతుడు. శ్రీరామభక్తుడు, నమ్మినబంటు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన  శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన వారికి,  స్తుతించినవారికి గ్రహదోషాలు దూరమవుతాయని,  శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Thursday, 6 April 2017

"పవిత్ర ప్రేమ"

 మల్లెపువ్వులాంటి 
స్వచ్చమైన మనసుతో 
చేసే బంధం పవిత్రబంధం!
ఆ ప్రేమ బంధంలో ...  
 చల్లని చూపులు...   
మధురమైన మాటలు ... 
ఆప్యాయతానురాగాలు... 
చిరుదరహాసాలు...ఉంటే చాలు
ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది  
అలాంటి ప్రేమను పొందినవారి మనసు
ఎప్పుడూ ఆనందంతో పరిమళిస్తూ ఉంటుంది.  

Tuesday, 4 April 2017

"కళ్యాణ వైభోగం"


సకల గుణాభిరాముడు 
సద్గుణ సంపన్నుడు 
సత్యధర్మ పరాయణుడు 
శ్రీరామచంద్రుడి జన్మదినం 
లోకానికంతటికీ పర్వదినం 
సీతారాముల కల్యాణం 
సర్వజనులకు ఆనందదాయకం 
శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో 
మనం భాగస్వాములవుదాం
సకల శుభాలను పొందుదాం !
"శ్రీరామ రక్ష...సర్వజగద్రక్ష" 
 

Sunday, 2 April 2017

నేతల మాటలు-నీటి మూటలు


త్రాగునీటి కోసం 
ఎండలో  ఇబ్బందులు పడుతూ ...
బిందెను నింపి 
భుజాన మోస్తూ ...
బారులు తీరిన మహిళలు!
ఎంత దూరమైతేనేం
గుక్కెడు నీళ్ళ కోసం!!
నేతల మాటలు-నీటి మూటలు


Tuesday, 28 March 2017

తెలుగు నూతన సంవత్సరానికి శుభోదయం !

ఋతువులలో ఎంతో సుందరమైనది వసంత రుతువు. ఈ ఋతువు వస్తూ... వస్తూ... తెలుగువారి నూతన సంవత్సరం 'ఉగాది'ని తెస్తుంది.  ఆమని రాకతో ప్రకృతి పరవశిస్తుంది....పుడమి  పులకించిపోతుంది.  ప్రకృతి కాంత  కొత్త రంగులు పులుముకొని నూతనత్వానికి నాంది  పలుకుతుంది.  హరిత వర్ణపు శోభతో...  చిగురించిన లేత ఆకులతో... లోకమంతా పచ్చగా నవనవలాడుతూ కనపడుతుంది.  వసంత ఋతువులో ప్రకృతి తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది.  వేప పువ్వులు , మామిడి పువ్వులు, లేత చిగుళ్ళు , జాజి, మల్లెల సువాసనలతో పరిసరాలన్నీ ఘుమఘుమలాడుతూ శోభాయమానంగా కనిపిస్తాయి.  లేత చిగుళ్ళు తింటూ మత్తుగా కూసే కోయిల పాట వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది.  కొత్త బెల్లం, కొత్త చింతపండు , మామిడి కాయలు , వేపపువ్వు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషదం. షడ్రుచులలాగే జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, మంచిచెడులను దైర్యంగా ఎదుర్కొని జీవించడానికి సిద్దంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి అర్థం.  తెలుగు ప్రజలంతా మన సంస్కృతీ సంప్రదాయాలతో  ఆనందంగా జరుపుకునే పండుగ 'ఉగాది' పర్వదినం. తెలుగువారి నూతన సంవత్సరం ప్రతి మనిషిలోనూ నూతనత్వాన్ని నింపాలని మనసారా కోరుకుందాం.