”శోధిని”

Saturday, 26 May 2012

రియల్ హీరో


        ' NTR 'ఈ పేరే ఒక ప్రభంజనం. ఒక సంచలనం.  మంచి మానవతల మేలుకలయిక నందమూరి తారక రామారావు.  పట్టుదల, కార్యదీక్ష ఆయన సొత్తు.  ఆంధ్రరాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.  ఆంద్రుల అభిమానానికి, ఆత్మగౌరవానికి ఆయన మారుపేరు.  ప్రేక్షకులే నా ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిఉర్రూత లూపింది.  సినిమా రంగంలో ఆయన పాటించిన క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకమైంది.  నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు జాతి మన్నలను పొందారు. సాంఘీక, జానపద,పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించే నట సింహం.    తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం. అన్నిరకాల పాత్రలలో నటించి ప్రజల మన్నలను పొందారు.  నమ్మిన వారిని ఆదరించడంలో ఆయనకు ఆయనే సాటి.  నిక్కచ్చగా, నిజాన్ని దాచకుండా చెప్పడం ఆయన వ్యక్తిత్వంలో ఒక విశేషం.  ఆత్మీయతను పంచడంలో తన పరభేదం లేకుండా ప్రేమను చూపించగలిగే  ప్రేమశీలి.  1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధి నే 'డీ' కొన్న యోధుడు NTR.  ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించారు. అటు సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్రవీసిన రామారావు గారునిజంగా రియల్ హీరో. ఆయన సామాన్యుడు కాదు ...ఒక మహాశక్తి .  ఎన్నో విశిష్టలున్న మహామనిషి.సినీరంగంలో శ్రీరాముడుగా , శ్రీ కృష్ణుడుగా, కర్ణుడుగా , దుర్యోధనునిగా, రావణాసురుడుగా వేసిన పాత్రలు అమోఘం. ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు.  

       సాహసాలు చేయడంలో ఆయనకి ఆయనే సాటి.  అందుకు ఉదాహరణ రావణబ్రహ్మ పాత్ర.  ఏదయిన ప్రయోగం చేయాలంటే , ముందుగా ఆయనమీదే చేసుకునేవారు.  'దాన వీర శూర కర్ణ ' చిత్రంలో మూడు పాత్రలు వేసి శభాష్ అనిపించారు.  శ్రీమద్విరాటపర్వం లో ఏకంగా అయిదు పాత్రలు వేసి గొప్ప సాహసం చేసి విజయం సాధించారు.  ఇలాంటి సాహసం మరే నటుడికి సాధ్యం కాదు అంటే అతిశయోక్తి కాదు.  నటనలో లీనమై ప్రతిపాత్రకు న్యాయం చేకూర్చిన నటుడు.  దాదాపు మూడువందల చిత్రాలలో నటించి, తెలుగువారి హృదయాలలో పదిలంగా స్థానం ఏర్పరచుకున్న NTR ధరించని పాత్ర లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్  చైర్మన్ గా , జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు.  మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.

     మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....

Wednesday, 23 May 2012

పెట్రో మంటలు


        ఇప్పటికే  నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అలమటిస్తుంటే , గోరు చుట్టుమీద రోకలి పోటులా కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెట్రో ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపారు. దేశంలో మండుతున్న ఎండలకు  పెట్రో మంటలు తోడవడంతో  పేద, మధ్య తరగతి  ప్రజలకు గుండె దడ పుట్టిస్తున్నాయి.  గతంలో ఎన్నడూ లేనంతగా, ఏ ప్రభుత్వం పెంచలేనంత పెట్రో ధరలు పెంచి యు.పి.ఏ ప్రభుత్వం రికార్డు స్థాపించింది .  భారీగా పెరిగిన పెట్రో ధరల పెంపువల్ల  తాజాగా నిత్యావసర వస్తువులతో పాటు బస్సు, ఆటో చార్జీలు పెరగనున్నాయి.  ఫలితంగా ప్రజలపై పెనుభారం పడే అవకాశం వుంది. పెంచిన ధర ప్రకారం హైదరాబాద్ లో  రేపటినుంచి లీటరు పెట్రోలు ధర  Rs.81/- రూపాయలు.` కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలను గుర్తించి, పెట్రో ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.  

