”శోధిని”

Saturday, 31 December 2016

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు !


ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న మిత్రులందరికీ  సకల శుభాలు  కలగాలని మనసారా కోరుకుంటూ...ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు !   పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి,  కోటి ఆశలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుదాం !!

Tuesday, 27 December 2016

విజయవంతంకాని (మైన) 50వ రోజు

నల్లధనాన్ని, నకిలీని కట్టడిచేయాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యే అయినా, ఆదెబ్బకు దేశం మొత్తం  డబ్బు సమస్యతో అతలాకుతలమైపోయింది.  నల్లధనస్వాములు మాత్రం హాయిగా ఉన్నారు.  కోట్ల రూపాయల  కొత్తనోట్లు  బడాబాబుల ఇంట్లోకి చేరిపోయాయి.  ఎటొచ్చి సామాన్యులే  బ్యాంకులు,  ఏటీఎంల దగ్గర చేంతాడంత పొడవైన క్యూలో  అష్టకష్టాలు పడుతున్నారు.  బ్యాంకుల్లో డబ్బుఉండికూడా డబ్బును తీసుకోలేని పరిస్థితి. ఇంటశుభకార్యాలు తలపెట్టుకున్నవాళ్ళు నోట్లవేతలతో తల పట్టుకుంటున్నారు.  ఇది ప్రజల సహనానికి ప్రభుత్వం పెట్టిన పెద్ద పరీక్ష.  గత 50 రోజులుగా దేశంలోని ప్రజలు నరకమంటే ఏమిటో చవిచూస్తున్నారు.  కొత్త సంవత్సరంలోనైనా నోట్లపాట్లు తీరుతాయో లేదో ఆ భగవంతుడుకే తెలియాలి.  

 

Monday, 26 December 2016

చలి మంటలు !



ఉషోదయపు వేళ... చీకటి తెరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.  మంచు తెరల పరదాల  మధ్య ప్రకృతి సోయగాలతో అలరారుతోంది.   ఉదయాన్నే ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ళ ముందు ఆవిష్కారమవుతోంది.   చలిపులి వణికించే వేళ... చలిమంటల నునువెచ్చని వేడి శరీరానికి తగులుతుంటే ...ఎంత హాయి.  

Saturday, 24 December 2016

మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !

 

మనం ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...మనల్ని కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసు చెప్పాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు కాకుండా ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నీతి, నిజాయితీగా నడిస్తే ఏసుక్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు. మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు లభిస్తాయి.

Monday, 19 December 2016

మంచి నేస్తం !

చికాకులన్నీ ఎగిరిపోవడానికి
చిరునవ్వు చాలు
కన్నీళ్లు ఆగిపోవడానికి
చల్లనిచూపు చాలు
గుండె మంటను చల్లార్చడానికి
తియ్యటి మాటలు చాలు
నేనున్నాననే భారోసానివ్వడానికి
మంచి నేస్తం దొరికితే చాలు !

Thursday, 15 December 2016

మానవ సంబంధాల మధురిమలు !

నేటి యువతకు సరదా కావాలి.  సద్దుబాటు అక్కర్లేదు.  సంతోషం కావాలి...భాద్యత అవసరం లేదు.  వారిలో  వికృత చేష్టలు ... వెర్రితలలు  తిష్ట వేయడంతో  తల్లిదండ్రుల పట్ల ప్రమానురాగాలు మృగ్యమైపోతున్నాయి. అక్కడక్కడ ఇంకా కొందరు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు కాబట్టి, ఇంకా మనవ సంబంధాల మధురిమలు మిగిలే ఉన్నాయి.  వాటిని మనం నిరంతరం కాపాడుకోవాలి.  ప్రేమ, గౌరవం అనేవి ఒకరిస్తే వచ్చేవి కావు.  మన మంచితనంతో మనమే సంపాదించుకోవాలి. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు,  పిల్లలకు సత్ప్రవర్తన, సభ్యత ,సంస్కారం నేర్పించి మానవీయ విలువలను వారికి బోధించాలి. పెద్దవాళ్ళను గౌరవించడం, ప్రేమించడం నేర్పి, మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెంచకుండా చూడాలి.

Sunday, 11 December 2016

అవినీతి అధికారుల భరతం పట్టాలి.

అవినీతి అధికారుల భరతం పట్టాలి.
పెద్దనోట్ల రద్దువల్ల సామాన్య ప్రజలకు నిత్యం ప్రత్యక్షనరకం కనపడుతోంది. పనులు మానుకొని బ్యాంకుల ముందు గంటలతరబడి నిల్చున్నా డబ్బులు అందక ప్రజలు నిరాశతో వెనుతిరుగుతున్నారు. నెలంతా కస్టపడి సంపాదించుకున్న డబ్బును పొందలేకపోతున్నారు. నిత్యావసర వస్తువులు , కూరగాయలు కొనేందుకు డబ్బులు లేక నిత్యం నరకయాతన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మేలు చేస్తుందేమో కాని, ఇప్పుడు మాత్రం ప్రజలు దినదినగండంను చవిచూస్తున్నారు. నల్లడబ్బు దాచుకున్న కుబేరులు మాత్రం కొందరు అవినీతి బ్యాంకు అధికారుల సహాయంతో కోట్ల రూపాయల కొత్త నోట్లు అందుకుంటున్నారు. అక్రమమార్గంలో నడిచే కొందరు బ్యాంకు అధికారులు పర్సెంటేజీలు తీసుకొని నల్లడబ్బున్న బదాబాబులకే కొత్తనోట్ల కట్టలు పంపిస్తూ, సామాన్య ప్రజలకు మాత్రం మొండిచెయ్యి చూపిసున్నారు. పెద్దనోట్లు రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయమే. కాని, కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వల్ల ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయ ఫలితాలు ప్రజలకు చేరాలంటే, అవినీతి ప్రభుత్వ అధికారుల భరతం పట్టాలి.