”శోధిని”

Tuesday 20 February 2018

"నేడు మాతృభాషా దినోత్సవం"

ఆత్మగౌరవాన్ని ప్రసాదించే మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి భాద్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. దాంతో భాషకి పటుత్వం పెరుగుతుంది. భాష ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే ఆ భాషకి ఖ్యాతి పెరుగుతుంది. ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మనందరం మన మాతృభాషలో మాట్లాడుకుందాం! తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుదాం!!


Tuesday 13 February 2018

"ప్రేమికుల రోజు"


ప్రేమికుల రోజు కేవలం యువతీయువకులకే  పరిమితం కాదు.   స్వఛ్ఛమైన  ప్రేమను  పంచే  అన్ని వయసులవారిలోనూ  ఎప్పుడైనా, ఎక్కడైనా  ప్రేమ కలగవచ్చు.   ఈ విధంగా ప్రకృతిలోని జీవులన్నీ  ప్రేమకు  అర్హులే!  ప్రేమ  'వన్ సైడ్ లవ్' కాకుండా ఇరువైపులా  ఉంటే, అది పవిత్రంగా ఉంటుంది.  అలా కాకుండా ఒకవైపే  ప్రేమ వుంటే... కోరి చుక్కులను, సమస్యలను  తెచ్చుకున్నట్టు అవుతుంది.   ఇరువైపులా పవిత్రమైన ప్రేమ ఉన్నవారే నిజమైన ప్రేమికులు. ప్రేమకు పద్ధతులు, హద్దులు, విలువలతోపాటు బాధ్యతలు ఉండాలి.   ప్రేమంటే సరైన వ్యక్తిని ఎన్నుకోవడం కాదు.  మనం సరైన వ్యక్తిగా ఉండాలి.  ప్రేమంటే కేవలం తీసుకోవడం కాకుండా ఇవ్వడం కూడా తెలిసుండాలి.  స్వఛ్ఛమైన  ప్రేమ లేనిచోట మానవత్వం ఉండదు.  ప్రేమ సహజంగా ప్రకృతి  పులకించేలా పుట్టాలి.  ప్రేమతత్వాన్ని , ప్రేమలోని గొప్పతనాన్ని  తెలుసుకోగలిగినవారే   నిజమైన ప్రేమికులవుతారు. 

Monday 12 February 2018

అభిషేక ప్రియుడు


మహాదేవుని మహిమాన్విత రాత్రి, సకలలోకాలకు శుభరాత్రి... మహాశివరాత్రి.  బ్రహ్మవిష్ణువుల మధ్య వివాదం పరిష్కరించడానికి జ్వలాస్తంభంలో తేజోలింగ రూపంలో ఆవిర్భవించాడు శివుడు.  ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్థశిని భక్తులు భక్తిశ్రద్దలతో  పగలంతా ఉపవాసం వుండి, రాత్రంతా ప్రార్థనలు, పూజలు, అభిషేకాలతో జాగారం చేస్తారు.  లేతమారేడు దళాలను, ధూపదీపవైవేద్యాలు, తాంబూల ఫలాలను శివునికి సమర్పించుకుంటారు.  ఇవన్నీ పరమేశ్వరుడుకి ఎంతో ప్రీతికరం.  శివ స్తోత్రము తెలియనివారు భక్తిశ్రద్దలతో ‘ఓం నమశ్శివాయ’  అని స్మరిస్తూ,  శివసాన్నిధ్యం పొందగలుగుతారు.  పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి,  రెండుమారేడు దళాలు... దోసెడు నీళ్ళు శివలింగం పైన పోసి, కొంచెం భస్మం రాస్తే చాలు   ఆయన పొంగిపోతాడు...కోరిన వరాలు ఇస్తాడు.  శివరాత్రి నాడు శివారాధన మించిన పుణ్యం లేదంటారు. 

మీకు,  మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి  శుభాకాంక్షలు !