Monday 11 June 2012

ఓటర్లకు తాయిలాలు


          నిన్న మా ఆఫీసులో పనిచేసే ఒకతను  భార్యాపిల్లలతో బస్టాండ్ లో  కలిసాడు.  'ఓటు వేయడానికి మా ఊరికి వెళ్తున్నాను' అన్నాడు.  'ఓటు వేయడానికి ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాడు' అంటే ప్రజాస్వామ్యం మీద వాడికున్న నమ్మకాన్ని చూసి అతన్ని  అభినందించాను.  'ప్రజాస్వామ్యానికి ఓటే పునాది' అని అతనితో  అంటే,  ప్రజాస్వామ్యమా...? నా బొందా...! ఒకపార్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు, ఇంకొక పార్టీ వాళ్ళు ఐదు వందలు, మరో పార్టీ వాళ్ళు బంగారు ముక్కుపుడక.. వీటితో పాటు మద్యం, బిర్యాని ప్యాకెట్లు ఇస్తున్నారని మా గ్రామం వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్తున్నాను అన్నాడు.

        రాష్ట్రంలోఉపఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇక ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలయింది. తాయిలాలు ఓటర్లకు  అందించడానికి సిద్దమయ్యారు. ఆడవారికి చీరలు, ముక్కుపుడకలు, మగవారికి మద్యం, డబ్బు, గల్లీ నాయకుడికయితే స్కూటర్, సెల్ ఫోన్, ఇంటికో బస్తా బియ్యం ఇలా కోట్లాది రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేసున్నారు.  ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి.  ఓటును అమ్ముకోవడం మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.  ఓటు మన జన్మ హక్కు.  దాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం.  ఎంతో విలువైన ఓటును మద్యానికి, డబ్బుకు ఆశపడి అమ్ముకోవడం అంత నీచమైన పని మరొకటిది ఉండదు.