”శోధిని”

Thursday 29 March 2018

నేడు ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం

చైత్ర శుద్ధ నవమి నాడు దేశమంతా శ్రీ సీతారామ కళ్యాణం జరిపితే,  ప్రసిద్ధ  పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయంలో మాత్రం చైత్రమాసం పున్నమినాడు  వెన్నెల వెలుగులో కోదండరాముని కల్యాణం  నిర్వహించడం ఈ  ఆలయం  ప్రత్యేకత!  అంతేకాదు శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు  ఘనంగా నిర్వహిస్తారు.  ఇక్కడ సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి ఒంటిమిట్టను  'ఏకశిలానగరం' అని కూడా పిలుస్తారు.  ఆంజనేయుడు లేని రామాలయం కూడా బహుశా ఈ ఆలయమే.  హైదరాబాద్ నుండి మా  స్వగ్రామం వెళ్ళే రహదారిలో ఈ క్షేత్రము ఉంది.  చిన్నప్పుడు  తోటి స్నేహితులతో కలసి  తరచూ ఈ క్షేత్రాన్ని దర్శించుకొనేవాళ్ళం. 




మనుషులంతా ఒక్కటే!



Sunday 25 March 2018

శ్రీరామనవమి శుభాకాంక్షలు !


శ్రీరామనవమి నాడు శ్రీరామచంద్రుడిని రంగురంగుల పూలతో అలంకరించి, రుచికరమైన పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించి, సీతాదేవిని మారేడు దళములతో, ఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చిస్తే అనంత ఫలితాలు కలుగుతాయంటారు.   'రామ' అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము అంటారు. కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి, సోదరమైత్రికి లక్ష్మణుడు, వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి, ప్రభుసేవ, వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి. కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయాడు.


కలియుగ దైవం

నల్లనివాడు, పద్మనయనాలు కలవాడు శ్రీ వేంకటేశ్వరుడు ఎంతో  అందంగా, నిత్యం అద్వితీయ తేజస్సుతో విరాజిల్లుతుంటాడు.  ఇంత దివ్యమంగళ స్వరూపం మరేదేవుడికి లేదని చెప్పవచ్చు.  అందుకే భక్తులు కన్నార్పకుండా చూస్తూ ఆయన ఆకర్షణలోపడి తామని తాము మరచిపోతుంటారు.  స్వామి అంత  మనోహర సుందరమూర్తి మరెక్కడా కానరాడు.  అందువల్లే ఈ కలియుగంలో  ప్రత్యక్షదైవం జగన్మోహనుడయి,   భక్తుల గుండెల్లో కొలువయ్యాడు.  తలచుకోగానే కళ్ళముందు స్వామి దివ్యమంగళ స్వరూపం  సాక్షాత్కరిస్తుంది.  గుండెల్లో దివ్యానుభూతిని గుబాళింపజేస్తుంది.  తిరుమలతో  సమానమైన ప్రదేశం ప్రపంచంలో మరొకటిలేదు.  వెంకటేశునితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు. 


Saturday 17 March 2018

ప్రకృతి రమణీయం 'ఉగాది'

వసంత ఋతువులో ప్రకృతి  తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది.  చెట్లన్నీ చిగురించి, ఫలపుష్పాలతో  ఆహ్లాదకరమైన వాతావరణంలో  కనువిందు చేస్తుంటాయి.  మామిడిపూత, లేత మామిడికాయలతో.... తెల్లని వేపపూత, ధవళ మల్లెల సువాసనలు తీయని ఊహలు తలఎత్తేలా  చేస్తుంటాయి.  ఇటువంటి  ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మ సృష్టికార్యం ప్రారంభించడం జరిగింది.  ఆసమయాన్నే యుగాదిగా అభివర్ణించడం జరిగింది.  నాటి యుగాదే నేటి  ఉగాది.  ఉగాదికి మరో ప్రత్యకత ఉగాది పచ్చడి.  వగరు, పులుపు, తీపి, చేదు, కారం, ఉప్పు  అనే ఆరు రుచుల సమ్మేళం దివ్య ఔషధమని చెప్పవచ్చు.  ఈ పచ్చడి సేవించడం వల్ల  వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది.  ఉషోదయపుకాంతితో కొత్త కోరికలు, కొత్తఆశలు తనవెంట తీసుకొచ్చే నూతన సంవత్సరానికి (ఉగాదికి ) ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుదాం. 

మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు!

Thursday 1 March 2018

అందరికీ హోలీ శుభాకాంక్షలు!

పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాలతో... ఆహ్లాదంగా జరుపుకునే సరదా పండుగ హోలి. వసంత వేల ప్రకృతిలోని అనేక రంగుల పూలతో మమేకమయ్యే రోజు హోలి పూర్ణమి. సంప్రదాయ బద్దమైన రంగుల పండుగ కాబట్టి రంగు వచ్చే రకరకాల పూలతో, ముఖ్యంగా మోదుగ పూలతో తయారు చేసుకున్న రంగులతోనే హోలి జరుపుకోవడం ఉత్తమం. కృత్రిమ రసాయనిక రంగులు వాడి చర్మ వ్యాధులు తెచ్చుకోవడం మూర్ఖత్వం. అంతేకాదు రసాయనిక రంగులు వాడటం వలన కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉందని మరచిపోవద్దు. రంగులు చల్లుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటూ, సున్నితమైన రంగులతో సరదాగా కాసేపు ఆడుకుని, ఆవెంటనే వంటికి అంటిన రంగుల్ని తొలగించుకోండి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ హోలి పండుగను ఆనందంగా జరుపుకోండి.