”శోధిని”

Saturday, 17 March 2018

ప్రకృతి రమణీయం 'ఉగాది'

వసంత ఋతువులో ప్రకృతి  తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది.  చెట్లన్నీ చిగురించి, ఫలపుష్పాలతో  ఆహ్లాదకరమైన వాతావరణంలో  కనువిందు చేస్తుంటాయి.  మామిడిపూత, లేత మామిడికాయలతో.... తెల్లని వేపపూత, ధవళ మల్లెల సువాసనలు తీయని ఊహలు తలఎత్తేలా  చేస్తుంటాయి.  ఇటువంటి  ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మ సృష్టికార్యం ప్రారంభించడం జరిగింది.  ఆసమయాన్నే యుగాదిగా అభివర్ణించడం జరిగింది.  నాటి యుగాదే నేటి  ఉగాది.  ఉగాదికి మరో ప్రత్యకత ఉగాది పచ్చడి.  వగరు, పులుపు, తీపి, చేదు, కారం, ఉప్పు  అనే ఆరు రుచుల సమ్మేళం దివ్య ఔషధమని చెప్పవచ్చు.  ఈ పచ్చడి సేవించడం వల్ల  వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది.  ఉషోదయపుకాంతితో కొత్త కోరికలు, కొత్తఆశలు తనవెంట తీసుకొచ్చే నూతన సంవత్సరానికి (ఉగాదికి ) ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుదాం. 

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు!

Thursday, 1 March 2018

అందరికీ హోలీ శుభాకాంక్షలు!

పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి. వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి. సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి రంగు వచ్చే రకరకాల పూలతో, ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగులతోనే హోలి జరుపుకోవడం ఉత్తమం. కృత్రిమ రసాయనిక రంగులు వాడి చర్మ వ్యాధులు తెచ్చుకోవడం మూర్ఖత్వం. అంతేకాదు రసాయనిక రంగులు వాడటం వలన కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని మరచిపోవద్దు. రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ, సున్నితమైన రంగులతో సరదాగా కాసేపు ఆడుకుని, ఆవెంటనే వంటికి అంటిన రంగుల్ని తొలగించుకోండి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలి పండుగను ఆనందంగా జరుపుకోండి.


Tuesday, 20 February 2018

"నేడు మాతృభాషా దినోత్సవం"

ఆత్మగౌరవాన్ని ప్రసాదించే మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి భాద్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. దాంతో భాషకి పటుత్వం పెరుగుతుంది. భాష ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే ఆ భాషకి ఖ్యాతి పెరుగుతుంది. ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మనందరం మన మాతృభాషలో మాట్లాడుకుందాం! తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుదాం!!