Wednesday 27 December 2017

ఈ చలిలో.....




ఉషోదయాన చీకటి తెరలు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ వెలుగు రేఖలు విచ్చుకునేవేళ ... మంచు తెరల పరదాల మధ్య ప్రకృతి సోయగాలతో అలరారుతూ... ఆహ్లాదకరమైన వాతావరణం కళ్ళ ముందు ఆవిష్కారమవుతూ చలిపులి వణికించే వేళ... చలిమంటల నునువెచ్చని వేడి శరీరానికి తగులుతుంటే ...ఎంత హాయి.

Sunday 24 December 2017

కరుణామయుడి జన్మదిన శుభాకాంక్షలు

దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు క్రిస్మస్. ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడు. ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. క్రిస్మస్ నాడు క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడుతూ, దేవుని వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు... పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు..." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. మనం ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...మనల్ని కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసు చెప్పాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు కాకుండా ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు . నీతి, నిజాయితీగా ఉంటూ, మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. దాంతో సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు మనకు లభిస్తాయి.

మిత్రులందరికీ 'క్రిస్మన్' పర్వదిన శుభాకాంక్షలు.  


Wednesday 6 December 2017

అ,ఆ,లు



అ,ఆ,లు పలుకుతుంటే...
ఆమని హాయిగా రాగాలు ఆలపించినట్టు, 
పసందయిన విందుభోజనం చేసినట్టు.
వెన్నెల వర్షం కురిసినట్టు ఉండే...
సాటిలేని మేటి ఘనాపాటి మన తెలుగు భాష!


Friday 3 November 2017

"కార్తీక దీపం...కాలుష్య హరణం"

మాసాలలో కార్తీక మాసం, తిధుల్లో పున్నమి పవిత్రమైనవి. ఈ రెండూ సమన్వయం కార్తీక దీపం. కార్తీక మాసంలో వచ్చే పున్నమి చాలా పవిత్రమైనది. అందుకే ఈ రోజున పూజలు, అభిషేకాలు, వ్రతాలు, దీపారాధనలతో గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భుక్తుల విశ్వాసం. ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగిస్తారు. దీపాలవరుస చూస్తుంటే,ఎంతోరమ్యంగా,నేత్రపర్వంగా,హృదయానందకరంగా ఉంటుంది.

అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!

Tuesday 31 October 2017

హడలెత్తిస్తున్న దోమలు

దోమ... ఈ పేరు వినగానే ఎంతటి వారైనా హడలిపోవాల్సిందే.  దీనిని చూడగానే ప్రజలకు ఒంటిలో వణుకు పుట్టి, చలిజ్వరంతో ముచ్చెమటలు పడతాయి.  ఇది చిన్న కీటకమే అయినా, దీన్ని తేలికగా తీసుకోకండి.  ఎన్నో వ్యాధులకు గురిచేసి, వందలాదిమందిని ఆసుపత్రుల పాలు చేస్తోంది.  అంతేకాకుండా  ఎంతో మంది   రోగుల మృతికి కారణమయ్యేది  కూడా ఈ చిన్న కీటకం వల్లే.  దోమకాటుకు జ్వరాలు విస్తరించి ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల్లా మారుతున్నాయి.  దోమలబారిన పడేవారు ఎక్కువగా పిల్లలు, వృద్ధులు, మహిళలే ఉంటున్నారు.  'కీటకం చిన్నదే' అని నిర్లక్షం చేయకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, త్రాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.   


Sunday 22 October 2017

కార్తీక దీపం ... సర్వపాపహరణం!

కార్తీకమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. దేవాలయాలలో ద్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. దీపం ద్వజస్తంభంపై వెలుగులీనుతూ ఉంటుంది. జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. పవిత్రమైన కార్తీకమాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుందని, వ్రతాలు అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, విభూది బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుందని, రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని గట్టి నమ్మకం. కార్తీకమాసంలో మనం పాటించే నియమాలే మనకు భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే దైవారాధన, జపం, ఉపరాస దీక్షలు, దీపారాధనలు, దానధర్మాలు, అన్నదానం అన్నీ కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయని చెబుతారు.


