”శోధిని”

Wednesday, 22 April 2015

సెల్ ఫోన్ మహత్యం !

నడుస్తున్నా, వాహనం నడుపుతున్నా, టివీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే!  చివరికి నిద్రిస్తున్నా పక్కలో సెల్ తప్పనిసరి అయింది.  ఒకప్పుడు నిద్రిస్తున్న సమయంలో పక్కన భాగస్వామి, లేకుంటే పిల్లలు ఉండేవారు.  ఇప్పుడు వారి స్థానాన్ని సెల్ ఆక్రమించుకుంది.  పిల్లలు, పెద్దలు  అనే తేడా లేకుండా అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి.  పక్కన వున్న వారిని సైతం పట్టించు కోకుండా ఎవరి లోకాన వారు యమా బిజీ!  ఇదీ ఇప్పుడు ప్రతి ఇంట్లో  కనిపించే సెల్ దృశ్యాలు.  ఇలా మనిషి జీవితంలో సెల్  ఒక భాగం అయిపోయింది.  ఈ సెల్ ప్రభావం మన ఆరోగ్యం పైన ఎంత ఉంటుందో సెల్ ప్రియులు ఎంత త్వరగా తెలుసు కుంటే చాలా మంచిది. అవసరానికి సెల్ అవసరమే కాని, నిత్యం అదే జీవితం కాకూడదు.

Monday, 20 April 2015

సిరిమల్లె పువ్వు !



స్వచ్చమైన మల్లెపువ్వులా,  దివ్యమైన వర్చస్సుతో వెలిగిపోతున్న పదహారణాల తెలుగు అమ్మాయి 'శ్రీదివ్య' మంచినటి అని   ప్రశంసలయితే దక్కాయి  కాని,  తెలుగు దర్శకులు, నిర్మాతలు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు.  శ్రీ దివ్య నటనను గుర్తించి తమిళ చిత్ర పరిశ్రమ అవకాశాలు ఇస్తుంటే, మన దర్శకనిర్మాతలు మాత్రం మంచి నటిని మన నట్టింట్లో పెట్టుకొని తెలుగు భాష రాని ఇతర భాషల హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవడం శోచనీయం.

Tuesday, 14 April 2015

నేటి మానవుడు !

నేడు మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి పోతున్నాయి.   ఆస్తిని పెంచుకుంటూ పరుల గురించి ఆలోచించడం మానేస్తున్నారు.  ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...  హృదయ వైశ్యాల్యం తగ్గించుకుంటున్నారు. దాంతో  మానవత్వం నశిస్తూ,  అణువణువునా క్రూరత్వం చోటు చేసుకుంటోంది.    భోగభాగ్యాలు శాశ్వతం కాదని,   ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండటం... సమాజంతో  సత్ సంబంధాలు ముఖ్యమని  మానవుడు తెలుసుకునేదేప్పుడో ! 

Sunday, 12 April 2015

స్వార్ధపరులున్నారు జాగ్రత్త !





ఇతరుల గురించి తేలిగ్గా మాట్లాడటమే అహంకారానికి పరాకాష్ట. ఎదుటి వారిని గౌరవించకపోయిన పర్వాలేదు కాని, అపహాస్యం మాత్రం చేయకూడదు.  ఎక్కడ అహంకారం వుంటుందో  అక్కడ స్వార్థం తప్పకుండా వుంటుంది.  అహంభావులతో కలసి పనిచేయాల్సివస్తే సమస్యలు తప్పవు. అందుకే సాద్యమైనంత వరకు ఇలాంటి వారికి  దూరంగా ఉండటం మంచిది. ఎంత గొప్పవాడయినా, ఎంత పెద్ద  పదవిలో వున్నా అహంకారం లేకుండా వుంటేనే సమాజంలో గుర్తింపు వస్తుంది. అహంకారం వల్ల నష్టాలే కాని, లాభాలు ఉండవని గ్రహించాలి.  మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం గొప్ప కాదు.  ఎదుటివారిని విమర్శించే ముందు మన లోపాలను మనం సరిదిద్దుకోవాలి. కొందరు అనవసరమైన అబద్దాలతో, ఏదొక సందర్భంలో మోసపూరిత ధోరణితో ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి వారికి ఎంత వీలయితే అంత దూరంగా ఉండటం శ్రేయస్కరం.  ఒకసారి వారి గుణం తెలిశాక మళ్ళీ వారికి సన్నిహితంగా వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళు మన దగ్గరకి  వచ్చినప్పుడు, మనల్ని ఆకాశానికి ఎత్తేస్తూ... పక్కవాళ్ళ గురించి చెడుగా చెప్పడం,  పక్కవాళ్ళ దగ్గరకి వెళ్ళినప్పుడు మన గురించి చెడుగా చెబుతూ వాళ్ళను ఆకాశానికి ఎత్తేయడం అలవాటు.  ఇలా తన చుట్టూ ఉన్న వాళ్లల్లో  విరోధం పెంచుతూ, తను మాత్రం అందరి దగ్గర మంచివాడుగా చెలామణి అవుతూ నక్కలా  లబ్ధి పొందుతూ ఉంటారు.  ఇలాంటి వాళ్ళు విష సర్పాల కంటే ప్రమాదం కాబట్టి,  మన జాగ్రతలో మనం ఉండటం చాలా మంచిది.