Tuesday, 22 May 2012

"నాయకుల చెలగాటం...ప్రజలకు ఇరకాటం"




        కొందరి స్వార్థపూరిత ఆలోచనలవల్ల తరుచూ ఉపఎన్నికలు రావడంతో ప్రజాధనం ఎంతో వృధా అవుతోంది.  నాయకుల స్వార్థం కోసం రాజీనామా చేస్తే, ఆ నష్టాన్ని ప్రజలు భరించక తప్పడం లేదు.  ఇప్పుడు జరగపోయే ఉప ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. ఫలితంగా రాష్ట్రంలో ప్రతి వస్తువు ధరలు విపరీతంగా పెరుగుతాయి.  ఈ ఎన్నికలవల్ల తీవ్రంగా నష్టపోయేది మాత్రం ప్రజానీకం.  ఇంతకుముందు  ప్రజాపతినిధి మరణిస్తేనో లేక పార్టి ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తేనో ఉపఎన్నికలు జరిగేవి.  కానీ, ఇప్పుడు వాటికిభిన్నంగా  ప్రభుత్వాన్ని బెదిరించదానికో లేక ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం వల్లనో  ఉపఎన్నికలు రావడం దురదృష్టకరం.  ఇలా తరుచూ ఎన్నికలు రాకుండా ఉండాలంటే, రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్దపడే నాయకుల దగ్గరే ఎన్నికలకు అయ్యే ఖర్చు రాబట్టాలి.   ఇలా చేస్తే మన ప్రజాప్రతినిధులు ఐదేండ్లు జాగ్రత్తగా వుంటారు. అయినదానికీ, కానిదానికి ఎన్నికలు తెచ్చే ఎమ్మెల్యేలను (ఏ  పార్టీ  వారయినా) చిత్తుగా ఓడించాలి.  ప్రజలంటే ఏమిటో రుచి చూపాలి.

Friday, 18 May 2012

వైభవంగా పూర్ణాహుతి హోమాలు


శ్రీ దుర్గేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠంలో జరిగిన హనుమత్ రక్షాయాగం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి భారీవర్షం కురిసినా బుధవారం ఉదయం ఏ ఆటంకం లేకుండా 108 మంది దంపతులుపాల్గొనగా పూర్ణాహుతి హోమాలు  విజయవంతం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ భోజన వసతి కల్పించడం, రెండు వేలమందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన   శ్రీ దుర్గేశ్వరరావు గారికి ధన్యవాదాలు.






























Thursday, 17 May 2012

మన ఇంట్లో 'శ్రీ రామరాజ్యం'



కళా ప్రపూర్ణ , చిత్రబ్రహ్మ శ్రీ బాపు గారి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రం 'శ్రీ రామరాజ్యం'  పండిత పామరుల  ప్రశంసలు అందుకుంది.  నేటితరం, రేపటితరం వారు కూడా ఎప్పటికి గుర్తుంచుకునేలా అత్యంత సుందరంగా బాపు, రమణలు ఈచిత్రాన్నితెరకెక్కించారు.  ఈ అపురూప దృశ్యకావ్యాన్ని ఈ నెల 20 వ తేదీన సాయంత్రం 7 గంటలకు ‘జీతెలుగు’ ఛానల్ వారు ప్రసారం చేస్తున్నారు. కమనీయ, రమణీయమైన ఈ చిత్రాన్ని  కుటుంబసభ్యులతో కలసి మన ఇంట్లోనే తిలకించవచ్చు.  భార్యాభర్తల ప్రేమానురాగాలు, అన్నాదమ్ముల అనుబందాలు, కుటుంబసభ్యుల ఆప్యాయతలు నేటితరం పిల్లలకు తెలియాలంటే తప్పకుండా ఈ చిత్రాన్ని చూపించాలి.