"అడవి బిడ్డలు ...ఆణిముత్యాలు "


        అందరిని సమానంగా ఆదరించడం, అక్కున చేర్చుకొని ఆప్యాయతను పంచడంలో అడవి బిడ్డలు ముందుంటారు. క్రమశిక్షణ, నీతినిజాయితీలు కలగి మోసం, ద్వేషం లేని సమాజం నేటికి మారుమూల గిరిజన తాండాల్లో ఉంది. గ్రామదేవతలను ఆరాధించడం, తిరునాళ్ళు, జాతరలు చేయడం లాంటి సాంస్కృతిక జీవన పద్దతులు నేటికీ సజీవంగా అక్కడ కనబడతాయి.

        హోదాలను మరచి గ్రామస్తులందరూ ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఆనందంగా గడిపే జీవితం వారి జీవితం. పెద్దల ఆచారాలు, అలవాట్లు తప్పక పాటిస్తారు. వీటిని వారసత్వం తమ తనంతర జాతికి అందిస్తారు. ప్రతి మనిషిలోనూ మమకారం, సహకారం, పరోపకారం అనే సుగుణాలుంటాయి . కొత్తవారిని గౌరవించడం వాళ్లల్లో ఉన్న గొప్ప సంస్క్హారం. కల్తీలేని ప్రకృతిలో జీవిస్తున్న వీరు కష్టపడి పనిచేస్తూ, కష్టాలలో, సుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉంటారు. వారి కుటుంబ వ్యవస్థలో ఉన్నఆత్మీయత, అనుబంధాలు, మరువలేని మధురానుభూతినిస్తాయి. సమానత్వమంటే ఏమిటో వారినుంచి పట్టణవాసులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.


Sunday 1 October 2017

"మహాత్ముడు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు "



దేశంలో శాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషి చేద్దాం...
మనచుట్టూ వున్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం...
మహాత్మా గాంధీ అడుగుజాడల్లో పయనిద్దాం....దేశాన్ని అభివృద్దివైపు నడిపిద్దాం!


జాతిపిత మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలతో ...


Friday 29 September 2017

ప్రకృతి స్వరూపిణి...ఆదిపరాశక్తి”

కోట్లానుకోట్ల జీవరాశులల్లో ఉండే జీవరూపశక్తి, సకల సృష్టికి కార్యకారణరూపిణి అయిన ఆదిపరాశక్తి...దుర్మార్గుల పై విజయఢంకా మోగించి, అఖిలలోకాలచేత కీర్తించబడే సర్వశక్తి స్వరూపిణి కనకదుర్గ. ప్రకృతి స్వరూపిణిగా వివిధ నామాలతో విరాజిల్లుతుంది. సర్వ సృష్టిని సస్యశ్యామలంగా చేసే తల్లి కనుక శాకంబరీదేవిగా కూడా పిలవబడుతూ, శరన్నవరాత్రులల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి, పదవరోజు శివశక్తుల కలయికగా శ్రీరాజరాజేస్వరీదేవిని స్తుతిస్తాం. ఈ నవరాత్రులలో ఒక్కోరోజు ఒక్కొక్క అవతారములో ఆ తల్లి దర్శనమిస్తుంది. సృష్టిలోని ఆణువణువూ అమ్మ ప్రతిరూపమే. ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. ఆమె సృష్టిలయకారిణి...జగదేకస్వరూపిని...సకలచరాచరణి. వీరత్వానికి ప్రతీకయినా దుర్గాదేవిని ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా కీర్తించినా, అర్చించినా అవన్నీ ఆదిపరాశక్తి జగన్మాతకే చేరుతాయి. దసరా నవరాత్రులలో అమ్మవారు విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక అలంకరణలతో ప్రకాశిస్తారు. పూలు, కుంకుమలతో అమ్మవారికి పూజలు చేస్తూ, సుఖసౌఖ్యాలు కలగజేయాలని భక్తులు కోరుకుంటారు. జగన్మాత దుర్గాదేవి మహిశాసురమర్దినిగా పూజలందుకుంటున్న వేళ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
కాయల నాగేంద్ర, హైదరాబాద్


Monday 4 September 2017

ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !



లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, గొప్ప తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు. గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు.  ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం ఉంది. గురువు లేని విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు.  ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం.  సమాజ నిర్మాణంలో కీలక పాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేకమైన రోజుని ఏర్పాటుచేసి, ఆవృత్తిని గౌరవించడం మన సంస్కృతి గొప్పదనం. ఈ రోజున వారిని సత్కరించాలి...వారి సేవలను గౌరవించాలి...వారి ఆదర్శాలను అనుసరించాలి.    గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు!


Friday 1 September 2017

భక్తికి, త్యాగానికి ప్రతీక 'బక్రీద్'


అల్లా కోరిక మేరకు తన ముద్దుల కుమారుడిని బాలి ఇవ్వడానికి పూనుకొని, కొడుకు మెడ పైన కత్తి పెట్టగానే ఆకాశం నుంచి ఓ ధ్వని వచ్చి 'నీ భక్తికి, త్యాగానికి నేను ముగ్ధున్నయ్యాను....  అందుకే నీ కొడుకు స్థానంలో పొట్టేలు బలి అయ్యింది. మీ తండ్రీకొడుకుల  త్యాగానికి ప్రతి సంవత్సరం జిల్ హజా మాసంలో  ఆర్థికంగా బాగున్న ముస్లింలు తమ సంపాదనతోనే జంతువులను కొని బలివ్వాలి.  అలా బలి అయిన జంతువు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భాగం తన కుటుంబం కోసం, రెండో భాగాన్ని బంధువుల కోసం, మూడో భాగం పేదలకోసం సమానంగా పంచాలి' అని సూచిస్తాడు.  ఇలా తండ్రీకొడుకుల త్యాగానికి ప్రతీకగా ముస్లింలు 'బక్రీద్' పర్వదినాన్ని జరుపుకుంటారు.  ముస్లిం సోదర సోదరీమణులకు 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు.

Thursday 24 August 2017

ప్రధమ దేవుడు. దివ్యశక్తి ప్రదాత శ్రీ విఘ్నేశ్వరుడికి జన్మదిన శుభాకాంక్షలు !
మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!!


Monday 14 August 2017

"స్వాతంత్ర్యయోధుల త్యాగఫలం ...సర్వజనులకిది పర్వదినం"

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది స్వాతంత్ర్య సమరయోధులు. అహింసాయుత మార్గంలో ఎందరో మహానుభావులు మన దేశానికి స్వేచ్చను అందించారు. జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినం....స్వాతంత్ర్యవీరుల త్యాగఫలం. ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి, మన దేశానికి విముక్తి లభించిన రోజు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !

Sunday 6 August 2017

పోతుకూచి సాంబశివరావుగారు ఇకలేరు.

బహుముఖ ప్రజ్ఞాశాలి, సుప్రసిద్ధ సాహితీవేత్త మా గురువుగారు డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారి మరణం సాహితీలోకానికి తీరనిలోటు. గత పాతిక సంవత్సరాలుగా ఆయనతో నాకు అనుబంధం ఉంది. 'విశ్వసాహితి' పక్షపత్రికలో నా రచనలు ప్రచురించి ప్రోత్సహించిన మహానుభావుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటూ...

Saturday 5 August 2017

"స్నేహబంధం ...ఎంతో మధురం"


అనుబంధం, ఆత్మీయతల కలబోత మన స్నేహబంధం. ఎలాంటి కల్మషం లేని పసిపాప మనసు లాంటి మన స్నేహబంధం నిత్యనూతనం. మధురమైన మచ్చలేని మన స్నేహబంధం నిత్యం వికసించాలి, పరిమళించాలి. అలసిన హృదయాలకు స్వాంతన చేకూర్చి, మన మైత్రీ బంధానికీ మనమే రక్షణ కవచంలా నిలవాలి.


