”శోధిని”

Wednesday, 23 May 2012

పెట్రో మంటలు


        ఇప్పటికే  నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అలమటిస్తుంటే , గోరు చుట్టుమీద రోకలి పోటులా కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెట్రో ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపారు. దేశంలో మండుతున్న ఎండలకు  పెట్రో మంటలు తోడవడంతో  పేద, మధ్య తరగతి  ప్రజలకు గుండె దడ పుట్టిస్తున్నాయి.  గతంలో ఎన్నడూ లేనంతగా, ప్రభుత్వం పెంచలేనంత పెట్రో ధరలు పెంచి యు.పి. ప్రభుత్వం రికార్డు స్థాపించింది .  భారీగా పెరిగిన పెట్రో ధరల పెంపువల్ల  తాజాగా నిత్యావసర వస్తువులతో పాటు బస్సు, ఆటో చార్జీలు పెరగనున్నాయి.  ఫలితంగా ప్రజలపై పెనుభారం పడే అవకాశం వుందిపెంచిన ధర ప్రకారం హైదరాబాద్ లో  రేపటినుంచి లీటరు పెట్రోలు ధర  Rs.81/- రూపాయలు.` కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలను గుర్తించి, పెట్రో ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.  

Tuesday, 22 May 2012

"నాయకుల చెలగాటం...ప్రజలకు ఇరకాటం"




        కొందరి స్వార్థపూరిత ఆలోచనలవల్ల తరుచూ ఉపఎన్నికలు రావడంతో ప్రజాధనం ఎంతో వృధా అవుతోంది.  నాయకుల స్వార్థం కోసం రాజీనామా చేస్తే, నష్టాన్ని ప్రజలు భరించక తప్పడం లేదు.  ఇప్పుడు జరగపోయే ఉప ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి వస్తువు ధరలు విపరీతంగా పెరుగుతాయి.   ఎన్నికలవల్ల తీవ్రంగా నష్టపోయేది మాత్రం ప్రజానీకం.  ఇంతకుముందు  ప్రజాపతినిధి మరణిస్తేనో లేక పార్టి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తేనో ఉపఎన్నికలు జరిగేవి.  కానీ, ఇప్పుడు వాటికిభిన్నంగా  ప్రభుత్వాన్ని బెదిరించదానికో లేక ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం వల్లనో  ఉపఎన్నికలు రావడం దురదృష్టకరం.  ఇలా తరుచూ ఎన్నికలు రాకుండా ఉండాలంటే, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్దపడే నాయకుల దగ్గరే ఎన్నికలకు అయ్యే ఖర్చు రాబట్టాలి.   ఇలా చేస్తే మన ప్రజాప్రతినిధులు ఐదేండ్లు జాగ్రత్తగా వుంటారు. అయినదానికీ, కానిదానికి ఎన్నికలు తెచ్చే ఎమ్మెల్యేలను (ఏ  పార్టీ  వారయినా) చిత్తుగా ఓడించాలి.  ప్రజలంటే ఏమిటో రుచి చూపాలి.

Friday, 18 May 2012

వైభవంగా పూర్ణాహుతి హోమాలు


శ్రీ దుర్గేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠంలో జరిగిన హనుమత్ రక్షాయాగం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి భారీవర్షం కురిసినా బుధవారం ఉదయం ఆటంకం లేకుండా 108 మంది దంపతులుపాల్గొనగా పూర్ణాహుతి హోమాలు  విజయవంతం గా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ భోజన వసతి కల్పించడం, రెండు వేలమందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన   శ్రీ దుర్గేశ్వరరావు గారికి ధన్యవాదాలు.






























Thursday, 17 May 2012

మన ఇంట్లో 'శ్రీ రామరాజ్యం'



కళా ప్రపూర్ణ , చిత్రబ్రహ్మ శ్రీ బాపు గారి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రం 'శ్రీ రామరాజ్యం'  పండిత పామరుల  ప్రశంసలు అందుకుంది.  నేటితరం, రేపటితరం వారు కూడా ఎప్పటికి గుర్తుంచుకునేలా అత్యంత సుందరంగా బాపు, రమణలు ఈచిత్రాన్నితెరకెక్కించారు.   అపురూప దృశ్యకావ్యాన్ని నెల 20 తేదీన సాయంత్రం 7 గంటలకు ‘జీతెలుగు’ ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారు. కమనీయ, రమణీయమైన  చిత్రాన్ని  కుటుంబసభ్యులతో కలసి మన ఇంట్లోనే తిలకించవచ్చు.  భార్యాభర్తల ప్రేమానురాగాలుఅన్నాదమ్ముల అనుబందాలుకుటుంబసభ్యుల ఆప్యాయతలు నేటితరం పిల్లలకు తెలియాలంటే తప్పకుండా చిత్రాన్ని చూపించాలి.


Saturday, 12 May 2012

అమ్మదనం ...ఎంతో కమ్మదనం!



అమ్మ పంచే అనురాగం, మమకారం,ఆత్మీయత అపురూపం 
అమ్మ... ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపం.
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!
అమ్మ బిడ్డకు జన్మనివ్వడానికే జీవిస్తుంది
ఒక్కోసారి బిడ్డ కోసమే మరణిస్తుంది...
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!
అమ్మను మించిన దైవం లేదు...అమ్మే ప్రత్యక్ష దైవం
అమ్మ అనురాగం అపారం...అమ్మ త్యాగం అనితరం
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!
సృష్టికి మూలం అమ్మ...ఆప్యాయతకు అర్థం అమ్మ.
మమతల మకరందం అమ్మ...ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ.
అమ్మదనం ...ఎంతో కమ్మదనం!!!!
'అమ్మ' అనే స్త్రీ మూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే
సమాజం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతుంది.
అందుకే స్త్రీలను గౌరవిద్దాం... మనసార పుజిద్దాం!