”శోధిని”

Sunday 30 April 2017

నేడే...మేడే !


ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి, శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపిన రోజు 'మే' డే. అప్పటి నుంచి కార్మిక శక్తికి ప్రతిరూపమైన మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ, ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలోతప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం ఇప్పటికి కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు.  దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా  చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక,  సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.


         కార్మిక సోదర సోదరీమణులందరికీ 'మే' డే శుభాకాంక్షలు! 




Wednesday 26 April 2017

స్మోకింగ్...స్లోపాయిజన్ !

సిగరేట్టు వెలిగించి బూడిదచేసి పారేస్తున్నామని ఆనందపడకండి... మీరు పీలుస్తున్న పొగ మీజీవితాన్ని బూడిదగా మారుస్తుదనే వాస్తవాన్ని గుర్తించండి.  




Friday 21 April 2017

పుడమితల్లి ఆవేదన !

ఆధునిక అవసరాల పేరుతో...
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ...
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
 ధన సంపాదన కోసం...
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ...
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తూ...
మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !

Wednesday 12 April 2017

నమస్కారానికి ప్రతినమస్కారం !

పరిచయస్తులు ఎదురయినప్పుడు నమస్కరించడం మనదేశ సంప్రదాయం.  అంత మాత్రాన మనకంటే వారు ఎక్కువ అన్న భావన కాదు.  అందుకు ప్రతిగా అవతల వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేయడం సభ్యత అనిపించుకుంటుంది. నమస్కారం అన్నది ఆత్మీయతతో కూడిన పలకరింపు. ఇలా ఒకరికొకరు గౌరవించుకోవడం వలన మానవ సంబంధాలు బలోపేతం అవుతాయి.   


Monday 10 April 2017

నమ్మినబంటు

వాయుదేవుని అనుగ్రహంతో కేసరి, అంజనకు  జన్మించినవాడు హనుమంతుడు. సూర్యభగవానుడి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించిన ఆంజనేయుడు భక్తులలో అగ్రగణ్యుడు. అపారగునసంపన్నుడు.  అంతేకాదు తేజోసంపన్నుడు, గుణవంతుడు, వినయవంతుడు. శ్రీరామభక్తుడు, నమ్మినబంటు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన  శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన వారికి,  స్తుతించినవారికి గ్రహదోషాలు దూరమవుతాయని,  శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.

Thursday 6 April 2017

"పవిత్ర ప్రేమ"

 మల్లెపువ్వులాంటి 
స్వచ్చమైన మనసుతో 
చేసే బంధం పవిత్రబంధం!
ఆ ప్రేమ బంధంలో ...  
 చల్లని చూపులు...   
మధురమైన మాటలు ... 
ఆప్యాయతానురాగాలు... 
చిరుదరహాసాలు...ఉంటే చాలు
ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది  
అలాంటి ప్రేమను పొందినవారి మనసు
ఎప్పుడూ ఆనందంతో పరిమళిస్తూ ఉంటుంది.  

Tuesday 4 April 2017

"కళ్యాణ వైభోగం"


సకల గుణాభిరాముడు 
సద్గుణ సంపన్నుడు 
సత్యధర్మ పరాయణుడు 
శ్రీరామచంద్రుడి జన్మదినం 
లోకానికంతటికీ పర్వదినం 
సీతారాముల కల్యాణం 
సర్వజనులకు ఆనందదాయకం 
శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో 
మనం భాగస్వాములవుదాం
సకల శుభాలను పొందుదాం !
"శ్రీరామ రక్ష...సర్వజగద్రక్ష" 
 

Sunday 2 April 2017

నేతల మాటలు-నీటి మూటలు


త్రాగునీటి కోసం 
ఎండలో  ఇబ్బందులు పడుతూ ...
బిందెను నింపి 
భుజాన మోస్తూ ...
బారులు తీరిన మహిళలు!
ఎంత దూరమైతేనేం
గుక్కెడు నీళ్ళ కోసం!!
నేతల మాటలు-నీటి మూటలు