Thursday 3 August 2017

"సౌభాగ్యప్రదం...వరలక్ష్మీవ్రతం"

మహిళలకు అత్యంత ముఖ్యమైనది... ప్రీతికరమైనది శ్రావణమాసం. అంతేకాదు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం కూడానూ.  అందుకే ఈ మాసమంతా మహిళలలో భక్తిభావం పొంగి పొర్లుతుంది.  ఏ ఇంటిలో చూసినా వ్రతాలు, నోములతో ఆధ్యాత్మక భావం కనపడుతుంది. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.  సృష్టి, స్థితి లయకారిణి అయిన  అమ్మవారు అనంత శక్తి స్వరూపిని.  ఈ ప్రపంచమంతా సర్వం తానై  ఇమిడి ఉంది.  అమ్మ కరుణఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ క్షణంలో మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది.  వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి,  నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన  వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం. 

 

Saturday 22 July 2017

ప్రమాదంలో దేశ యువత

క్షణికానందం కోసం ఎందరో యువతీయువకులు తమ నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మాదక పదార్థాలకు బానిసలైన వారి జీవితాలు చీకటి బతుకులేనని గ్రహించాలి. దేశంలో పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియాను సమూలంగా నాశనం చేయడానికి ప్రభుత్వానికి సహకరించినప్పుడే యువత భవిష్యత్తును కాపాడినవారవుతారు.  విద్యార్థులు మత్తు వైపు కాకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి.



Thursday 13 July 2017

"చెట్టు... జీవకోటికి ఆయువు పట్టు"



సర్వ జీవకోటికి ఆయువుపట్టు అయిన  చెట్లను నరకడం ఆపి, మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. పరిసరాలన్నింటిని పచ్చని చెట్లు నాటితే, భూమాత చల్లగా ఉంటుంది.  నాటిన చెట్లను సంరక్షిస్తే,  కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి.  దీంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి.     పచ్చదనం మీదే ప్రపంచం ఆధారపడివుందన్న విషయం మరవద్దు.  పచ్చదనం అంటే హడాహుడిగా మొక్కలను నాటి,  ఆ తర్వాత వాటి సంరక్షణను మరచిపోవడం కాదు.  మొక్కలను నాటడంపై ఉన్న శ్రద్ధ పోషణలో కనిపించాలి. 


Wednesday 5 July 2017

"రమణీయం"


స్వచ్చమైన ప్రేమకు 
అచ్చమైన ప్రతిరూపం
ఎంత ఆస్వాదిస్తే...
అంత రమణీయం 
చూపురులను...
రంజింపజేసే సమ్మోహనం !






పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు!

పవిత్ర రంజాన్ మాసం అత్యంత శుభప్రదమైనది.  ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.  మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి జీవనసాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి.  అంతేకాకుండా ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో  ఈ పవిత్ర గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే ఈ మాసమంతా  పవిత్రం, పుణ్యదాయకం. శుభాల సిరులు అందించే రంజాన్ పండుగ శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది.  ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది.  రంజాన్ మాసం చివరి రోజున ఉపవాసాలు ముగించి, ఆనందం వెల్లివిరిసిన హృదయంతో రంజాన్ పండుగను అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో  శోభాయమానంగా జరుపుకోవాలని ఆశిస్తూ...

       మిత్రులందరికీ పవిత్ర రంజాన్ పర్వదిన  శుభాకాంక్షలు!


Thursday 22 June 2017

"మన ఊపిరి "

ఎక్కడి నుంచో గాలికి కొట్టుకొచ్చిన చిన్న  విత్తనం నేలపైన పడి  చెట్టయి, పక్షులకు తోడునీడయి, వాటి పాలిత అన్నపూర్ణ అవుతుంది.  అంతేకాకుండా మనుషుల ప్రాణాలనుతోడే విషవాయువులను స్వీకరించి, జీవుల ప్రాణదాతగా జగతి, ప్రగతికి కొత్త ఊపిరినిస్తుంది.  చివరికి చెట్టు చనిపోయినాకూడా మానవ అవసరాలకు పనికొస్తుంది.    అందుకేనేమో మన పూర్వీకులు చెట్టును పూజించేవారు.  


