నేను ఓటరుగా నమోదు అయినందుకు గర్విస్తున్నాను. నేను నాయొక్క ఓటు హక్కును వినియోగించుకుంటానని, అర్హులైన ప్రతి ఓటరు చేత తప్పనిసరిగా ఓటు వేయిస్తానని, అదేవిధంగా ఓటు హక్కు వినియోగించు సందర్భంలో ధన, కుల, మద్యం, కానుకలు మరియు బంధుప్రీతిలాంటి వాటికి లొంగనని , అదేవిధంగా ఇతర అర్హులైన ఓటర్లను కుడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చూస్తానని, చిత్తశుద్ధితో, నిబద్ధతతో ప్రతి ఒక్క పౌరునితోఓటు వేయించి నా సామాజిక బాధ్యతను నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Thursday, 24 April 2014
Tuesday, 22 April 2014
ఆలోచించండి ... ఓటు వేయండి !
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఓటును హక్కుగానే కాకుండా మన ధర్మంగా భావించాలి. మనం ఓటు వేసేటప్పుడు మన ప్రాంతం వాడనో, మన కులం వాడనో, మన మతం వాడనో చూడకుండా అభ్యర్థి సామర్థ్యం చూసుకుని ఓటువేయడం మరచిపోవద్దు. ఓటు అనేది మనకు లభించిన గొప్ప ఆయుధం. అముల్యమైన ఓటును సక్రమంగా వినియోగించుకోవడం మన భాద్యత. బలమైన, నీతిపరమైన , నాణ్యమైన ప్రభుత్వం కోసం ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవడం మన కర్తవ్యం. కలిసిమెలిసి వున్న ప్రజలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుల పట్ల అప్రమత్తతగా ఉండాలి. పార్టీలకతీతంగా ప్రజల బాధలను, అవసరాలు తెలిసిన వారినే ఎంపిక చేసుకొవాలి. పోటి చేసే వారిలో అందరూ మంచివాళ్ళు లేకపోయినా, ఉన్నవారిలో కాస్త మంచివారిని ఎంపిక చేసుకోవడం మరవద్దు.
Friday, 18 April 2014
Thursday, 17 April 2014
నేడు శుభ శుక్రవారం !
క్రైస్తవ సోదరీ సోదరులకు ముఖ్యమైన దినాలలో ప్రధానమైనది 'గుడ్ ఫ్రైడే' ఒకటి. ఏసు క్రీస్తును శిలువ చేసిన రోజు... ఈ రోజే కాబట్టి ఆయన్ని నిష్టతో పూజిస్తే... పుణ్య ఫలాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఏంతో పవిత్రమైన, శుభకరమైన ఈ శుక్రవారం నాడు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏసుక్రీస్తు శిలువలో మానవాళి కోసం మరణించడాన్ని గుర్తుచేసుకునే రోజు 'గుడ్ ఫ్రైడే'. ఆయన మరణించిన మూడో రోజు ఆదివారం నాడు క్రీస్తు తిరిగి జన్మించాడని క్రైస్తవ సోదర సోదరీమణులు ఈస్టరు పర్వదినాన్ని సంతోషంతో ఘనంగా జరుపుకుంటారు.
మత గ్రంధాలన్నీ మంచినే బోధిస్తాయి. అందుకే అన్ని మత గ్రంధాలను చదువుదాం... మంచిని గ్రహిస్తాం... మనిషిగా సాటి మనిషిని ప్రేమిద్దాం!
Wednesday, 16 April 2014
Saturday, 12 April 2014
పూదోట !
రంగు రంగు పూలు కనిపించినా... వాటి సువాసనలు తగిలినా మనసుకు ఎంతో ఉల్లాసం, ప్రశాంతతను కలిగిస్తాయి. కొన్ని పూలు మనుషులలో మూడుని, రోమాన్స్ ని కలిగిస్తాయి. అంత మహత్తర శక్తి ఈ పూలకి వుంది. ఎక్కడ పూల తోటలు ఉంటాయో... ఆ పరిసరాలలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈ పూలను దేవుని పటాలకు వేయడం, స్త్రీలు తలలో ధరించడం ద్వారా భారతీయ సాంప్రదాయ విశిష్టతను తెలియజేయడం జరుగుతోంది. అదేవిధంగా పూల చెట్లకు వుండే పచ్చదనం మన కళ్ళముందు వుంటే, మనలో కలిగే ఆదుర్దా ఇట్టే తగ్గి పోతుంది. కాబట్టి మనం నివచించే చోట పచ్చదనానికి ప్రధాన్యత ఇచ్చి, పూలమొక్కలను పెంచుదాం... మన జీవితాలను ఆనంద భరితం చేసుకుందాం!
