”శోధిని”

Saturday, 21 March 2015

ఉగాది శుభాకాంక్షలు!




నూతన (ఉగాది) సంవత్సర శుభాకాంక్షలు !




మనసుకు ఆహ్లాదానిచ్చే పండుగ ఉగాది.  
తొలకరి చినుకంత అందంగా...చిరుగాలంత స్వచ్ఛంగా...మంచు బిందువంత మధురంగా ఉండే వసంత ఋతువులో కొత్త మార్పును, నూతన ఆనందాన్ని తెస్తుంది యుగాది. లేత చిగుళ్ళు, గాన కోకిలలు, మామిడి పెందెలు, మల్లెల పరిమళాలు, షడ్రుచుల దివ్య ఔషదం ఉగాది పచ్చడి, కొత్త పంచాంగం ఈ పాడుగా ప్రత్యేకతలు.  'అందరూ బాగుండాలి ... అందరూ సంతోషంగా ఉండాలి' అనే భావన అందరిలో కలగాలని మనసారా కోరుకుంటూ ...
జయనమ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, మన్మధ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.
అందరికీ నూతన (ఉగాది) సంవత్సర శుభాకాంక్షలు !

Wednesday, 18 March 2015

సినిమాలలో వస్త్రధారణ !


సినిమాల ప్రభావం వ్యక్తుల పైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుందని జగమెరిగిన సత్యం.  హీరో అనుసరించే పద్దతులు, హీరోయిన్స్ ధరించే దుస్తులు సమాజంపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి.  సినీ దర్శక, నిర్మాతలు హీరో  ఒంటి నిండా బట్టలు వేయించి స్టయిల్ గా చూపిస్తారు.  అదే హీరోయిన్స్ విషయానికి వచ్చేసరికి బట్టలు కరువయినట్టు చీలికలు, పేలికలతో అర్థ నగ్నంగా చూపిస్తున్నారు.  హీరో, హీరోయిన్స్ మధ్య ఎందుకంత వ్యత్యాసం.  పాత సినిమాలలో హీరోయిన్స్ కట్టు, బొట్టు చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.  వాళ్లకు ఎంతో గౌరవం లభించేది.  నేడు వస్తున్న హీరోయిన్స్ ఒకరికొకరు పోటీ పడుతూ అసభ్యకరంగా వస్త్రధారణ  చేస్తూ మహిళల పరువు తీస్తున్నారు.  హీరోయిన్స్ కేవలం తమ సంపాదన మాత్రమే  చూసుకోకుండా సమాజంలోని తోటి మహిళలను దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణ చేస్తే బాగుంటుంది. 


Monday, 16 March 2015

హల్ చల్ చేస్తున్న పొగరాయుళ్ళు !

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ఉంది.  కాని, అది ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంది.  ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.  అయితే కేంద్ర జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  దీంతో సంబందిత అధికారులు సైతం తగు చర్యలు తీసుకోవడంపై అంతగా దృష్టి సారించలేక పోతున్నారు.  ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం యదేచ్చగా కొనసాగుతోంది.  మొదట్లో కాస్త హడావుడి కనిపించినప్పటికీ ఆ తురువాత నిషేధం మాట మరచిపోయారు. ఇదే ఆసరాగా తీసుకొని పొగరాయుళ్ళు పొగను ఇష్టమొచ్చినట్టు ఊదేస్తూ హల్ చల్  చేస్తున్నారు. సిగరెట్టు పొగతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ ... ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలుగ జేస్తున్నారు.  పొగ త్రాగడం నేటి యువతకి ఒక ప్యాషన్ అయిపొయింది.  ధూమపానం వల్ల భయంకరమైన వ్యాధులు వస్తాయని తెలిసీ కూడా సిగరెట్టుకు బానిసలవుతున్నారు.  సిగరెట్టు త్ర్రాగే వారికంటే ప్రక్కనున్న వారికే ఎక్కువ ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం.  బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్లను కాల్చుతున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.  ఇప్పటికైనా అధికారులు  పోగరాయుళ్ళపై చర్యలు తీసుకుంటే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

Monday, 9 March 2015

శుభోదయం !


తొలి సంధ్య వేళ ...
కోవెలలో ...
పరవశింపజేసే ప్రకృతి అందాలు 
అత్యంత మనోహరం !

Saturday, 7 March 2015

మహిళలను గౌరవిద్దాం ..ఆడపిల్లలను బ్రతకనిద్దాం !




సమాజంలో స్త్రీల వదనం పైనఎప్పుడూ చిరునవ్వులు విరబూయాలంటే...జన్మనిచ్చిన మహిళలను దేవతగా చూడాలి.  సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు పురుషులతో సమానంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి.  తల్లిదండ్రులుచిన్నతనం నుంచి మగపిల్లలలో  సంస్కారబీజాలను నాటాలి.    మనకు చట్టాలు  ఎన్నో ఉన్నాయి.  కానీ, వాటిని అమలు పరచడంలో అధికారుల లోపం కనబడడంతో నిత్యం మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. మన పాలకులు చెబుతున్నవి ఆచరణలో జరగడం లేదు.  ఇప్పటికైనా మహిళలకు మరింత భద్రత కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాల పైన ఉంది.  కేవలం మహిళా దినోత్సవం రోజునే మహిళలపట్ల గౌరవం పాటిస్తే సరిపోదు.  నిత్యం మహిళల హక్కులు, వారి భద్రత,  వారిని గౌరవించడం, స్వేచ్చ పైన చర్చలు జరుగుతూ ఉండాలి.  అలా జరిగినప్పుడు ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అవుతుంది.