Saturday 17 June 2017

"నాన్నగారు"


కుటుంబ సౌఖ్యం కోసం ...
ఇంట బయటా నిరంతరం 
పోరాడే నిస్వార్థయోధుడు  నాన్న!
బిడ్డల భవిష్యత్తు కోసం ..
ఒక సైనికుడిలా అహర్నిశలు శ్రమిస్తూ ...
తాను కొవ్వొత్తయి కరిగిపోతూ ...
నిత్యం వెలుగునిచ్చేవాడు నాన్న!
ఇంటిని, కుటుంబసభ్యులందరినీ 
ఒంటి స్తంభంలా మోసేవాడు నాన్న!


Monday 12 June 2017

సినారె గారికి అశ్రునివాలి.


ప్రముఖ సాహితీ దిగ్గజం , మాహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత  డా. సి. నారాయణ రెడ్డి గారి మరణం తెలుగుభాషకు తీరని లోటు.  సినారె గారికి అశ్రునివాలి.


Friday 9 June 2017

"అందమైన పువ్వులు ...అమ్మాయి నవ్వులు "


అమ్మాయి నవ్వితే మనకో ఆనందం. ఆమె అందంగా లక్ష్మిదేవిలా నడుస్తుంటే మనకో సంబరం. అమ్మాయి ముచ్చటగా మాట్లాడుతుంటే మనసంతా ఉల్లాసం. కానీ, అమ్మాయి పుట్టిందంటే మాత్రం ఇంటిల్లిపాదీ ఉస్సూరంటుంది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నా... స్త్రీలు రాష్ట్రాలను, దేశాన్ని ఏలుతున్నా...ఆడపిల్లల పట్ల వివక్షాత్మక ధోరణి ముదురుతున్నడం నిజంగా మన దౌర్భాగ్యం. ఆడపిల్ల అమ్మ కడుపులో వుందని తెలియగానే అక్కడే ఛిద్రమై పోతోంది. ఇలా ఆడపిల్లలను పొట్టన పెట్టుకునే ధారుణమైన చరిత్ర పెద్ద పెద్ద ఇళ్ళల్లో, బాగా చుదువుకున్న వారిలో జరగడం బాధాకరం. ఎక్కడ స్త్రీ ఉంటుందో అక్కడ పవిత్రత వుంటుంది. వారి నవ్వులోనే వుంటుంది కమ్మనైన ప్రపంచం. స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నట్లే, పురుషులతో సమానంగా ఎదగనివ్వాలి. దేశంలో ఆడ, మగ సంఖ్య సమానంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందటానికి వీలు కలుగుతుం


Thursday 1 June 2017

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు !


ఏ ఉద్యమైనా,పోరాటమైనా విజయవంతం కావాలంటే, అన్ని వర్గాల సహాయసహకారాలు కావాలి. అదే విధంగా ప్రజలు ఉద్యమంలో మమేకమై స్వచ్చందంగా పాల్గొనాలి. అలా అన్ని రంగాల్లోని ప్రజలు, కులవృత్తులవాళ్ళు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, కవులు, కళాకారుల పోరాటంతో సాధించిన రాష్ట్రం తెలంగాణా రాష్ట్రం. ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమం ప్రత్యేకమైనది. చాలా మంది ఉద్యమకారులు తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు, బలిదానాలు చేసుకున్నారు. అయినా అందరిలోనూ ఒకటే ఆకాంక్ష అదే తెలంగాణ రాష్ట్రము సాధించాలనే పట్టుదల. అందుకే ఉద్యమకారులందరూ కలిసికట్టుగా నడిచారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారు. ఉద్యమకారులకు వందనాలు... అభివందనాలు. అందరికీ తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు !

Saturday 13 May 2017

అమ్మదనం ...ఎంతో కమ్మదనం!


