”శోధిని”

Saturday 30 June 2012

పండ్లు తింటే...




     ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పండ్లు రోగాలు తెచ్చిపెడుతున్నాయంటే నమ్మశఖ్యంగా ఉండదు.  ఇది పచ్చి నిజం. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లు నేడు మార్కెట్లో  కనబడడంలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.  పండ్లు త్వరగా మగ్గడానికి వ్యాపారస్తులు తమ స్వలాభం కోసం అడ్డదారి తొక్కుతున్నారు.  పండ్లను మగ్గపెట్టడం కోసం ఇటీవల కాలంలో పలు ప్రాంతాలలో అనేక ఫ్రీజర్లు వెలసాయి.  అయితే వీటికి అనుమతులున్నాయా? అనుమతులు ఎవరు ఇచ్చారు? తెలియని పరిస్థితి.  పలు ప్రాంతాలలో కూడా ఇళ్ళలో కూడా ఈ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.  పండ్లను మగ్గించడానికి రసాయనాలను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. ఇలా రసాయనాలతో  మగ్గించిన పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.  డబ్బులను పెట్టి జబ్బులను కొంటున్నామని తెలుసుకోలేక పోతున్నారు.  ఇంత పబ్లిక్ గా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకొనేవారు  కరువయ్యారు.  ప్రభుత్వ అధికారులు మామూళ్ళ వేటలో ... పాలకులు అధికారాన్ని ఇలా నిలబెట్టుకోవాలని ఆలోచనలో మునిగి పోయారు.  అందుకే పండ్లను కొనేముందు  బాగా పరిశీలించి కొనండి. రసాయనాలతో మగ్గించిన పండ్లను  సులభంగా గుర్తుపట్టవచ్చు. ఈ పండ్లు గట్టిగా పసుపువర్ణంతో నిగనిగలాడుతూ ఉంటాయి. ప్రకృతి సిద్దంగా పండిన పండ్లను, రసాయనాలతో మగ్గించిన పండ్ల మధ్య తేడా గుర్తిస్తే , ఆరోగ్యానిచ్చే పండ్లను తినవచ్చు.



Tuesday 19 June 2012

పిల్లలతో వెట్టి చాకిరీ



ఇంటిపని కోసం బాలికలను ఉపయోగించుకోవడం సహించరాని నేరం.  మనకు ఎన్ని చట్టాలున్నా దురాచారాన్ని ఆపలేక పోతున్నాం. ప్రభుత్వం ఇంటి పనిని కూడా బాల కార్మిక చట్టం కిందికి తెచ్చింది కానీ, నేడు ఆర్ధికంగాను ఉన్నత స్థాయిలో వుండే వ్యక్తులు  బాల కార్మికుల చేత పని చేయించుకుంటున్నారు. చట్టాలు ఇతరులకే కానీ మనకు కాదని వాళ్ళ ధోరణిటీవీ లోనూ, మీటింగ్ లలోనూ బాల కార్మికుల నిర్మూలనే తమ ద్యేయం అంటూ  ఉపన్యాసాలు దంచేస్తారు. వీరి విషయానికి వచ్చేసరికి అవి కనిపించవు.  బాల కార్మికుల నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అధికారులే తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఎంతో మంది చిన్నారులు రోడ్డునపడుతున్నారు. అధికారులు ఇలా ప్రవర్తించడం రాజ్యాంగాన్ని ఉల్లంగించడమే అవుతుంది. న్యూస్ పేపర్ యాజమానులు  బాలకార్మికుల గురించి తెగ రాసేస్తుంటారు. వాళ్ళ పైన ఎక్కడలేని  ప్రేమ ఒలకపోస్తారు. కానీ, వారి పేపర్ ప్రింట్ అయిన దగ్గర నుంచి ప్రజలకు చేరే వరకు బాల కార్మికులతోనే పని చేయించుకుంటున్నారు.  ఎదుటి వారికి నీతులు చెప్పడమే కానీ మనకు కాదని వాళ్ళ ఉద్దేశం కాబోలు.  మగపిల్లలు  హోటల్స్ లోనూ, చిన్న చిన్న పరిశ్రమలలోనూ శ్రమ దోపిడీకి గురవుతుంటే , ఆడపిల్లలు ఇంటిపనిలో 24 గంటలు  చాకిరీ చేస్తూ లోలోన కుమిలి పోతున్నారు.  పని సరిగా చేయడంలేదని యజమానులు  వేధించడం, కొట్టడం జరుగుతోంది.  ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప, బాలకార్మికులను ఆదుకోవడంలో శ్రద్ధ కనపరచడంలేదు.  

Saturday 16 June 2012

వానా ...వానా ...వందనం!


