”శోధిని”

Saturday, 4 January 2014

అపర కీచకులు


విద్యాలయాలు దేవాలయాలు .. ఉపాధ్యాయులు ప్రత్యేక  దైవాలు.  కాని కొందరు నీతి  బోధకులుగా, సమాజ సృష్టలుగా తమ బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచాకులుగా మారిపోతున్నారు.   అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతూ  ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు.  ఇలాంటి వారి వద్ద విద్య నేర్చుకున్న వారిలో మానవ విలువలు నాశనమవుతున్నాయి. వ్యక్తులకు నైతిక విలువలు లోపించడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి.  తాజాగా నల్గొండ జిల్లాలోని  పెద్దపూర మండలం ఓ తండాలో పసిమొగ్గలపై  పైశాచానికి తెగబడ్డ నీచుడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది.  ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. వెలుగు చూసేవి కొన్ని కేసులు మాత్రమే , వెలుగు చూడని సంఘటనలు కోకొల్లలు.  కొందరి మగ మృగాల ప్రవర్తనకు మహిళలు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు.    రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది.  ఇలాంటి  సంఘటనలు జరిగినప్పుడు రాజకీయనాయకులు ' ఖండిస్తున్నాం' అని అంటారు తప్ప, మహిళల రక్షణ కోసం చొరవ చూపడం లేదనేది జగమెరిగిన సత్యం. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా.. పశుప్రవృత్తికి  మాత్రం కళ్ళెం వేయలేక పోతున్నాయి.  మహిళలు, చిన్నారులు ఆకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూలాలు వెతికి సమూల ప్రక్షాళన చేయాలి.  అందుకు యువత ముందుకు రావాలి.  ఒక్క యువతతోనే ఇది సాధ్యమవుతుంది.  


Friday, 3 January 2014

మనదేశ రాజకీయం!

 
ఎమ్మెల్యే సీటు 
మహిళల కైతే  వాడి ఆవిడకి 
రిజర్వేషన్  అయితే  వాడి పనోడికి 
జనరల్ అయితే మాత్రం వాడికే  
ఇది  వంశపారిపరంగా వస్తున్న ఆచారం 
ఎవరు గెలిచినా ... 
కలకాలం అధికారం వాడిదే!
ఇదీ ... మనదేశ రాజకీయం!!  


Tuesday, 31 December 2013

'లెజెండ్' లో బాలయ్య ఫస్ట్ లుక్


మిత్రులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు!



ఈ ఆంగ్ల నూతన  సంవత్సరంలో ప్రేమ, అభిమానం, ఆనందం, ఆహ్లాదం, అనురాగం, ఆప్యాయతలు మీ అందరి జీవితాలలో వెళ్లి విరియాలని మనసారా కోరుకుంటూ... 

మిత్రులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు!

సృష్టి రహస్యం!


ప్రకృతిని సృష్టించిన తరువాత భూమ్మీద వున్న ఘన పదార్థాలన్నీటిని కలిపి పురుషుడికి ప్రాణం పోశాడంట బ్రహ్మ.  ఒంటరిగా కొన్ని రోజులు తిరిగిన పురుషుడికి ఏమీ తోచక బ్రహ్మ దగ్గరికి వెళ్లి 'నాకేమి తోచడం లేదు అన్నాడట'.
'సరే... నీకు తోడు కావాలి కదా! అలాగే ఇస్తాను' అని చెప్పి, సృష్టిలోని అద్భుతాలన్నీ మేళవించి 'స్త్రీ'కి ప్రాణం పోశాడట.
వారం రోజులు  గడిచాక బ్రహ్మ దగ్గరకి పరుగెత్తుకొచ్చిన మగవాడు "స్వామి...! మీరు  తోడుగా ఇచ్చిన జీవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది....   విరామం లేకుండా మాట్లాడుతోంది.  ప్రతిదానికి విస్సుకుంటోంది...   నాకు ఏకాంతం లేకుండా చేస్తోంది...  నేనామెతో కలిసి బతకలేను.  ఈ జీవిని వెనక్కి తీసుకో" ఆన్నాడట.  
చురునవ్వుతో ఆ యువతిని వెనక్కి తీసుకున్నాడట  బ్రహ్మ.
రెండు రోజులు గడవక ముందే మళ్ళీ పరుగెత్తుకొచ్చిన  పురుషుడు "దేవా...! ఆ జీవి నాకు దూరం అయినప్పటి నుంచి జీవితంలో ఉత్సాహం పోయింది. సంతోషం కరువయింది. నాతో  ఆడి , పాడి, తన ఓరచూపులతో నన్ను ఆకట్టుకునేది...   తక్షణమే ఆమె నాకు కావాలి... ఆమె లేకుండా జీవించలేను" వేడుకున్నాడట. 
"చూడు నాయన ఇప్పటి కైన తెలిసిందా...  'స్త్రీ ' అంటే ఏమిటో....   స్త్రీలు లేని చోట శోభ కొరవడుతుంది.  వారు లేకపోతే  ప్రేమతత్వం వికసించదు. నిండుదనం లోపిస్తుంది ... అందం ఉండదు... ఆనందం ఉండదు" అని చెప్పి
బ్రహ్మ అదృశ్యమయ్యాడట.
స్త్రీ లేకుండా మగవాడు బ్రతకలేడని తెలుసుకున్నాడు పురుష పుంగవుడు.