జన్మనిచ్చి జీవితాన్ని పంచిన తొలి దైవం .... కళ్ళముందు ఉండే మరో బ్రాహ్మ అమ్మ. నవమాసాలు మోసి జన్మనిచ్చి, అనురాగ ఆత్మీయాలను పంచే మరపురాని మరువలేని మాతృమూర్తి అమ్మ. కన్నబిడ్డలకు ఉగ్గుపాలతో స్పర్శనిచ్చి వాళ్ళ భవిషత్తుకు పునాదివేసే అమృత వర్షిని.  అందుకే అమ్మతో పోల్చడానికి ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది అమ్మ ఋణం.  బిడ్డల శ్రేయస్సే తన జీవితాశయంగా భావించే అమ్మ అంటే ఎవరో కాదు  ప్రేమకు ప్రతి రూపం... మమతల మకరందం.  దేవుడున్నాడో లేదో తెలియదు కానీ మనకు జన్మ నిచ్చిన తల్లే ప్రత్యక్ష దైవం. అందుకే ప్రతిఒక్కరూ అమ్మ అనే స్త్రీ మూర్తులను గౌరవిద్దాం.  మాతృమూర్తి అయిన 'స్త్రీ'ని దైవసమానులుగా భావిద్దాం.  ఏడాది ఒక్కసారి వచ్చే మాతృదినోత్సవం రోజునే అమ్మను గుర్తుచేసుకోవడం గొప్పకాదు. కన్నతల్లిని ప్రతిరోజూ గుర్తుచేసుకుంటూ... అమ్మను కంటికి రెప్పలా చూసుకొన్ననాడే నిజమైన మాతృదినోత్సవం. 

Sunday 30 April 2017

నేడే...మేడే !


ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి, శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపిన రోజు 'మే' డే. అప్పటి నుంచి కార్మిక శక్తికి ప్రతిరూపమైన మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ, ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలోతప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం ఇప్పటికి కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు.  దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా  చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక,  సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.


         కార్మిక సోదర సోదరీమణులందరికీ 'మే' డే శుభాకాంక్షలు! 




Wednesday 26 April 2017

స్మోకింగ్...స్లోపాయిజన్ !

సిగరేట్టు వెలిగించి బూడిదచేసి పారేస్తున్నామని ఆనందపడకండి... మీరు పీలుస్తున్న పొగ మీజీవితాన్ని బూడిదగా మారుస్తుదనే వాస్తవాన్ని గుర్తించండి.  




Friday 21 April 2017

పుడమితల్లి ఆవేదన !

ఆధునిక అవసరాల పేరుతో...
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ...
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
 ధన సంపాదన కోసం...
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ...
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తూ...
మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !

Wednesday 12 April 2017

నమస్కారానికి ప్రతినమస్కారం !

పరిచయస్తులు ఎదురయినప్పుడు నమస్కరించడం మనదేశ సంప్రదాయం.  అంత మాత్రాన మనకంటే వారు ఎక్కువ అన్న భావన కాదు.  అందుకు ప్రతిగా అవతల వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేయడం సభ్యత అనిపించుకుంటుంది. నమస్కారం అన్నది ఆత్మీయతతో కూడిన పలకరింపు. ఇలా ఒకరికొకరు గౌరవించుకోవడం వలన మానవ సంబంధాలు బలోపేతం అవుతాయి.   


Monday 10 April 2017

నమ్మినబంటు

వాయుదేవుని అనుగ్రహంతో కేసరి, అంజనకు  జన్మించినవాడు హనుమంతుడు. సూర్యభగవానుడి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించిన ఆంజనేయుడు భక్తులలో అగ్రగణ్యుడు. అపారగునసంపన్నుడు.  అంతేకాదు తేజోసంపన్నుడు, గుణవంతుడు, వినయవంతుడు. శ్రీరామభక్తుడు, నమ్మినబంటు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన  శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన వారికి,  స్తుతించినవారికి గ్రహదోషాలు దూరమవుతాయని,  శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Thursday 6 April 2017

"పవిత్ర ప్రేమ"

 మల్లెపువ్వులాంటి 
స్వచ్చమైన మనసుతో 
చేసే బంధం పవిత్రబంధం!
ఆ ప్రేమ బంధంలో ...  
 చల్లని చూపులు...   
మధురమైన మాటలు ... 
ఆప్యాయతానురాగాలు... 
చిరుదరహాసాలు...ఉంటే చాలు
ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది  
అలాంటి ప్రేమను పొందినవారి మనసు
ఎప్పుడూ ఆనందంతో పరిమళిస్తూ ఉంటుంది.