         



          వారం నుంచి ఊరిస్తూ వస్తున్న  ఋతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలోకి ప్రవేశించాయి.  తొలకరిజల్లులు పుడమితల్లిని ముద్దాడటంతో మూడు నెలలనుంచి ఎండలకు బేజారయిన ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. వేసవి తాపాన్ని నుంచి బయట పడి చల్లదనాన్ని ఆస్వాదించారు.  చిరుజల్లులకు పుడమితల్లి పులకరించడంతో చల్లని గాలులు వీచాయి.  ఆకాశంలో కమ్ముకున్న నీలి మేఘాలు ఆహ్లాదకర మైన వాతావరణాన్ని అందించాయి.  వాతావరణంలో చోటుచేసుకున్న తేమ గాలులు రాష్ట్ర ప్రజలను ఆనందింప చేసింది.  చిరుజల్లులు పడటంతో కోటి ఆశలతో  రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.  కానీ, ఆశించినంత వర్షాలు కురవకపోవడంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  సాధారణంగా జూన్ మెదటి వారం నుంచే భారీ వర్షాలు కురవాలి.  మూడో వారం నడుస్తున్న పెద్దగా వర్షాలు పడకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి.  పరిస్థితిలో రైతులను వరుణ దేవుడే ఆదుకోవాలి.

Wednesday 13 June 2012

నాయకుల దొంగాట


ఈరోజు 'ఈనాడు లేఖలు'  శీర్షిక లో ప్రచురించారు.      


Monday 11 June 2012

ఓటర్లకు తాయిలాలు


          నిన్న మా ఆఫీసులో పనిచేసే ఒకతను  భార్యాపిల్లలతో బస్టాండ్ లో  కలిసాడు.  'ఓటు వేయడానికి మా ఊరికి వెళ్తున్నాను' అన్నాడు.  'ఓటు వేయడానికి ఇంత ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాడు' అంటే ప్రజాస్వామ్యం మీద వాడికున్న నమ్మకాన్ని చూసి అతన్ని  అభినందించాను.  'ప్రజాస్వామ్యానికి ఓటే పునాది' అని అతనితో  అంటే,  ప్రజాస్వామ్యమా...? నా బొందా...! ఒకపార్టీ వాళ్ళు వెయ్యి రూపాయలు, ఇంకొక పార్టీ వాళ్ళు ఐదు వందలు, మరో పార్టీ వాళ్ళు బంగారు ముక్కుపుడక.. వీటితో పాటు మద్యం, బిర్యాని ప్యాకెట్లు ఇస్తున్నారని మా గ్రామం వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్తున్నాను అన్నాడు.

        రాష్ట్రంలోఉపఎన్నికల ప్రచారం ముగిసింది.  ఇక ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలయింది. తాయిలాలు ఓటర్లకు  అందించడానికి సిద్దమయ్యారు. ఆడవారికి చీరలు, ముక్కుపుడకలు, మగవారికి మద్యం, డబ్బు, గల్లీ నాయకుడికయితే స్కూటర్, సెల్ ఫోన్, ఇంటికో బస్తా బియ్యం ఇలా కోట్లాది రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేసున్నారు.  ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి.  ఓటును అమ్ముకోవడం మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.  ఓటు మన జన్మ హక్కు.  దాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం.  ఎంతో విలువైన ఓటును మద్యానికి, డబ్బుకు ఆశపడి అమ్ముకోవడం అంత నీచమైన పని మరొకటిది ఉండదు.

       

Saturday 9 June 2012

చెత్త సినిమాలను తీయకండి!



 సగటు ప్రేక్షకుడు సినిమా నుంచి వినోదాన్ని ఆశించి థియేటర్ కు వస్తాడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వారికి సినిమానే ప్రధాన వినోదం.  కానీ, నేడు సకుటుంబ  సమేతంగా వెళ్లి చూడతగ్గ సినిమాలు కోశానా కనబడటం లేదు. వినోదం పేరిట  జుగుస్సాకరంగా వుండే అశ్లీల పదాలను యదేచ్చగా వాడుతున్నారు. కుటుంబ సభ్యులతో ఇలాంటి సినిమాకి వెళితే తల దించు కోవాల్సి వస్తోంది.  అడ్డమైన అశ్లీల పదాలను సెన్సారు వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు.  అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కథ, సున్నితమైన హాస్యం, వినసొంపు సంగీతం, శ్రావ్యమైన సంభాషణలతో పాటు వినోదాన్ని అందిస్తూ, మంచి సందేశాన్ని ఇవ్వడమే సినిమా ప్రధాన లక్ష్యం.  కానీ, ఇప్పుడొస్తున్న చిత్రాలలో ఇవేమీ కనిపించడం లేదు.  కేవలం హీరోల అభిమానుల  కోసమే సినిమాలు తీస్తున్నట్టు అశ్లీల సన్నివేశాలు, బూతు డైలాగులు, రక్తపు మడుగులను తెర నిండా నింపుతున్నారు.  కోట్ల రూపాయలు వసూలు చేసిందని సొంత డబ్బా కొట్టుకొనే చిత్రాలన్నీనా దృష్టిలో  చెత్త సినిమాలే. ఇలాంటి సినిమాలు సమాజానికిఉపయోగపడేవి కావు.  మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, తెలుగు భాషను  కనుమరుగు చేస్తున్న చిత్రాలు. హీరోలు డబ్బుకు ఆశపడకుండా మంచి చిత్రాలలో నటించడానికి పూనుకోవాలి.  అలాగే దర్శక నిర్మాతలు కేవలం డబ్బునే కాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తే, పదికాలాలు పాటు గుర్తుండిపోతారు.