  

Monday, 30 December 2013

అయోమయం!



మొదటి సారిగా ఇంటర్వ్యు వెళ్ళాడు తరుణ్ 
కొన్ని ప్రశ్నలు అడిగాక, "ఇంతకు ముందు ఎక్కడయినా చేసిన అనుభవం ఉందా?" అడిగాడు ఇంటర్వ్యు అధికారి అయోమయం. 
"బోలెడు  అనుభవం వుంది సార్!"
"అయతే ఎక్కడక్కడ పని చేసావో వివరంగా చెప్పు "
"ఎలిమెంటరీ స్కూల్లో అయిదేళ్ళు... హైస్కూల్లో అయిదేళ్ళు ... జూనియర్ కాలేజీలో రెండేళ్ళు ... ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగేళ్ళు...   మొత్తం పదహారేళ్ళు సార్" 
"అదికాదయ్యా పని చేసిన అనుభవం"
"ఇప్పుడు  మీరు ఉద్యోగం ఇస్తే అనుభవం  దానంతట అదే వస్తుంది సార్!"
తను చెప్పేదాంట్లో నిజం వుందని గ్రహించి తరుణ్ ని ఎంపిక చేశాడు అయోమయం.  


Sunday, 29 December 2013

అవినీతిపై 'అన్నా'స్త్రం


ఇటీవల ఎవరి నోట విన్నా  అదే మాట 'అవినీతిపై పోరాటం'.  ఇదే నినాదంతో 'కేజ్రీవాల్ ' గారు విజయం సాధించారు. దేశంలో అవినీతిని అరికట్టడం కోసం లోక్ పాల్ బిల్లు తేవాలంటూ అన్నా హజారే చేసిన ఉద్యమానికి  కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది.  ఫలితంగా పార్లమెంటులో బిల్లు పాసయింది. ప్రజలు ఉత్సహంగా హజారేకి 'జై' కొట్టారు.  బహుశా  హజారే కూడా  ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని ఉహించి ఉండరు. ఇదే విదంగా నాడు మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ సమయంలో జాతినంతా ఏకతాటిపైకి  తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించ గలిగారు.  శ్రీమతి ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ నాయక్  జయప్రకాశ్  నారాయణ ఉద్యమించారు. ప్రజాస్వామ్యవాదులందరినీ ఏకం చేసి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చారు. ఆ తరువాత అదే స్థాయిలో జనాన్ని ఆకర్షించిన నేత 'అన్నా హజారే'.  80 ఏళ్ల వయసులో నిరాహార దీక్ష చేపట్టి ప్రజలలో చలనం తీసుకు వచ్చారు.  ఈ ముగ్గురు నేతలు...  మనకు స్పూర్తి ప్రదాతలు!  ఈ  నేతలు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని  ఎప్పుడూ  ఏ  పదవి ఆశించలేదు. భారత ప్రజలను ఏకతాటి పైకి  తీసుకొచ్చి లక్ష్యం సాధించారు.  ప్రస్తుతం  మనకు అలాంటి  నాయకుడు కావాలి. అవినీతిని రూపుమాపాలంటే ముందుగా ప్రజలలో మార్పు రావాలి. తమను మభ్యపెడుతున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.