Wednesday, 9 April 2014
వచ్చింది వసంతం ... తెచ్చింది ఉత్తేజం !
ప్రకృతి రమణీయ శోభతో
పచ్చదనం శోభాయమానంగా
పరవళ్ళు తొక్కుతూ
మల్లెల సౌరభాలను మోసుకుంటూ
వచ్చింది ఆమని వయ్యారంగా...
తెచ్చింది అద్భుత వరాలను రమణీయంగా...
మావి చివురు తిన్న
కోయిలమ్మ మనోహరంగా కూస్తుంటే,
పిల్లగాలుల సుమధుర స్వరాలకు
గండు తుమ్మెద నాదం ఝుమంది
ప్రతి చేట్టులోను ఉల్లాసం
ప్రతి హరితలో పరవశం
ఎటు చూసినా పూల సోయగాలు
వాటి ఘుమఘుమలు
వీటిని అపురూపంగా ఆస్వాదిస్తూ
ఆమని హాయిగా రాగాలు ఆలపిస్తుంటే---
కొత్త పెళ్లి కూతురులా ముస్తాబై
అరమరికలు లేని పలకరింపులతో
ఉత్సాహంగా... వచ్చింది వసంతం
అందరిలోనింపింది నూతన ఉత్తేజం!
Monday, 7 April 2014
రమ్యమైనది ... శ్రీ రామ నామం !
"శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"
రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి
పఠించిన దానితో సమానము అంటారు. కనుక రామనామము అంత విశిష్టమైనది,
అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి, సోదరమైత్రికి లక్ష్మణుడు,
వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి, ప్రభుసేవ,
వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి. కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా
ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే
ఆయన ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
Sunday, 6 April 2014
Wednesday, 2 April 2014
దింపుడు కల్లం !
భర్త చనిపోవడంతో 'లబోదిబో' అని ఏడుస్తోంది వెంకాయమ్మ.
"నువ్వు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాడు తిరిగోస్తాడా?" ఓ పెద్దావిడ ఓదార్చుతోంది.
కొద్దిసేపటికి శవయాత్ర ప్రారభమైంది
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత "ఇది దింపుడు కల్లం, ఇక్కడ శవాన్ని దింపండి " ఓ పెద్ద మనిషి అన్నాడు.
"రోడ్డు మధ్యలో దింపడం ఎందుకు?" ఏడుపు ఆపి అడిగింది వెంకాయమ్మ
"నీ అదృష్టం బాగుంటే దింపుడు కల్లం లో నీ భర్త బ్రతికి లేచి కూర్చుంటాడు... ఇలాంటి కేసులు ఎన్నో జరిగాయమ్మా"
"ఆ అదృష్టం నాకొద్దు ... ఆయన్ను మళ్ళీ చంపే ఓపిక నాకు లేదు" అసలు విషయం చెప్పింది వెంకాయమ్మ.
Tuesday, 1 April 2014
అమ్మ సేవను మరువకు !
పేగుబంధాన్ని తెంచి...
తన ప్రాణాలను పణంగా పెట్టి...
మన భవిష్యత్తుకు పునాదులు వేసి...
మన కోసం కొవ్వొత్తిలా కరిగిపోయేది... అమ్మ!
ముళ్లబాటలో నడుస్తూ...
తన కడుపు మాడ్చుకుంటూ...
మన కడుపు నింపుతూ...
మన అభివృద్ధి కోసం కర్పూరమై కరిగేది ... అమ్మ!!
మన క్షేమం కోసం అనుక్షణం శ్రమిస్తూ...
మన ఉన్నతి కోసం నిరంతరం పరితపిస్తూ...
మనల్ని కంటికి రెప్పలా కాపాడేది
తానే దీపమై మనకు వెలుగునిచ్చేది... అమ్మ!!!
అందుకే ...! జీవితాంతం
అమ్మ సేవను మరువకు
అమ్మ మనసును నొప్పించకు