”శోధిని”

Sunday 18 September 2016

ఉగ్రఘాతుకం


మనదేశ రక్షణకోసం నిరంతరం శ్రమిస్తున్న మన సైనికులను దొంగచాటుగా దేబ్బదీసిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. మనకోసం, మనదేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని తెలియచేద్దాం!


Wednesday 14 September 2016

"జలధారలు"


వరునిదేవుడి కుండపోత ...నింగినుండి నేలవరకు జలధారలు... మూడురోజుల నుండి ఇదే తీరు.  ఆకాశం నల్లని మేఘాలతో భూమి మీదికి విరుచుకుపడుతోంది.  భూమి మీద ఉన్న అన్ని కాలుష్యాలను ప్రక్షాళన చేసే వరకు విశ్రమించకూడదని ఒట్టు పెట్టుకున్నట్టు... వరుణుడు తన ప్రతాపం  చూపిస్తున్నాడు.  పుడమి పులకరించి... చెరువులు జలకలతో మెరుస్తుంటే, పచ్చని చేలు  మురుస్తున్నాయి.

 

Monday 12 September 2016

నిశ్శబ్ద వానజల్లులు !


నల్లటి మబ్బులు కమ్మలేదు 
అయినా నీలిమేఘాలు వర్షిస్తున్నాయి 
ఉరుములు, మెరుపులు లేవు
కానీ, ప్రశాంత గగనంలోంచి ...
నిశ్శబ్ద వానజల్లులు  జాలువారుతున్నాయి
చిటపటచినుకులతో  ప్రకృతి పరవశించింది  
చల్లని వాతారణానికి మేను పులకించింది !

 

త్యాగానికి చిహ్నం 'బక్రీద్'



ప్రతి పండుగ వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది.  అలాంటి సందేశాత్మక పండుగలలో మంచికోసం, మానవ సంక్షేమం కోసం పాటుపడుతూ త్యాగానికి ప్రతీతగా భక్తిభావంతో జరుపుకునే పండుగ 'బక్రీద్'.  ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ  త్యాగం, పరోపకారం లాంటి  సుగుణాలను అలవరచుకోవాలని కోరుకుంటూ, మిత్రులందరికీ 'బక్రీద్' పర్వదిన శుభాకాంక్షలు !

Friday 9 September 2016

నిత్యానందుడు !


దివ్యస్వరూపుడు... విఘ్నేశ్వరుడు
విఘ్నాలను హరించే ఓంకార స్వరూపుడు
మట్టితో మలచబడ్డ మా అపార్ట్ మెంట్ 
గణనాథుడు...నిత్యానందుడు !


"నిజమైన భక్తి"

 
పుణ్యమంతా తమకే దక్కాలనే ఉద్దేశంతో కొందరు 'భక్తి' అనే ముసుగులో అంగరంగ వైభోగాలకు, ఆడంబరాలకు వెళుతూ ఉంటారు.  దీనికి కారణం మన చుట్టూ ఉన్న వాతావరణం, అవగాహనారాహిత్యం.  ఇలాంటి భక్తి ఎప్పటికీ నిజమైన భక్తి అనిపించుకోదు.   హృదయంలో నిత్యం  భగవంతుడిని నిలుపుకొని పత్రమో, ఫలమో, పుష్పం లేదా నీటినిగాని భక్తితో భగవంతుడికి సమర్పించిన వారికి భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.  అంతేకాదు ఎదుటివారిని గౌరవిస్తూ, వారిలో దేవుడ్ని చూడటమే  నిజమైన భక్తి.  నన్ను మించిన వారు లేరు  అనే అహంభావం, మంచి  చెడ్డల్ని విస్మరింపచేసే అహంకారంతో ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు. 

Sunday 4 September 2016

"మట్టి గణపతే...మహాగణపతి "



ఓంకారానికి మరో పేరు ప్రణవనాదం.  ఆ ప్రణవనాద స్వరూపుడు విఘ్నేశ్వరుడు.  అందుకే వినాయకచవితి నాడు నీటిలో కరిగే మట్టి విగ్రహాన్ని పూజించాలి... పర్యావరణాన్ని పరిరక్షించాలి.  కొండంత దేవుడుకి కొండంత పత్రి సమర్పించాకపోయినా ఫలమో, పత్రమో ఏదో ఒకటి స్వామికి నివేదిస్తే చాలు గణనాధుడు తృప్తి చెందుతాడు.  పర్యావరణ పరిరక్షణతో పాటు జలవనరులు, జీవరాసుల పరరక్షణ, మానవుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సహజసిద్ధమైన రంగులతో వినాయక విగ్రహాలను తయారుచేయడం వల్ల నీటిలో నివసించే జీవరాసులకు ముప్పు వాటిల్లదు.  మనం తినే ఆహారం, నీరు కలుషితం కాకుండా ఉంటాయి.   గణపతిని పూజించేందుకు ప్రకృతిలో లభించే ఆకులు, పువ్వులు, పండ్లను వినియోగిస్తాం.  వినాయక ప్రతిమలను మాత్రం ప్రమాదకరమైన రసాయానక రంగులతో తయారు చేస్తున్నారు.  భగవంతుడు ప్రమాదకరమైన రంగులను కోరుకోడు....ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన రంగులనే ఇష్టపడతాడు.   మట్టితో చేసి రంగులువేయని వినాయక విగ్రహాన్ని పూజించడం వలన  కరువు కాటకాలు రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని, వ్యవసాయాభివృద్ది కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

    మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!