”శోధిని”

Saturday 30 April 2016

"నేడే ...మేడే"

దేశాభివృద్ధి కోసం...  శ్రామికుడు !
దేశ రక్షణ కోసం... సైనికుడు !!
కార్మికుల శ్రమను దోచుకోవడానికి...
ప్రైవేట్ సంస్థలు !!! 

దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా  చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక,  సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు.  కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇది నిత్యం జరుగుతున్న సత్యం. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.



Tuesday 19 April 2016

వాలు జడ వయ్యారం !


నడుముకు నడకలు నేర్పి
వయ్యారాలు వోలకపోసే  ...
బాపుగారి కొంటే జడ !
నల్లత్రాచులా మెలికలు తిరుగుతూ ...
మగవాడి మతి పోగొట్టే
సత్యభామ గడుసు జడ !
శ్రావణ మేఘాల్లాంటి నీలి కేశాలలో
పుష్ప సౌరభాలు వెదజల్లే ...
అందమైన పూలజడ
అందరికీ నచ్చే వాలుజడ !

Sunday 17 April 2016

ఏది నిజమైన పంచాంగం ?

ఉగాది రోజు రెండుతెలుగు రాష్ట్రాలలోని ప్రధాన రాజకీయ పార్టీలు వేర్వేరుగా పంచంగ శ్రవణం చెప్పించుకున్నారు. అయితే ఒక పార్టీ పంచాంగ శ్రవనానికి మరో పార్టీ పంచాంగ శ్రవనానికి పొంతన లేకుండా విరుద్ధమైన పంచాంగ శ్రవణాలు వినిపించారు పండితులు.  'ఈ సంవత్సరమంతా రాష్ట్రంలో మీరే నెంబర్ వన్' అని పార్టీ అధ్యక్షుల వారిని ఆకాశానికి ఎత్తేశారు.  శుభకార్యాలయాలలో మన తెలుగువారి సంప్రదాయ కుటుంబాలు  పంచాగాన్ని అత్యంత కీలకంగా భావిస్తారు.  అలాంటి పంచాగాన్ని ఎవరికి తోచిన విధంగా వారు తయారు చేసుకుని, ప్రజలను అయోమయానికి గురిచేయడం పండితులకు  న్యాయమా?  ఏ పంచాంగాన్ని ఆచరించాలో, దేనిని పట్టించుకోకూడదో  తెలియని పరిస్థితిలోకి  ప్రజలను నెట్టేశారు.  అంతా డబ్బు మహిమ.

Thursday 14 April 2016

శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు !





రమణీయమైన రామకథను ఎందరెందరో కవులు ఎన్నెన్నో భాషల్లో వ్రాసి చరితార్థులయ్యారు.  కోదండరాముని కథని ఎన్నిమార్లు విన్నా, చదివినా తనివి తీరదు. రామబాణం రక్షిస్తుంది... రామహస్తం దీవిస్తుంది... రామ పాదం నడిపిస్తుంది...రామమంత్రం సుఖశాంతులను అందిస్తుంది. రామ నామం మధురం... మధురాతి మధురం.  సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయం.  సీతారాముల కల్యాణ వేడుకల్లో  మనం కూడా మమేకమవుదాం... సకల శుభాలను పొందుదాం!

    -కాయల నాగేంద్ర

Monday 11 April 2016

అనురాగ శివుడు !



శివతత్వమంటే...ప్రేమతత్వం
శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే ..
శివుడినిలా మెలగడం !
పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ...
నోరారా 'శివా' అని స్మరిస్తూ ...
చెంబుడు నీళ్ళు ఆయన శిరస్సు పైన పోస్తే...
ప్రసన్నుడయి పోతాడు
మనం గోరంత అడిగితే..
కొండంత ఇచ్చేబోళాశంకరుడు
'శివా' అని స్మరిస్తే ...
శుభకరం ...మంగళకరం !

          

Thursday 7 April 2016

నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం !





























ఉగాది అంటే ...
కోయిల కుహు కుహూ రాగాలు 
పక్షుల కిలకిలా రావాలు 
పచ్చదనపు చిగుళ్ళు 
రంగురంగు పూల పరిమళాలు 
మధురమైన పండ్ల రుచులు 
సరికొత్త అనుభూతులు !
అంతే కాదు ...
కష్ట సుఖాలు, చీకటి వెలుగులను
ఒకేలా స్వీకరించాలని, 
ఆనందాన్ని, బాధలను 
సమానంగా చూడాలని చెప్పేది 
షడ్రుచుల ఉగాది పచ్చడి !
ఈ ప్రకృతి పండుగ  పర్వదినాన 
మనసును ఆహ్లాదకరమైన 
ఆలోచనలతోనింపితే ...
జీవితం సుఖమయం అవుతుంది.